తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అటు సవాళ్లు... ఇటు అవకాశాలు.. కొత్త ఏడాదిలో నూతన ఆర్థికాధ్యాయం!

కరోనా కరకు దెబ్బల ధాటి నుంచి గతేడాది ఇండియా ఊపిరి పీల్చుకొంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం విరుచుకుపడింది. అయినా, నిరుడు భారత్‌ ఆర్థికంగా పురోగమించింది. నూతన సంవత్సరంలోనూ ఇండియాకు పలు సవాళ్లు ఎదురు కానున్నాయి. మరోవైపు కొత్త అవకాశాలూ అందిరానున్నాయి.

analysis-on-india-new-financial-chapter-in-2023
Etv 2023లో భారతదేశ నూతన ఆర్థికాధ్యాయం

By

Published : Jan 6, 2023, 7:03 AM IST

భారత్‌కు 2022 అనేక సవాళ్లు విసిరింది. కొవిడ్‌ వల్ల తలెత్తిన ఆర్థిక మందగమనం నుంచి నిరుడు ఇండియా క్రమంగా కోలుకొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో పరిస్థితి మళ్ళీ ప్రతికూలంగా మారింది. యుద్ధం వల్ల చమురు, ఎరువులు, ఇతర వ్యాపార సరకుల ధరలు చుక్కలనంటడంతో భారత్‌లో ద్రవ్యోల్బణం ఇంతలంతలైంది. దాన్ని అదుపు చేయడానికి పది నెలల నుంచి రిజర్వు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం బాగా పెరిగింది. కాసులతో ఖజానా కళకళలాడుతోంది.

అయితే, ఎరువులపై సబ్సిడీ వ్యయం పెరగడం ఖజానాకు గండి కొడుతోంది. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ విజృంభించి మదుపరులకు లాభాల పూలు పూయించాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచడంతో మార్కెట్ల విజృంభణకు పగ్గాలు పడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. అమెరికాలో మాంద్యం భయం, ఐరోపాలో ఆర్థిక మందగతి భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి. ఇండియా ఎగుమతుల్లో అమెరికా, ఐరోపాలు పెద్ద వాటా ఆక్రమించడమే దీనికి కారణం. ఇన్ని ఒడుదొడుకుల మధ్యా భారత్‌ ఆర్థికంగా పురోగమించగలిగింది. ప్రస్తుత ధరలపై గణిస్తే నేడు జీడీపీ పరంగా భారత్‌ ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. 2028 నాటికి జర్మనీ, జపాన్‌లను పక్కకునెట్టి మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుందని అంచనా.

సానుకూల పరిణామాలు..
ప్రస్తుతం ప్రపంచం రాజకీయంగా, ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. దాంతో ప్రపంచ దేశాలు పెట్టుబడుల ప్రవాహాన్ని నియంత్రిస్తున్నాయి. స్వీయ వాణిజ్య రక్షణ విధానాలను చేపడుతున్నాయి. 2023లో ప్రపంచీకరణకు నీళ్లు వదిలే అవకాశం ఎక్కువనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మారిన పరిస్థితులు భారత్‌కు కొత్త సవాళ్లు తెచ్చిపెడతాయి. ఇండియా తన వాణిజ్య భాగస్వాములతో వ్యాపార వృద్ధికి మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తన ఎగుమతులకు కొత్త గమ్యాలను అన్వేషించాలి.

అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఉక్రెయిన్‌ యుద్ధం తెచ్చిపెట్టిన సంక్షోభ పరిస్థితులు భారతదేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. 2023లో ప్రపంచార్థికం మూడోవంతు మేరకు కుంచించుకుపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనాలు ఆర్థికంగా ఎదుగూబొదుగూ లేకుండా స్తంభించిపోతాయని విశ్లేషించింది. అంతర్జాతీయ పరిస్థితులను గమనించి మన ఎగుమతి విధానంలో తగిన మార్పులుచేర్పులు చేసుకోవాలి.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో ఎగుమతులు కొనసాగించే సంస్థల ప్రయోజనాలను కాపాడాలి. అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించే ఈ రంగం దెబ్బతినకుండా సరైన విధానాలను చేపట్టాలి. అంతర్జాతీయ విపణిలో భారతీయ సరకులు ఇతర దేశాల ఎగుమతులతో ధర, నాణ్యత పరంగా పోటీ పడగలిగేలా చర్యలు తీసుకోవాలి.

