తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'ఏంటి ఈ అనారోగ్యకర ధోరణి?' - విద్య, వైద్యం

ఏ దేశ ప్రగతికైనా సమర్థ మానవ వనరులే కీలకం. ప్రతి వ్యక్తినీ సమర్థ ప్రగతిశీల వనరుగా తీర్చిదిద్దేవి- విద్య, వైద్యం. ప్రపంచీకరణ శకంలో ప్రైవేటీకరణకు ఎన్ని గవాక్షాలు తెరచినా కీలకమైన విద్య వైద్యం మాత్రం ప్రభుత్వ రంగంలోనే కాలానుగుణ అభివృద్ధికి నోచుకోవాలంటూ నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ చేసిన సూచన అరణ్య రోదనమైంది. కెనడా, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, జర్మనీ, యూకే, జపాన్‌, ఆస్ట్రేలియాలు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో విరాజిల్లుతుంటే- మరికొన్నేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా అవతరించనున్న ఇండియాలో కాసుల తైలం గుమ్మరిస్తేగాని ప్రాణదీపాలు వెలగని దయనీయావస్థ నెలకొంది.

అనారోగ్యకర ధోరణి
healthcare sector

By

Published : Apr 1, 2021, 7:54 AM IST

ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి అందరికీ తెలుసు. సాంక్రామిక, సాంక్రామికేతర రోగాల ఉరవడికి జతపడి కరోనావంటి మహమ్మారీ కోర సాచిన వేళ- రుజాగ్రస్త భారతం ఆరోగ్య సంరక్షణ రంగంలో అపార వృద్ధి నమోదు చేసి మహా భాగ్యశాలిగా మారనుందన్న నీతి ఆయోగ్‌ నివేదిక నిశ్చేష్టపరుస్తోందిప్పుడు! దేశారోగ్య రంగంలో 80శాతం వాటాగల ఆసుపత్రి పరిశ్రమ పరిమాణం ఏటా 16-17 శాతం వృద్ధి నమోదు చేస్తూ, వచ్చే రెండేళ్లలో 13,200 కోట్ల డాలర్లకు చేరనుందని, ఔషధాలు వైద్య ఉపకరణాల వంటి అనుబంధ రంగాల్లో ప్రగతినీ పరిగణనలోకి తీసుకొంటే- వచ్చే ఏడాదికల్లా స్వస్థ సేవల రంగం రూ.27 లక్షల కోట్ల స్థాయికి చేరుకొంటుందనీ నీతి ఆయోగ్‌ నివేదించింది.

ఆరుకోట్లమంది పేదరికంలోకి

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని సూదంటురాయిలా ఆకట్టుకొంటున్న ఈ రంగంలో బీమా, వైద్య పర్యాటకం, టెలీ మెడిసిన్‌, సాంకేతికత ఆధారిత వైద్య సేవలు తదితరాలన్నీ పుంజుకొంటూ 2017-22 మధ్యకాలంలో 27 లక్షల అదనపు ఉద్యోగాల సృష్టికి ఊతమిస్తున్నాయనీ ఆశావహ చిత్రాన్ని ఆవిష్కరించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగల్లోనే దేశవ్యాప్త ఆసుపత్రి పడకల్లో 65శాతం ఉన్నాయంటూ- తక్కిన రాష్ట్రాల్లోని జనావళి అవసరాల రీత్యా పడకల సంఖ్యను కనీసం 30శాతమైనా పెంచుకోగల వ్యాపార అవకాశాన్ని నీతి ఆయోగ్‌ ప్రస్తావించింది. తలకు మించిన ఆసుపత్రుల బిల్లుల్ని పంటి బిగువున భరించి ఏటా ఆరుకోట్లమంది పేదరికంలోకి జారిపోతున్న దేశం మనది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే 90శాతం జబ్బుల్ని తొలి దశలోనే గుర్తించి నయం చేయగల వీలుందన్న ప్రపంచ బ్యాంక్‌ హితవును పెడచెవిన పెట్టబట్టే- మహా భాగ్యవంతులకే ఆరోగ్యం అన్నట్లుగా పరిస్థితి దిగజారింది. కొవిడ్‌లాంటి ప్రాణాంతక రోగాలు కసిగా కమ్ముకొస్తున్న తరుణంలో- సార్వత్రిక ఆరోగ్య రక్షణ ఛత్రం ద్వారా సగటు పౌరుడి ఆరోగ్య భద్రతకు పూచీపడాల్సిన సర్కారీ యంత్రాంగాల ఆలోచనా సరళే అమితంగా భీతిల్లజేస్తోంది!

