పోఖ్రాన్ అణుపరీక్షల దరిమిలా అసంబద్ధ ఆంక్షలకు గురైన ఇండియా అచిరకాలంలోనే అగ్రదేశాలన్నింటితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడికలతో ధీమాగా ముందడుగేయగలిగిందంటే- అదంతా వాజ్‌పేయీ రాజనీతిజ్ఞత చలవే. ఒకరికి చేరువ అవుతున్నామంటే అర్థం మరో దేశానికి దూరం జరుగుతున్నట్లు కాదన్న వాజ్‌పేయీ వ్యాఖ్యలో ధ్వనించింది అలీనోద్యమ భావనే. కొత్త సహస్రాబ్దిలో రెండు దశాబ్దాల్లోనే భౌగోళిక రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. 2004నాటి హిందూ మహా సముద్ర సునామీ బాధితుల్ని ఆదుకోవడానికి చేతులు కలిపి సఫలమైన దేశాల్లో- ఆ సహకారాన్ని వ్యవస్థీకృతం చేయాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది.
హిందూ, పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛా సౌభాగ్యాలే 'విజన్'గా ఓ 'బృందం' ఏర్పడాలన్న అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఆకాంక్ష- 2006నాటి దిల్లీ, టోక్యోల సంయుక్త ప్రకటనలోనూ ప్రస్తావనకు నోచుకొంది. 2007నాటి ప్రాథమిక సంప్రదింపుల దశలోనే... ఎందుకు, ఏమిటీ అంటూ బీజింగ్ ఆరాలు మొదలు పెట్టగానే, ఆ యత్నం కొడిగట్టిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాల చతుర్భుజ(క్వాడ్) భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకోవడమే కాదు... మరో పక్షం రోజుల్లో నాలుగు దేశాల మలబార్ నౌకాదళ విన్యాసాలకూ రంగం సిద్ధమైంది.
జాగ్రత్త వహించాలి!
ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఇండో పసిఫిక్‌గా నామకరణం చేసిన ట్రంప్ సర్కారు 2017నాటి జాతీయ భద్రతా వ్యూహ పత్రంలోనే చైనా దూకుడుపై గళమెత్తింది. 'ఆసియా నాటో' కూటమి రూపకల్పనకు వాషింగ్టన్ సిద్ధపడుతోందని బీజింగ్ విమర్శిస్తున్నా- చైనా దుందుడుకు వ్యవహారశైలే ఇండియా, ఆస్ట్రేలియాల తాజా క్రియాశీలతకు ప్రేరకమైంది. 'క్వాడ్' సభ్యదేశాలన్నింటికీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా- ప్రచ్ఛన్న యుద్ధభావజాలంతోనే తాజా భౌగోళిక రాజకీయ పోటీకి తెరలేచిందంటుంటే, బీజింగ్ దురాక్రమణను ఎదుర్కొనే కూటమిగా క్వాడ్ నిర్మాణం సాగాలని అమెరికా అభిలషిస్తోంది. ఈ అడకత్తెరలో పోకచెక్కలా మారకుండా ఇండియా జాగ్రత్త వహించాలి!