ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు 2020 మే నెలలో అర్ధంతరంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి పదవి నుంచి దిగిపోనున్నట్లు వెల్లడించి ఆశ్చర్యపరిచారు. రెండోసారి అధిరాకం చేపట్టిన ఆయన.. నాలుగేళ్ల పదవీకాలంలో మరో ఏడాది మిగిలి ఉండగానే పగ్గాలు వదులుకోనున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అనిశ్చితులు, అంతరాయాలు నెలకొన్న ఈ సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్(డీజీ)ను నియమించడం ఓవైపు సవాలుతో కూడుకుంటే మరోవైపు మంచి అవకాశంగా కనిపిస్తోంది.
డీజీ పాత్ర కీలకం!
ఏకాభిప్రాయాల ద్వారానే ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రీన్ రూం(డీజీ సమావేశ గదికి అనధికార పేరు)కు అధ్యక్షత వహిస్తూ డబ్ల్యూటీఓ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు డైరెక్టర్ జనరల్ తెరవెనక కీలక పాత్ర పోషిస్తారు. ఈ అనధికార యంత్రాంగం వివిధ దేశాల ప్రతినిధులను ఒక్కచోటకు చేర్చుతుంది. సమస్యపై ఏకాభిప్రాయం కోసం సభ్యుల మధ్య సమన్వయం పెంచుతుంది. సాధారణంగా 40 మంది ప్రతినిధులతో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు.
'గ్రీన్ రూం' మూల సూత్రం అదే!
ఈ అనధికార చర్చల్లో రాజకీయంగా ముఖ్యమైన వాణిజ్య మినహాయింపు వంటి అంశాలను ప్రతినిధులు అత్యధికంగా ప్రస్తావిస్తారు. కాగా కొన్ని దేశాలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టర్ జనరల్ పిలుపునిస్తారు. ఈ గ్రీన్ రూం ప్రక్రియలో భారత్ చురుగ్గా పాల్గొంటోంది.
'ప్రతిదీ అంగీకరించే వరకు ఏదీ అంగీకారం పొందదు.'(నథింగ్ ఈజ్ అగ్రీడ్ అంటిల్ ఎవ్రిథింగ్ ఈజ్ అగ్రీడ్) ఇదే గ్రీన్ రూం ప్రక్రియ మూల సూత్రం.
దోహా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన వరకు గ్రీన్ రూం ప్రక్రియ చాలా మంచి ఫలితాలనే ఇచ్చింది. డబ్ల్యూటీఓ మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం పొందిన నిర్ణయాలు వెల్లడించింది. అందులో ముఖ్యమైనవి.
- 1996లో సింగపూర్‌లో జరిగిన తొలి డబ్ల్యూటీఓ మంత్రుల సమావేశంలో పెట్టుబడులు, పోటీతత్వ విధానాల వంటి కొత్త అంశాలపై చర్చ.
- 1996, 2003 చర్చల్లో సులభతర వాణిజ్య నియమాలను చర్చించేందుకు సభ్యుల ఒప్పందం
ఎన్నిక ప్రక్రియ షురూ
తదుపరి డీజీ నియామకానికి డబ్ల్యూటీఓ గత నెల నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 8 నుంచి జులై 8 వరకు నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చింది. మొత్తం ఎనిమిది దేశాల నుంచి నామినేషన్లు వచ్చాయి. కెన్యా, నైజీరియా, దక్షిణ కొరియా నుంచి మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇవి కాకుండా.. ఈజిప్ట్, మెక్సికో, మోల్డోవా, సౌదీ అరేబియా, యూకే దేశాలు నామినేషన్లు సమర్పించాయి. డబ్ల్యూటీఓ సెక్రటేరియట్‌కు నాయకత్వం వహించి బహుపాక్షికత సంస్కరణలో ముందడుగు వేయడానికి ప్రత్యేకమైన అవకాశం ఉన్నప్పటికీ.. భారతదేశం ఇందులో అభ్యర్థిని నామినేట్ చేయకపోవడం గమనార్హం.
నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులతో జులై 15-17 మధ్య డబ్ల్యూటీఓ సమావేశాలు నిర్వహిస్తుంది. తర్వాతి డీజీ విషయంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో డబ్ల్యూటీఓ ఏం చేయాలని సభ్యులు ఆశిస్తున్నారనే అంశంపై కొత్త డీజీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంతేగాక సంస్థలోని పెద్ద దేశాలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డబ్ల్యూటీఓదే 98% వాటా
ప్రపంచ వాణిజ్యం దాదాపుగా డబ్ల్యూటీఓ సభ్య దేశాల చేతిలోనే ఉంది. మొత్తం 164 దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో 98 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్య విధానాల్లో రెండు ప్రధాన సూత్రాలకు సభ్యదేశాలు కట్టుబడి ఉండేలా డబ్ల్యూటీఓ పర్యవేక్షిస్తుంది. ఒకటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్(ఎంఎఫ్ఎన్), మరొకటి నేషనల్ ట్రీట్మెంట్. ఈ సూత్రాల్లో భాగంగా సభ్యదేశాలు తమ వాణిజ్య భాగస్వాములతో వివక్షపూరిత విధానాలు అవలంబించకూడదు. దిగుమతి చేసుకున్న వస్తువులతో పాటు స్థానిక వస్తు సేవలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రపంచ మార్కెట్లో రక్షణాత్మక ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీఓ కొత్త డైరెక్టర్ ఈ రెండు సూత్రాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం చేకూర్చుతుంది.
వీటిని పరిష్కరించే వారు కావాలి