తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అన్నదాతకు ఇదా వెన్నుదన్ను? - parliament new bills

పంటను రైతు ఎక్కడైనా అమ్ముకొని ఆకర్షణీయ ధర తెచ్చుకొనేలా వెలువరించిన ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ముందస్తు ఒప్పందాలకు రక్షణ కల్పించే మరో బిల్లూ ముందుకొచ్చింది. క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా... మార్కెట్‌ శక్తుల మధ్య పోటీ పంటలకు సమధిక ధర రావడానికి, రైతు రాబడి ఇబ్బడిముబ్బడి కావడానికి దోహదపడుతుందన్న హ్రస్వదృష్టే ఆయా బిల్లుల్లో ప్రస్ఫుటమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

A special story on crop is sold anywhere by the farmer relating ordinance
అన్నదాతకు ఇదా వెన్నుదన్ను?

By

Published : Sep 16, 2020, 8:30 AM IST

దుర్భర పరిస్థితుల్లో సైతం ఆహార కొరత క్రీనీడైనా పడకుండా దేశం నిబ్బరంగా ఉంటోందంటే కష్టకాలంలోనూ కాడీమేడీ వదలకుండా జాతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అన్నదాతలే కారణం. భిన్నరంగాలు కుదేలయ్యేలా కొవిడ్‌ రగిల్చిన కుంపట్లను చల్లార్చి ప్రగతి లక్ష్యాలు చేరేందుకంటూ ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం- అన్నదాతల్ని ఆదుకొనే విషయంలో 'కొండనాలుక్కి మందేస్తే...' చందమైన విధానాల్ని అనుసరించడమే దారుణం! దేశవ్యాప్తంగా రెండు హెక్టార్లలోపు కమతంగల సన్న చిన్నకారు రైతులు 86.2 శాతం; 12 కోట్ల 60 లక్షల మంది చిన్న రైతులకు ఒక్కొక్కరికీ సగటున 0.6 హెక్టార్ల సాగుభూమే ఉందన్నది రెండేళ్లనాటి పదో వ్యవసాయ గణన సారాంశం.

క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా...

దశాబ్దాలుగా కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ల పేరిట రైతుల శ్రమదోపిడి విచ్చలవిడిగా సాగుతుంటే, పేరుగొప్ప వ్యవసాయ మార్కెట్లలో దళారుల దగా కర్షకుల ప్రయోజనాలకు కసిగా చితి పేరుస్తోంది. ఆ అవ్యవస్థకు చెల్లుకొట్టి పంటను రైతు ఎక్కడైనా అమ్ముకొని ఆకర్షణీయ ధర తెచ్చుకొనేలా వెలువరించిన ఆర్డినెన్స్‌ స్థానంలో కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ముందస్తు ఒప్పందాలకు రక్షణ కల్పించే మరో బిల్లూ ముందుకొచ్చింది. క్షేత్రస్థాయి వాస్తవాల్ని గుర్తించకుండా- మార్కెట్‌ శక్తుల మధ్య పోటీ పంటలకు సమధిక ధర రావడానికి, రైతు రాబడి ఇబ్బడిముబ్బడి కావడానికి దోహదపడుతుందన్న హ్రస్వదృష్టే ఆయా బిల్లుల్లో ప్రస్ఫుటమవుతోంది. జాతి ఆహార భద్రతకు నిష్ఠగా పూచీపడుతున్న రైతుల బాగోగులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం- మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు అన్నదాతను వదిలేయడమే విస్మయపరుస్తోంది!

రైతే కాదు.. సైనికుడు కూడా...

ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా ఏటా పంటలకు మద్దతు ధరల్ని నిర్ధారిస్తున్న ప్రభుత్వం- భారతీయ రైతుకు ఏడాదికి రూ.2.65 లక్షల కోట్ల బొర్రె పెడుతోందని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్‌ గులాటి పాల్పంచుకొన్న అధ్యయనం నిగ్గుతేల్చింది. 2000-17 నడిమికాలంలో రైతులపై ఆ తరహా పరోక్ష పన్ను బాదుడు రూ.45 లక్షల కోట్లు అంటే- ఏమనుకోవాలి? వ్యవసాయ మార్కెట్‌ చట్టాల్ని సంస్కరించి, స్వేచ్ఛా విపణుల్ని ఆవిష్కరించాలన్న సూచనలకు అనుగుణంగా శాసన నిర్మాణాలకు సమకట్టిన కేంద్రం- నియంత్రిత మార్కెట్లలోనే నోరు పెగలని రైతు స్వేచ్ఛావిపణిలో ఎలా నెగ్గుకు రాగలడని ఆలోచించనే లేదు. కొరగాని మద్దతు ధరే రైతు శ్రేయానికి కొరివిగా మారిన నేపథ్యంలో- డాక్టర్‌ స్వామినాథన్‌ సూచనలకు కాలానుగుణంగా మెరుగులద్ది అమలు చేయడానికి ఎందుకు సంకల్పించడం లేదు? దేశానికి అన్నంపెట్టే రైతు ఆహార రంగాన జాతి స్వావలంబన సాధకుడే కాదు, ఆకలితో అర్థిస్తూ సార్వభౌమత్వంతో ఇండియా రాజీపడకుండా కాచుకొనే సైనికుడు!

నేడు తెలంగాణ చేస్తున్న పంట కాలనీల ప్రయోగాన్ని దేశవ్యాప్తం చేసి రైతే కేంద్రకంగా సమగ్ర వ్యవసాయ విధానం తీర్చిదిద్దడం తక్షణ అవసరం. నూట పాతికకు పైగా భిన్న వాతావరణ జోన్లు ఉన్న ఇండియాలో భూసార పరీక్షల్ని శాస్త్రీయంగా నిర్వహించి, ఏయే నేలలు ఏ తరహా పంటలకు అనుకూలమో గుర్తించి- దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాల్ని మదింపు వేసి ఏటా పంటల ప్రణాళిక రూపొందించాలి. వ్యవసాయ పరిశోధనల్ని పొలంబాట పట్టించి దిగుబడులు, నాణ్యత పెంచడం, చీడపీడలు, అతివృష్టి అనావృష్టి తరహా వైపరీత్యాల నుంచి రైతుకు రక్షణ కల్పించడం ప్రజాప్రభుత్వాల విధి. పంట కొనుగోళ్లు కేంద్రమే చేపట్టి రైతు రాబడికి గట్టి భరోసా ఇవ్వడం- జాతి ఆహార భద్రతకు రక్షా కవచమవుతుంది. అంతేగాని- సమస్యల సుడిగుండంలో చిక్కి అయినకాడికి అమ్ముకొందామనుకునే నిస్సహాయ జీవిని స్వేచ్ఛా విపణి దయకు వదిలేస్తే, పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది!

ఇదీ చూడండి:ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

ABOUT THE AUTHOR

...view details