దేశీయంగా మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరెంటు ఖాతా లోటు, విత్త లోటును ఎదుర్కొంటోంది. ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువైతే కరెంటు ఖాతా లోటు ఏర్పడుతుంది. మన ఆదాయంకన్నా వ్యయం ఎక్కువైతే విత్త లోటు తలెత్తుతుంది. 2022-23లో మన కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.6శాతం. విత్త లోటు 6.4శాతం. అనవసర దిగుమతులను తగ్గించుకుంటే స్వల్పకాలికంగా కరెంటు ఖాతా లోటు కొంత తగ్గుతుంది. దీర్ఘకాలంలో చమురు ధరలు దిగివచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ లోటు మరింత తగ్గవచ్చు.

ఇండియాలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. చైనా జీరో కొవిడ్‌ విధానాన్ని ఎత్తివేయడం వల్ల ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అవి క్రమంగా తగ్గి, ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకొంటుంది. 2020 నుంచి చైనాలో కొనసాగుతున్న లాక్‌డౌన్ల వల్ల అక్కడ ఉత్పత్తి స్తంభించిపోయింది. అంతర్జాతీయ సరఫరా గొలుసుకు కీలకమైన చైనా మళ్ళీ తేరుకోవడం ప్రపంచార్థికానికి మేలు చేస్తుంది. వ్యాపార సరకుల సరఫరా పునరుద్ధరణతో ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం కిందకు దిగివస్తుంది. ఫలితంగా అమెరికాతోపాటు ఇండియాలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయి. దానివల్ల పెట్టుబడుల ప్రవాహం పెరిగి అభివృద్ధి పునరుద్ధరణ సాధ్యమవుతుంది.

మానవ వనరుల అభివృద్ధి..
భారత ఆర్థిక వ్యవస్థకు ఎగుమతులు కాకుండా స్వదేశంలో వస్తుసేవల వినియోగమే ప్రధాన చోదక శక్తి. 140 కోట్ల జనాభా- వస్తుసేవల వినియోగాన్ని, తద్వారా ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్లనే 2022-23లో ఇండియా 6.9శాతం వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన దేశాల్లో ఇంత వృద్ధి రేటు కనిపించడం లేదు. భారతీయ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) తగ్గడం శుభ పరిణామం.

దానివల్ల అవి కొత్త రుణాలు ఇవ్వగలుగుతాయి. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి. పరిశ్రమలకు పోనుపోను అధిక నైపుణ్యం గల కార్మికులు అవసరమవుతున్నారు. అలాంటివారిని అందించాలంటే మానవ వనరుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలి. తూర్పు ఆసియా దేశాలు, చైనా చేసింది ఇదే. రాజకీయ దృఢ సంకల్పం ఉంటే భారత్‌ సైతం దీన్ని సాధించగలదు. తద్వారా కొత్త సంవత్సరంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టవచ్చు.

భారీ ఉపాధికి మార్గం..
భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అక్టోబరు పండుగ సీజనులోనూ గడచిన 26 నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోవడం ఆందోళనకరం. ఈ క్రమంలో మన పారిశ్రామికోత్పత్తిని పెంచుకోవడం తప్పనిసరి. తక్కువ నైపుణ్యం గల కార్మికులు అత్యధికంగా ఉండే తోలు, పాదరక్షలు, జౌళి పరిశ్రమల నుంచి చైనా క్రమంగా వైదొలగుతోంది. భారత్‌ దాన్ని అవకాశంగా మలచుకోవాలి.

చౌకగా లభ్యమయ్యే కార్మిక శక్తిని ఈ పరిశ్రమల్లో వినియోగిస్తే భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా పారిశ్రామిక ఉత్పత్తి, దానితోపాటే మన ఎగుమతులూ పెరుగుతాయి. గ్రామీణ వేతనాల్లో ఎదుగూబొదుగూ లేని స్థితిని సరిదిద్దాలి. అటు గ్రామీణ ఆర్థికం, ఇటు పారిశ్రామికోత్పత్తి రెండూ కుంటువడితే యావత్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details