కాసుల తైలం గుమ్మరిస్తేగాని..

ఏ దేశ ప్రగతికైనా సమర్థ మానవ వనరులే కీలకం. ప్రతి వ్యక్తినీ సమర్థ ప్రగతిశీల వనరుగా తీర్చిదిద్దేవి- విద్య, వైద్యం. ప్రపంచీకరణ శకంలో ప్రైవేటీకరణకు ఎన్ని గవాక్షాలు తెరచినా కీలకమైన విద్య వైద్యం మాత్రం ప్రభుత్వ రంగంలోనే కాలానుగుణ అభివృద్ధికి నోచుకోవాలంటూ నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ చేసిన సూచన అరణ్య రోదనమైంది. కెనడా, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, జర్మనీ, యూకే, జపాన్‌, ఆస్ట్రేలియాలు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో విరాజిల్లుతుంటే- మరికొన్నేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా అవతరించనున్న ఇండియాలో కాసుల తైలం గుమ్మరిస్తేగాని ప్రాణదీపాలు వెలగని దయనీయావస్థ నెలకొంది.

ఎద్దుపుండు కాకికి ముద్దు

మహానగరాల పరిధి దాటితే రెండు, మూడో అంచె పట్టణాల్లో ఆసుపత్రులు, వైద్య మౌలిక సదుపాయాలు కల్పించే ప్రైవేటు రంగానికి రూ.2.3 లక్షల కోట్ల విలువైన 600 అవకాశాలు వేచి ఉన్నాయంటున్న నీతి ఆయోగ్‌- వచ్చే పదేళ్లలో 7.3 కోట్లమంది మధ్యతరగతి శ్రేణికి ఆర్థికంగా ఎదగడం సానుకూలాంశమని చెబుతోంది. అధిక కొలెస్ట్రాల్‌, రక్తపోటు, ఊబకాయం, మద్యసేవనం వంటివన్నీ జీవన సరళి వ్యాధులుగా విక్రమించి ఆరోగ్య సేవలకు గిరాకీ పెంచుతాయట! ఎద్దుపుండు కాకికి ముద్దు అంటే, ఇదే కదా? కొవిడ్‌ ధాటికి కుదేలైన రంగాలు ఇంకా తేరుకోక, ఎప్పటికి తమ జీవితాలు తెరిపిన పడతాయో తెలియక కోట్లాది జనం కన్నీటి సంద్రంలో ఈదులాడుతున్న సమయంలో- ప్రభుత్వ రంగంలోనే వైద్యసేవలు విస్తృతమయ్యేలా తక్షణ, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు రచించాల్సింది పోయి, ఇదేం ధోరణి? చికిత్సా వ్యయం భరించదగిన స్థాయిలో ఉండటం కూడా ఆరోగ్య హక్కులో అంతర్భాగమేనని సుప్రీంకోర్టే స్పష్టీకరించిన దరిమిలా- సర్కారీ విధాన రచన అందుకు అనుగుణంగా సాగాలి. కొరతల కోమాలోని ప్రాథమిక వైద్యానికి కొత్త ఊపిరులూది- వైద్య ఉపకరణాలు, ఔషధ తయారీలో ఏపీఐలకోసం విదేశాలవైపు మోరసాచే దుస్థితిని నివారించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి!

ఇదీ చదవండి:'న్యూడ్​ వీడియో కాల్స్'​తో తస్మాత్​ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details