'ఆకలి రక్కసి కబంధ హస్తాల్లోంచి స్వేచ్ఛ సాధించడమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం'- భారత తొలి ఆహార, వ్యవసాయ శాఖామాత్యులు బాబూ రాజేంద్రప్రసాద్ 1947 ఆగస్టు 15న జాతికి ఇచ్చిన పిలుపు ఇది! స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న ఈనాటికీ- ఆ భూతం బారి నుంచి ఇండియా విముక్తి పొందలేకపోయింది. 116 దేశాల తాజా అంతర్జాతీయ క్షుద్బాధా సూచీ(జీహెచ్‌ఐ)లో భారత రత్నగర్భ 101వ స్థానంలో నిలిచింది. జనావళి ఆకలిదప్పులను తీర్చడంలో నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల కన్నా వెనకబడి తరగని దుష్కీర్తిని మూటగట్టుకుంది. ప్రజల్లో పోషకాహార లోపం, పిల్లల్లో దుర్బలత్వం, ఎదుగుదల లోపాలు, శిశుమరణాల ప్రాతిపదికగా జీహెచ్‌ఐ నివేదిక వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా క్షుద్బాధా సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో ఇండియా ఒకటని అది స్పష్టీకరించింది.
అశాస్త్రీయ విధానాల్లో అధ్యయనం సాగిందంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర ప్రభుత్వం- క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆ నివేదిక అద్దంపట్టడం లేదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా అయిదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేని వారు దాదాపు 35శాతమని, ఎత్తుకు తగిన బరువుకు నోచుకోని వారు 17.3 శాతమని కేంద్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి గత జులైలో లోక్‌సభలో వెల్లడించారు. పోషకాహార లోపంతో దేశవ్యాప్తంగా పసిప్రాణాలెన్నో కడతేరిపోతున్నట్లు లోగడ ఎన్నో పరిశోధనలు నిగ్గుతేల్చాయి. కొవిడ్ కారణంగా తెగ్గోసుకుపోయిన కుటుంబాదాయాలతో పేదరికం పడగనీడ విస్తరిస్తోంది. తత్ఫలితంగా క్షుద్బాధా పీడితుల సంఖ్య సైతం ఇంతలంతలవుతోంది. ప్రజల్లో పోషక విలువలను ఇనుమడింపజేస్తూ, వారి జీవన ప్రమాణాల వృద్ధికి బాటలు పరవడం పాలకుల విధి. ఆ మేరకు దిశానిర్దేశం చేస్తున్న 47వ రాజ్యాంగ అధికరణ స్ఫూర్తికి మన్నన దక్కితేనే- 'అన్నమో రామచంద్రా' అంటూ అలమటిస్తున్న అభాగ్యులకు సాంత్వన లభించి, ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.