వెలుతురు తక్కువగా ఉన్నచోట నీడలు తెగబారెడు సాగి భయపెడతాయి. సమాచార కాంతిపుంజాలు ధారాళంగా ప్రసరిస్తే- మేటవేసిన అజ్ఞాన తిమిరాలూ నిలువనీడ లేక కొట్టుకుపోతాయి. కరోనా లాంటి ప్రాణాంతక మహమ్మారిని ధాటిగా తిప్పికొట్టాలంటే దాని గురించిన పూర్తి సమాచారాన్నే రక్షణా కవచంగా ధరించి ప్రతి వ్యక్తీ సమూహశక్తికి ప్రతీక కావాలి. మందూమాకూ లేని కొవిడ్‌ను కూల్చాలంటే సమగ్ర అవగాహన, దాని వ్యాప్తిని అరికట్టే నియమాల అమలుపట్ల నిబద్ధత ప్రతి పౌరుడిలో పాదుకొనాలి. కరోనా కట్టడే ఏకైక అజెండాగా ఇండియా సహా అన్ని దేశాలూ అహరహమూ పరిశ్రమిస్తుంటే- దీపం కిందనే చీకటి తారట్లాడినట్లు నకిలీ వార్తల జోరు ప్రజానీకాన్ని అయోమయంలో ముంచుతోంది. మెదళ్లు కుళ్లిన ఏ కొందరో వికృత కల్పనా చాపల్యాన్ని మేళవించి, అవసరానుగుణంగా దృశ్యాలు ఫొటోల్ని మార్చి, సామాజిక వేదికలపై వదులుతున్న నకిలీ వార్తలూ వీడియోల కలకలం- కరోనాను మించిన కల్లోలానికి కారణమవుతోంది. ఆ వరస చిత్తగించండి!
జాతి ద్రోహం..
కరోనా వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి నాలుగొందల మందికి ఆ ప్రమాదకర జబ్బును అంటించగలడని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్) ఈ మధ్యనే హెచ్చరించింది. ఆ ముప్పును తప్పించాలంటే, వ్యాధి లక్షణాలున్నవారిని సత్వరం గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించి మేలిమి చికిత్స అందించాలి. స్వీయ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా వైద్యులు, పోలీసులు కరోనా లక్షణాలున్నవారిని వెతికిపట్టుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలించబోతుంటే, వారిపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్, ఇండోర్‌లలో జరిగిందదే. క్వారంటైన్ కేంద్రాలూ నిర్బంధ కేంద్రా(డిటెన్షన్)ల వంటివేనని, అక్కడికి తీసుకెళ్ళి చంపేస్తారంటూ సెల్‌ఫోన్లలో చక్కర్లు కొట్టిన వీడియోలు, సందేశాలు స్థానికుల్లో భయాందోళనలను పెంచాయి. ఆరోగ్య కార్యకర్తలు ఓ వర్గంవారికి ప్రాణాంతక వైరస్‌ను ఎక్కిస్తున్నారంటూ వెల్లువెత్తిన తప్పుడు సందేశాలు ఇండోర్‌లో శాంతిభద్రతల పరిస్థితి సృష్టించాయి. ఇది కేవలం అజ్ఞానమో, కరడు కట్టిన మత దురహంకారమో కాదు- నిఖార్సైన జాతిద్రోహం!
నిజానిజాల్ని తర్కించకపోతే ఇక అంతే.!
పద్దెనిమిదేళ్లనాడు సార్స్ వైరస్ విరుచుకుపడినప్పుడు, 2009లో హెచ్1ఎన్1 వైరస్ జూలు విదిల్చినప్పుడు, 2012లో మధ్యాసియాకే పరిమితమైన వైరస్ కొంత అలజడి సృష్టించినప్పుడూ- ప్రజానీకమంతా సంప్రదాయ మీడియా సమాచారాన్నే పూర్తిగా విశ్వసించి వాటిని ఎదుర్కొన్నారు. కరోనా విషయానికొచ్చేసరికి- త్రివిక్రమావతారం దాల్చిన సాంకేతిక విప్లవం పుణ్యమా అని సామాజిక మాధ్యమ వేదికలు అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. అక్కడ డ్రైనేజీ స్కీము లేకుండా ఏరులై పారే సమాచారం పెను ప్రమాదకరంగా మారుతోంది. తనకు తెలిసినదాన్ని వెంటనే తెలిసినవారందరికీ బట్వాడా చెయ్యాలనే మానవ బలహీనత పెట్టుబడిగా- నిజం చెప్పులేసుకోక ముందే అబద్ధం ప్రపంచాటన పూర్తి చేసేస్తోంది. అలా వెల్లువెత్తేది శ్రేయస్సాధక సమాచారం కాదు- వ్యక్తుల అవగాహనను కుదించి, అజ్ఞానాన్ని సంకుచితత్వాన్ని పెంచి, నమ్మినవాళ్లను నిలువునా ముంచే నకిలీ వార్తల నయవంచకత్వం. ఒక్క క్షణం ఆలోచించి వాటి నిజానిజాల్ని తర్కించకపోతే అవే అనేక విధాలుగా కీడు చేస్తాయన్నది వాస్తవం!
అనవసర దుష్ప్రచారాలతో..
