భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే గొప్ప నేత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ ఈ దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి! ఆయన ఆలోచనలు, ఆదర్శాలు నేటి తరానికే కాదు- భవిష్యత్ తరాలకూ స్ఫూర్తిదాయకం. అంబేడ్కర్‌ను ఏ ఒక్క కులానికో, మతానికో ఆపాదించలేం. ఆయనను కులాలకు, మతాలకు పరిమితం చేయడమంటే- అది ఆ మహనీయుడి స్థాయిని తగ్గించే ప్రయత్నమే అవుతుంది. ప్రత్యక్షంగా అనుభవించిన అంటరానితనాన్ని, కుల దుర్విచక్షణను దేశ చిత్రపటంనుంచి రూపుమాపాలని దృఢమైన సంకల్పం తీసుకున్నారాయన. అందుకే 'కులం పునాదులపై ఒక నీతిని గానీ, ఒక జాతిని గానీ నిర్మించలేము' అని ఆయన స్పష్టం చేశారు. అణగారిన కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్ర పరిష్కారం దొరకదని ఆయన భావించారు. ఆ వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంపదగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్నీ అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. అందుకే ఆయన మార్గనిర్దేశాల మేరకు రిజర్వు బ్యాంకు రూపకల్పన జరిగింది.
సమసమాజం కోసం
రిజర్వేషన్లపై ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా 'ఇంకెన్ని తరాలపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారు' అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించడం ఆలోచనలు రేకెత్తించింది. బీఆర్ అంబేడ్కర్ సైతం రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలని కోరుకోలేదు. అట్టడుగున ఉన్న, దుర్విచక్షణకు గురి అవుతున్న, అంటరానితనాన్ని అనుభవిస్తున్న సామాజిక సమూహాలు అభ్యున్నతి సాధించి కుల నిర్మూలన జరిగిననాడు రిజర్వేషన్ల అవసరమే ఉండదని ఆయన భావించారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధికంగా అత్యాచారాలు, నేరాలు చోటుచేసుకుంటోంది దళిత, ఆదివాసులపైనే. అక్షరాస్యత ప్రాతిపదికన ఉన్నత వర్గాలు 73శాతం కాగా- ఎస్సీలు 60.1శాతం వద్దే ఆగిపోయారు. జాతీయ స్థాయిలో పేదరికం 41శాతంగా ఉండగా; అత్యధిక శాతం వ్యవసాయ కార్మికులుగా నెట్టుకొస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గాలు 71శాతం మేర దారిద్య్రంలో మగ్గుతున్నాయి. రోడ్లు ఊడ్చటం, మానవ మలాన్ని శుభ్రపరచడం, జంతు కళేబరాలను పూడ్చటం వంటి అత్యంత దయనీయమైన వృత్తుల్లో నేటికీ ఈ వర్గాల వారు కొనసాగుతున్నారు. అసమానతలు, వెనకబాటు తీవ్రంగా కొనసాగుతున్న ఈ పరిస్థితి రిజర్వేషన్ల ఆవశ్యకతను, వాటి అమలుపై సహేతుక చర్చ జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
రాజ్యాంగంలోని 15(1) అధికరణ ప్రకారం పౌరులపట్ల జాతి, మత, లింగ, కుల ప్రాతిపదికన దుర్విచక్షణ కనబరచడానికి వీల్లేదు. 16 (1)ఏ అధికరణ మేరకు ప్రభుత్వ ఉద్యోగం విషయంలోనైనా, పదవి విషయంలోనైనా పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. పౌరులెవ్వరినీ జాతి, కుల, మత, లింగ, వంశ, ప్రాంతాల ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలకు గానీ, పదవులకు గానీ అనర్హులుగా భావించకూడదు, దుర్విచక్షణ పాటించరాదు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజ్యాంగంలోని అధికరణ 15(1) ప్రవచిస్తున్న సమానతా సూత్రాల మేరకు- కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వ్యతిరేకమని కొందరు న్యాయస్థానాలకు వెళ్లారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని సమాన సూత్రాలకు వ్యతిరేకమని దొరై రాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ నేపథ్యంలోనే 1951లో పార్లమెంటు తొలి రాజ్యాంగ సవరణ చేపట్టి అధికరణ 15కు క్లాజ్-4ని చేర్చింది. ఆ మేరకు వెనకబడిన వర్గాలకోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అని పేర్కొన్నారు. అదే విధంగా అధికరణ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లోను, పదవుల్లోను తగిన ప్రాతినిధ్యంలేని వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తే దానికి రాజ్యాంగం అడ్డురాదు. దేశంలో కేంద్ర స్థాయిలో విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్‌సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం, అవసరాల మేరకు రిజర్వేషన్లు వివిధ రకాలుగా అమలవుతున్నాయి. దేశంలోని అన్ని రుగ్మతలను, అసమానతలను రూపుమాపి సమానత్వం సాధించాలని అంబేడ్కర్ ఆకాంక్షించారు. సామాజిక న్యాయం గురించి చర్చించేటపుడు భారత రాజ్యాంగంలోని అధికరణలు 38, 46 చాలా ముఖ్యమైనవి.