వాదనలొద్దు..
కొందరు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. నువ్వా, నేనా అన్నట్లు వాదించుకుంటారు. ఇది సరి కాదు. నిజంగా ఏదైనా సమస్య వచ్చి చిన్నపాటి గొడవ జరిగినా ప్రధాన విషయాన్ని గురించి మాట్లాడాలి తప్ప ఇతరత్రా వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలొద్దు. ఎప్పటి విషయాలనో గుర్తు చేసి గొడవను పెంచుకోవద్దు. ఇలా చేస్తే మీ బంధం బలహీనమవడమో, దూరం పెరగడమో జరుగుతాయి.
మెచ్చుకోలూ ముఖ్యమే!
భాగస్వామి మెచ్చుకుంటే సంతోషపడని వారుంటారా. కాబట్టి అప్పుడప్పుడూ ఎదుటి వారి పనులను మెచ్చుకుంటూ ఉండాలి. చిరు ప్రశంసతో వారూ పొంగిపోతారు. మీ శ్రీవారు/ శ్రీమతి మానసిక ఆందోళనతో ఉంటే మాటల్లో పెట్టి విషయం కనుక్కోవాలి. మెల్లగా ఉత్సాహపరచాలి. తన బలాలు పెరిగేందుకు మీ సాయం అందించాలి.
ఎక్కువ అంచనాలొద్దు!
భాగస్వామిపై మీ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. తనను ఎప్పుడూ ఇతరులతో పోల్చొద్దు. ఇలా చేస్తే వారు నొచ్చుకోవడం ఖాయం. అతిగా అంచనా వేసుకోవడం మానేసి పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి.