అంతర్జాలంలో అభిప్రాయాల వెల్లడిపై కరకు ఆంక్షల కత్తులను వేలాడదీసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ 'రాజ్యాంగ విరుద్ధమైనది' అని ఆరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. స్వేచ్ఛాలోచనకు ప్రతిబంధకమై, పౌరుల భావ ప్రకటనా హక్కును హరిస్తున్న ఆ నల్ల నిబంధనను కొట్టేస్తూ 2015 మార్చిలో చరిత్రాత్మక తీర్పిచ్చింది. వాక్ స్వాతంత్య్ర పతాకాన్ని ఎత్తిపట్టిన ఆ విశిష్ట తీర్పు క్షేత్రస్థాయిలో కొల్లబోతోందన్న చేదు వాస్తవం నేడు సర్వోన్నత న్యాయస్థానాన్నే విస్మయపరుస్తోంది! సెక్షన్ 66ఏ కింద నేటికీ కేసులు నమోదవుతున్నాయని, న్యాయస్థానాల్లో వాటిపై విచారణలూ సాగుతున్నాయన్న పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) అర్జీపై స్పందిస్తూ- యంత్రాంగం తీరును 'సుప్రీం' ఈసడించింది.'జరుగుతున్నదంతా ఘోర'మని వ్యాఖ్యానించిన న్యాయపాలిక- రెండు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు చెత్తబుట్ట పాల్జేసిన సెక్షన్ 66ఏ కింద ఆ తరవాత 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదుకావడం- న్యాయపాలిక విస్పష్ట ఆదేశాలను పోలీసు యంత్రాంగం ఎంతగా అపహాస్యం చేసిందో కళ్లకు కట్టింది! 381 కేసులతో మహారాష్ట్ర, దాని వెనకే ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు బిగించిన వైనం ఆందోళన రేపుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు సైతం 53 కేసులతో ఈ దుష్కీర్తిలో భాగం పంచుకోవడం కలవరపరుస్తోంది. శ్రేయా సింఘాల్ కేసులో సెక్షన్ 66ఏ ను కొట్టేస్తూ తానిచ్చిన తీర్పు అమలు కావడం లేదన్న విషయం 2019లోనే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. దానిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం- కేసుల నమోదు ఆగకపోతే కఠిన చర్యలు తప్పవని కన్నెర్రచేసింది. 2015 నాటి తన తీర్పు ప్రతులను దిగువ న్యాయస్థానాలకు పంపాలని అన్ని హైకోర్టులకు చెప్పడమే కాదు, ఆ మేరకు పోలీసులకూ అవగాహన పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సర్వోన్నత న్యాయపాలిక ఇంతగా చొరవ తీసుకున్నా సరే, పౌరహక్కుల హననానికి అడ్డుకట్ట పడకపోవడమే ఆందోళనకరం!