దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...
వీటికి దూరంగా...
పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి ముందుగా ఇద్దరూ తమ తమ అభిరుచులు, ఇష్టాయిష్టాలు.. వంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఇద్దరూ కలిసి వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. అలాగని ఏ ఫోనో, ల్యాప్‌టాపో పట్టుకొని అన్యమనస్కంగా మాట్లాడుకోవడం కాదు.. ఇద్దరూ ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్లలోకి మరొకరు కళ్లు పెట్టి చూస్తూ.. తమకు సంబంధించిన విషయాలన్నీ పంచుకోవాలి. అప్పుడే వారి మధ్య ఐ కాంటాక్ట్ పెరిగి 'మేమిద్దరం ఒకరికొకరం, ఇద్దరం దగ్గరగా ఉన్నాం..' అన్న భావన కలుగుతుంది. దాంపత్య బంధంలో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు దగ్గరవడానికి, రొమాన్స్ పండించుకోవడానికి కూడా ఈ ఐ కాంటాక్టే ప్రధానమంటున్నాయి అధ్యయనాలు. కాబట్టి మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీ.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లన్నీ దూరం పెట్టి ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటే ఆ అనుబంధంలో అన్యోన్యతకు అవధులే ఉండవు.
కలిసి చదువుకోవాలి..
అదేంటి.. ఇప్పుడే కదా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపాలన్నారు.. అప్పుడే మళ్లీ చదువుకోమంటున్నారు.. అనుకుంటున్నారా? అవును.. దంపతులిద్దరూ కలిసి గడపడానికి ఎలాగైతే సమయం కేటాయించుకుంటారో.. అలాగే కలిసి చదవడం వల్ల కూడా వారి అన్యోన్యత హద్దులు దాటుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. అదెలాగంటే.. దంపతులిద్దరికీ పుస్తకాలు చదవడమంటే ఇష్టమనుకోండి.. ఎవరి పుస్తకం వారు చదువుకోవడం కాకుండా.. ఇద్దరూ కలిసి ఒక మంచి రొమాంటిక్ ప్రేమకథ పుస్తకాన్ని చదువుతూ.. అందులోని పాత్రల్లో మిమ్మల్ని ఊహించుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, రొమాన్స్ చేస్తూ.. సమయం గడపాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ కథ మరింత రసవత్తరంగా సాగడంతో పాటు మీ మధ్య అనుబంధం కూడా రెట్టింపై.. ఒకరికొకరు మరింత దగ్గరవుతారంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.