తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మూసధోరణి వద్దు.. ఏదీ సమగ్ర విధాన సేద్యం? - news on agriculture

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తే చివరికి రైతుకు మిగిలేది ఏమి లేదు. కర్షకుడికి అందాల్సిన సాగు ఫలాలు అందటం లేదు. వ్యవస్థాగతంగా దేశంలో వేళ్లూనుకుపోయిన సాగు సమస్యలకు సంపూర్ణ చికిత్స చేసే దిశగా నేటికీ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించుకోలేకపోయాం. ఉత్పత్తి, సరఫరా, మార్కెట్‌, పంపిణీ, ఆహారశుద్ధి రంగాలు రైతు హితంగా బలోపేతమైతేనే దేశంలో సాగుదార్లకు భరోసా ఏర్పడుతుంది. సమగ్ర వ్యవసాయ విధానం గురించి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో కేంద్రం సరికొత్త సాగు సంస్కరణలకు తెరతీయాల్సిన అవసరం ఉంది.

agricultural policy
ఏదీ సమగ్ర విధాన సేద్యం?

By

Published : May 17, 2020, 6:42 AM IST

రైతుకు గిట్టుబాటు ధరలు రావాలి. స్థిరమైన ఆదాయాలు అందాలి. అందుకు మార్కెట్‌ సంస్కరణలు అమలు కావాలి. రెట్టింపు ఆదాయం అంటూ లక్ష్యాలను ఘనంగా పెట్టుకోవడం కంటే అందుకు అనుసరించే కార్యాచరణ పటిష్ఠంగా అమలయ్యేలా చూడాలి. వ్యవస్థాగతంగా దేశంలో వేళ్లూనుకుపోయిన సాగు సమస్యలకు సంపూర్ణ చికిత్స చేసే దిశగా నేటికీ సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించుకోలేకపోయాం. ఉత్పత్తి, సరఫరా, మార్కెట్‌, పంపిణీ, ఆహారశుద్ధి రంగాలు రైతు హితంగా బలోపేతమైతేనే దేశంలో సాగుదార్లకు భరోసా ఏర్పడుతుంది. రైతులకు మంచి ధరలు అందించే ఉద్దేశంతో సమగ్ర వ్యవసాయ విధానం గురించి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో దేశీయ రైతుల బాగుసేతకు కేంద్రం సరికొత్త సాగు సంస్కరణలకు తెరతీయాల్సిన అవసరం ఉంది.

మూసధోరణి వద్దు!

ఏం పండించాలి, ఎంత ఉత్పత్తి కావాలి, ప్రజల అవసరాలు, ఎగుమతులకు అనుగుణంగా దేశంలో సమగ్ర సాగు విధానం నేటికీ రూపుదిద్దుకోలేదు. ఒక మూస ధోరణిలో సంప్రదాయ పద్ధతిలో పంటలు వేసుకుంటూ పోవడం వల్ల గిరాకీ సరఫరాల మధ్య వ్యత్యాసం ఏర్పడి- ధరల పోకడల్లో స్థిరత్వం ఉండటం లేదు. మార్కెట్‌ సూచీల ఆధారంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే ధరలను వ్యాపారులు ప్రభావితం చేస్తున్నా నియంత్రించే చర్యలు పటిష్ఠంగా లేవు. గిరాకీ ఉన్నప్పుడు లాభసాటిగా ఉండాల్సిన ధరలు పడిపోవడం వెనక ఉన్న మార్కెట్‌ శక్తుల్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కనీసం మార్కెట్‌ పోకడలకు అనుగుణంగా పంటలు వేసుకోమని చెప్పే యంత్రాంగం కూడా లేదు. ఈ-నామ్‌ వ్యవస్థను తీసుకొచ్చినా అందులోని లోపాలను సవరించి పటిష్ఠంగా రూపొందించలేక పోయారు. ప్రధాన పంటలు చేతికొచ్చే సీజన్‌లో ధరలెలా అస్తవ్యస్తంగా ఉంటున్నాయో పాలకులకు తెలియంది కాదు. ఎక్కడి పంట అక్కడ వినియోగించడం, ఎగుమతుల కోసం ప్రత్యేక క్లస్టర్లను గుర్తించి ప్రోత్సహించే విధానంలో అటు వినియోగదారులు ఇటు రైతులు లాభపడతారు. వాస్తవ సాగు ఖర్చుల ఆధారంగా ధరలను నిర్ణయించడం, వాటిని ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వమే కొనుగోలు చేయడం వంటి చర్యలు మంచి ఫలితాలనిస్తాయి. ఈ ప్రణాళికను అమలు చేసే క్రమంలో నేల, నీరు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సరళిని మార్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో నియంత్రిత విధానంలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందుకు విస్తృత చర్చల తర్వాత సమగ్ర వ్యవసాయ విధానం తెస్తామని చెబుతోంది. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామం. దేశమంతటా ఈ దిశగా అడుగులు పడాల్సిన అవసరం నేడెంతో ఉంది. దేశంలో అత్యధికంగా పండే వరి పంటను రాష్ట్రమంతటా సాగుచేస్తే ఉపయోగం ఏముంటుంది? మన అవసరాలకు తగ్గ అన్ని పంటలను ఆయా కాలాల్లో వచ్చే గిరాకీని దృష్టిలో ఉంచుకుని పంటల సరళిని ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేయగలిగితేనే ధరలు అదుపులో ఉంటాయి అవసరాలూ తీరతాయి.

ధరల గిట్టుబాటే కీలకం!

మంచి ధరలు అందించే ఏర్పాటు చేస్తే చాలు- దేశ రైతులు తమ సత్తా చూపుతారు. పంట పండించే వాడు లేకపోతే మన గతి ఏమిటని పాలకులు తమను తాము ప్రశ్నించుకోవాలి. కరోనా విపత్కర కాలంలోనూ దేశాన్ని ఆదుకున్నది సాగురంగమే. దేశంలో ప్రతి జిల్లాకు కనీసం అయిదు చొప్పున ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసి ఎగుమతి ఆధార క్లస్టర్లను వాటితో అనుసంధానించాలి. ప్రతి ఎకరాన్ని మ్యాపింగ్‌చేసే సాంకేతికత నేడు అందుబాటులో ఉన్నా రైతుకు బీమా ధీమా కల్పించలేకపోయాం. తెలంగాణలో నియంత్రిత పంటల విధానం అమలు చేస్తే బాగానే ఉంటుంది కానీ యంత్రాంగం చెప్పినట్టు పంటలు వేస్తే నష్టం వస్తే ఎవరు భరిస్తారని, ఆయా పంటను కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారులు- ధరలు దిగ్గొస్తే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆందోళన అర్థం చేసుకోదగినదే. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించే తీరు మాత్రమే రైతుల్ని కాపాడగలుగుతుంది. మద్దతు ధరలను సక్రమంగా అందించేందుకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పంట కొనుగోళ్లను చేపట్టడం ఒక్కటే మార్గం. ఉత్పత్తి దారుల సంఘాలకు(ఎఫ్‌పిఓ) విస్తృత ప్రోత్సాహకాల గురించి కేంద్రం యోచిస్తున్నా వీటి అమలుపై పర్యవేక్షణ కొరవడుతోంది. మేలైన ఉత్పాదకాల సరఫరా, సాగుదార్లందరికీ పంట రుణాలు అందించడం, సాగు ఖర్చుల్ని తగ్గించి పంటతోపాటు పాడి, కోళ్లు వంటి సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించేలా తోడ్పాటునివ్వడం, ఉత్పత్తికి స్థానికంగానే విలువ పెంచడం, బీమా ధీమా కల్పించడం, మంచి ధరలిచ్చి రైతు పండించిన పంటను వాణిజ్యపరంగా ఎలా విక్రయించుకోవచ్చనే అవకాశాలను తెలియజేయడం వంటి చర్యలే ఈ దేశ వ్యవసాయ రంగానికి కొత్త రూపును తెస్తాయి.ఈ అంశాల కలబోతగా దేశంలో సరికొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకురాగలిగితే పల్లెలు సుసంపన్నం అవుతాయి. ప్రణాళికలు ఎన్ని అమలు చేసినా రైతు అంతిమంగా దెబ్బ తింటున్నది పంటను అమ్ముకునే క్రమంలో మాత్రమే అన్నది అందరికీ తెలిసిందే. దీన్ని విస్మరించి చేసే ఎటువంటి ప్రయత్నమైనా ఫలితమివ్వదని గుర్తించాలి. మంచి ఆలోచనలను స్వాగతించి అమలు చేయడం ఎంత ముఖ్యమో వాటి ఫలాలను రైతులకు అందించేలా చూడటం అంతే ప్రధానం. ఈ విషయంలో పాలకులు ఎంత పకడ్భందీగా వ్యవహరించగలుగుతారన్నఅంశంపైనే రైతులకు అందే ఫలాలు ఆధారపడి ఉంటాయి.

ఆలోచనాసరళి మారాలి

ఏళ్ల తరబడి వరుసగా ఒకే పంటను సాగు చేయడం, పంట మార్పిడిని పాటించకపోవడం వంటి లోపాలు దిగుబడుల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇలా చేస్తే నేల కూడా కొంత కాలానికి స్పందించడం మానేస్తుంది. ఫలితంగా పంటల ఉత్పత్తి పడిపోయి ఉత్పాదకత తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీనివల్ల దిగుబడులు తగ్గి సేద్యంలో నష్టాలు వస్తాయి. అవసరమున్న పంటలను ఇతోధికంగా ప్రోత్సహించాలి. ఆయా పంటలు బాగా పండించే ప్రాంతాల్లో ఆహారశుద్ధి రంగాన్ని కుటీర పరిశ్రమ స్థాయిలో ప్రోత్సహిస్తే రైతులకు మంచి లాభాలు అందుతాయి. పంటల సరళిలో, రైతుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావాలి. ఖరీఫ్‌లో వరి వేశాక రబీ పంటగా మళ్లీ వరి వేయకుండా పెసర, మినుము, మొక్కజొన్న తదితర పంటలతో మార్పిడి పాటించాలి. ఒక ఏడాది పత్తి వేశాక తదుపరి పంటగా మిర్చి వేసుకోవాలి. కానీ, నేల తడి ఆరని పల్లపు భూముల్లో వరి రెండు పంటలు వేయాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల ప్రత్యామ్నాయం కష్టం. మొత్తంగా మన నేల, వాతావరణం, నీటి వసతిని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ప్రాంతాల్లోనే ఆయా పైర్లను సాగు చేసుకోవడం ఉత్తమం. లాభసాటి పంటల విధానానికి దేశంలో కొత్త వ్యవసాయ విధానం రూపుదిద్దుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details