కరోనా వైరస్ ధాటికి దేశార్థికం భారీ కుంగుదల తాలూకు దుష్పరిణామాల తీవ్రతను 'క్రిసిల్' (క్రెడిట్ రేటింగ్ సంస్థ) తాజా నివేదికాంశాలు వెల్లడిస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అయిదుశాతం దాకా క్షీణిస్తే కార్పొరేట్ సంస్థల రాబడులు 15శాతం మేర పడిపోతాయంటున్న అధ్యయనం, లఘు పరిశ్రమలపై మరింత ప్రతికూల ప్రభావం తప్పదంటోంది. సిబ్బంది జీతాలు చెల్లించడానికీ కిందుమీదులవుతూ వరస సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు గొప్ప సాంత్వన ప్రసాదించగలదంటూ 'ఆత్మనిర్భర్ అభియాన్' ప్రత్యేక ప్యాకేజీ వెలుగుచూసి సుమారు నెల్లాళ్లు గడిచింది. చిన్న పరిశ్రమలకు నిధుల కొరత తలెత్తకుండా వీలైనన్ని జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వారంక్రితమే ప్రభుత్వరంగ బ్యాంకులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనల్ని గరిష్ఠంగా సరళీకరించాలనీ సూచించారు.
పెనుముప్పే..
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం అవసరాల్ని ప్రాధాన్య ప్రాతిపదికన తీర్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు రెండురోజులనాడు బ్యాంకుల తరఫున అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవంలో, లఘు పరిశ్రమల అస్తిత్వానికే పెనుముప్పు దాపురించిందన్న 'క్రిసిల్' విశ్లేషణ ఆందోళనకర దృశ్యాన్ని కళ్లకు కడుతోంది. మహమ్మారి వైరస్ స్థూల దేశీయోత్పత్తికి ఎంతగా తూట్లు పొడిచేదీ అంచనా కట్టలేమంటూ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దేశ ఆర్థిక ప్రగతికి ఇటీవల దశ సూత్రావళిని ప్రతిపాదించింది. పెట్టుబడులకు అనుకూల సంస్కరణలు రావాలని, నగదు లభ్యత కొరతను ఎదుర్కొనేందుకు గిరాకీ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నది అందులో ఓ ముఖ్యాంశం. అటువంటి గిరాకీ ఏర్పరచడంలో రిజర్వ్‌బ్యాంక్, ఆర్థికశాఖ ఇప్పటిదాకా విఫలమయ్యాయంటున్న క్రిసిల్ అధ్యయనం- తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతోంది.
మూడీస్ అభిప్రాయం..
మహమ్మారి వైరస్ కరాళనృత్యం ఆరంభించడానికి ఏడాదిన్నర ముందునుంచే తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్న చిన్న పరిశ్రమల్ని కేంద్రప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ కుదుటపరచలేదని ప్రఖ్యాత మూడీస్ సంస్థ అభిప్రాయపడింది. జీడీపీలో పదిశాతం మేర ఉద్దీపన యోజన ప్రకటించామన్నా, అందులో ద్రవ్యపరమైన చర్యలు పదోవంతేనన్న ఫిచ్ రేటింగ్స్ సంస్థ విశ్లేషణ- ఆశించిన విధంగా ఆర్థిక పునరుత్తేజం కొరవడటానికి కారణాల్ని మదింపు వేసింది. లఘు పరిశ్రమలకు ఇస్తామన్న మూడు లక్షలకోట్ల రూపాయల అత్యవసర రుణాలకు నిర్ణయించిన వడ్డీరేటు కనిష్ఠంగా 9.25శాతం, గరిష్ఠంగా 14శాతం. నిర్వహణ మూలధనం టర్మ్ రుణాలకు నిర్ధారించిన రేటు 7.5శాతం. వడ్డీరేటును 3, 4 శాతానికి మించనివ్వకుండా చెల్లింపు వ్యవధిని పదేళ్ల వరకు విస్తరించి ఉంటే- చిన్న సంస్థలకది పెద్ద వరమయ్యేది. కొవిడ్ సంక్షోభం ఉపశమించేంతవరకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వస్తుసేవా సుంకం (జీఎస్‌టీ) చెల్లింపుల్ని వాయిదా వేయాలన్న అభ్యర్థనలు అరణ్యరోదనమయ్యాయి! 'మిటిల్ స్టాండ్' (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) సంస్థలకు జర్మనీ కల్పిస్తున్న విశేష ప్రాధాన్యం కారణంగా, 60శాతందాకా ఉపాధి అవకాశాల్ని అవి సృష్టించగలుగుతున్నాయి.
సింగపూర్, న్యూజిలాండ్, జపాన్ ప్రభృత దేశాల్లో లఘు పరిశ్రమలకు నిధుల లభ్యత, మార్కెటింగ్ వసతులు, సృజనాత్మక డిజిటల్ సాంకేతికత సమకూర్చడంలో ప్రభుత్వాలు కనబరుస్తున్న శ్రద్ధ అద్భుతాల్ని ఆవిష్కరిస్తోంది. కరోనా సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని తయారీ రంగాన భారత్‌ను అంతెత్తున నిలబెట్టాలని ప్రధాని మోదీ అభిలషిస్తున్నారు. అందుకు తగ్గట్లు చిన్న సంస్థలకు పెద్దయెత్తున ఊతమిచ్చే కసరత్తు ఇకనైనా చురుకందుకోవాలి. విడిభాగాలకు, నిపుణ కార్మికులకు, అత్యవసర పెట్టుబడులకు కొరత ఎన్నో చిన్న పరిశ్రమల ఉసురు తీసే దుస్థితి దాపురించకముందే నికార్సయిన ఉద్దీపన చర్యల ప్రణాళికను వడివడిగా పట్టాలకు ఎక్కించాలి.
ఇదీ చూడండి:ఈ ఏడాది ఇంట్లోనే యోగా దినోత్సవం: మోదీ