ప్రాణాంతక వైరస్‌పై బిల్ గేట్స్ ముందే హెచ్చరించినట్లు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంపై రతన్ టాటా ప్రబోధాత్మకంగా స్పందించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటివాటివల్ల హాని లేకపోయినప్పటికీ- అవి వాస్తవం కానేకాదు. 2014 ఆగస్టులో నడిసంద్రంలో ఓ ఓడ ప్రమాదానికి గురికాగా వందమందికి పైగా వలసదారుల శవాలు లిబియా తీరానికి కొట్టుకొచ్చాయి. నాటి దృశ్యాల్ని వెతికి పట్టుకొని, కరోనాలో చనిపోయినవాళ్లను సముద్రంలో పడేశారని, ఆ కారణంగా చేపల్ని తింటే కరోనా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించారు. అదే విధంగా కోళ్లను తింటే కొవిడ్ వస్తుందన్న దుష్ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ వందల కోట్ల రూపాయల నష్టంలో కూరుకుపోయిందిప్పుడు! ఆరోగ్య కార్యకర్తలు, రోగ లక్షణాలున్నవారు, కరోనా వ్యాధిగ్రస్తుల సమీప బంధువులే మాస్కులు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఆ నిజాన్ని వక్రీకరించి మాస్కులు వాడితే కరోనా రాదనే ప్రచారం సాగడంతో వేలంవెర్రిగా వాటి కొనుగోళ్లు పెరిగి, నిల్వలు నిండుకొని, అవసర సమయంలో వైద్య సిబ్బంది వాడకానికే అవి లేకుండా పోయే దురవస్థ దాపురించింది!
అశాస్త్రీయ సూచనలు..
ఎండలో నించుంటే కరోనా రాదని, నీళ్లలో వెల్లుల్లి ఉడికించి తిని, ఆ నీళ్లు తాగితే వ్యాధి తగ్గిపోతుందని, విటమిన్-సి వినియోగంతో వైరస్ చస్తుందనీ అశాస్త్రీయ సూచనలు సలహాలు వాట్సాప్ సందేశాలుగా జనం మెదళ్లను తొలిచేస్తున్నాయి. అంతెందుకు? కరోనాపై పోరాటంలో సంఘీభావ సూచకంగా ఈ నెల తొమ్మిదిన రాత్రి తొమ్మిదింటికి తొమ్మిది నిమిషాలు దీపాలు వెలిగించాలన్న ప్రధాని సందేశానికీ విపరీతార్థాలు తీసి, ఆ చొరవ పరమార్థం మరేదో ఉందన్న సూత్రీకరణలు హోరెత్తిపోయాయి. ప్లేట్లు, చెంచాలను ఎంగిలి చేసి వైరస్ వ్యాప్తి చేస్తున్నారన్న సందేశాలతో ప్రజల్లో భయాందోళనలు పెంచే ప్రయత్నాలూ జోరందుకున్నాయి. వాటన్నింటినీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆయా సందర్భాల్లో ఖండిస్తూనే ఉంది. కరోనా సంక్షోభ సమయంలో ప్రతి భారతీయుడికీ ప్రధాని మోదీ రూ.15వేలు ఇస్తున్నారని, డబ్బులు తీసుకోవాలంటే, ఫలానా లింకుపై క్లిక్ చేసి దరఖాస్తు నింపాలన్న మెసేజ్ వెలుగులోకొచ్చింది. అది నకిలీ సమాచారం అంటూ పీఐబీ హెచ్చరించాల్సి వచ్చింది.
సరైన చర్యలు చేపట్టాలి..
నకిలీ వార్తలు సృష్టించే ఆందోళనకర పరిస్థితుల్ని చెదరగొట్టేలా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందరికీ అందేలా 24 గంటల వ్యవధిలో ఒక పోర్టల్ ఏర్పాటు చెయ్యాలని సుప్రీంకోర్టు మార్చి 31న కేంద్రానికి సూచించింది. తప్పుడు సమాచార సునామీ సామాజిక మాధ్యమాల ద్వారానే నేరుగా ప్రజల మెదళ్లను ముంచేస్తున్నప్పుడు- ప్రభుత్వం ఒక్కటే ఆ ఉరవడిని నిభాయించగలదా? అంతర్జాతీయంగా 50 భాషల్లో సమాచారాన్ని విశ్లేషించి నిగ్గుతేల్చేందుకు 60 నిజనిర్ధరణ సంస్థలతో ఫేస్‌బుక్ అనుసంధానమైంది. గూగుల్ సైతం నిజాల వడపోతకు ప్రయత్నిస్తోంది. ఈ సంక్షుభిత స్థితిలో పత్రికా ప్రసార మాధ్యమాల వార్తా కథనాలు, సమాచారమే కొవిడ్‌పై పోరాటంలో జన అక్షౌహిణులకు కరదీపికలు కాగలుగుతాయి. ఆన్‌లైన్ తప్పుడు సమాచారం మోసాల నుంచి పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం- ఈ కొవిడ్ కాలంలో సింగపూర్‌కు ఎంతగానో అక్కరకొస్తోంది. అలాంటి చట్టబద్ధమైన చొరవతోపాటు కరోనాపై సమష్టి సమాచార కాంతిపుంజాలు అన్ని దిక్కులా ప్రసరించేలా గట్టిచర్యలు చేపట్టడమే నకిలీ వార్తల పీడకు సరైన విరుగుడు. ఏమంటారు?
-పర్వతం మూర్తి
ఇదీ చదవండి:'మేటర్‌హార్న్'పై మెరిసిన మువ్వన్నెల జెండా