Relationship Tips: మూడుముళ్ల బంధానికి అందాల మార్గం.. దానికే యువత మొగ్గు! - తెలంగాణ వార్తలు
జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన వివాహం విషయంలో యువత ధోరణి ఆసక్తికరంగా ఉంటోంది. గతంలో ఎన్నడూ చూడనంత స్పష్టత, పరిపక్వత వారి ఆలోచనల్లో కనిపిస్తోంది. ముందు పెళ్లి చేసుకుందాం... తర్వాత తప్పులు దిద్దుకుందాం అని కాకుండా తప్పులకు ఆస్కారమే లేని వైవాహిక జీవితానికి వీరు మొగ్గు చూపుతున్నారు. వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ముందుగానే సిద్ధమవుతున్నారు. వివాహానికి ముందు కౌన్సెలింగ్‌కు మొగ్గు చూపుతున్నారు.
రిలేషన్ షిప్స్, మానసిక నిపుణుల చిట్కాలు
By
Published : Jul 4, 2021, 1:53 PM IST
పెళ్లి అంటే నూరేళ్ల పంట. వివాహమైతే ఇద్దరు వ్యక్తులు నిండు నూరేళ్లు కలిసి జీవితం పంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన వివాహం విషయంలో యువత ధోరణి ఇటీవల ఆసక్తికరంగా ఉంటోంది. గతంలో ఎన్నడూ చూడనంత స్పష్టత, పరిపక్వత వారి ఆలోచనల్లో కనిపిస్తోంది. ముందు పెళ్లి చేసుకుందాం... తర్వాత తప్పులు దిద్దుకుందాం అని కాకుండా తప్పులకు ఆస్కారమే లేని వైవాహిక జీవితానికి వీరు మొగ్గు చూపుతున్నారు. వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ముందుగానే సిద్ధమవుతున్నారు. పెళ్లి విషయంలో తమ అనుమానాలు, అపోహలను పటాపంచలు చేసుకునేందుకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం దీనికి నిదర్శనం. ఇలాంటి కేంద్రాలు హైదరాబాద్ మహానగరంలో సుమారు వందకు పైగా ఉన్నాయి. వీటిలో అత్యధికం ఇటీవల ఏర్పాటైనవే.
మనస్పర్థలకు అడ్డుకట్ట
పలు కార్పొరేట్ ఆసుపత్రులు ‘ప్రీ మారిటల్ కౌన్సెలింగ్’ పేరుతో ప్రత్యేక విభాగాలను నిర్వహిస్తున్నాయి. యువతీ యువకులను వైవాహిక జీవితానికి మానసికంగా సిద్ధం చేయడం, మార్పును ఆహ్వానించేలా తీర్చిదిద్దడం, బాధ్యతలను మోసేందుకు సన్నద్ధం చేయడం వంటివి ఈ కేంద్రాలు చేస్తున్నాయి. కాబోయే దంపతులు విడివిడిగా, కలిసి కూడా తమ కేంద్రాలకు వస్తున్నారని, గతంతో పోల్చితే నగరంలో ఇలా వస్తున్నవారి సంఖ్య పెరుగుతుందని మ్యారేజ్ కౌన్సెలర్, మనస్తత్వ విశ్లేషకులు అన్నం సుబ్రహ్మణ్యం తెలిపారు. అవగాహన పెరిగితే మనస్పర్థలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో యువత తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు.
మూడు ముళ్లు పడక ముందే చిక్కు ముడుల గురించి చర్చించేస్తున్నారు...
ఏడడుగులు వేసే ముందే వెనకా ముందూ ఆరా తీసేస్తున్నారు...పెళ్లిని నూరేళ్ల మంట కాకుండా చూసు కుంటున్నారు...
ఉన్న చిన్న జీవితాన్ని ఆనందాల పంటగా మార్చుకోవాలని తపిస్తున్నారు...ఇవి నవతరం ఆలోచనలు. దానికోసం వారేం చేస్తున్నారంటే...
ఆ తర్వాత కూడా...
తెలుగు రాష్ట్రాల్లో అధికశాతం గ్రేటర్ పరిధిలోనే విడాకులు, గృహహింస కేసులు నమోదవుతున్నాయి. కళ్లెదుట చిలుక గోరింకల్లా మెలగాల్సిన దంపతులు కలహాలతో ఠాణాలు, కోర్టులు చుట్టూ తిరుగుతుంటే ఎంతోమంది తల్లిదండ్రులు భరించలేక మనోవేదనకు గురవుతున్నారు. పెద్దల బాధ్యతను ప్రస్తుతం వైద్యులు, మనస్తత్వ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు, లైఫ్‌కోచ్‌లు స్వీకరిస్తున్నారు. ప్రేమికులు, సహజీవనం సాగిస్తున్న జంటలు అధికశాతం కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారు. హెచ్‌ఐవీ, జన్యుపరమైన సమస్యలను ముందుగానే తెలుసుకునేందుకు వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారు.
పొసగదని తెలిస్తే..
కాబోయే తోడును ఎంపిక చేసుకునేందుకు ఆచితూచి అడుగేస్తున్నారు. తమ అంతరంగాన్నీ కాబోయే భాగస్వామికి వివరించేస్తున్నారు. తమ ఇష్టాయిష్టాలు, లక్ష్యాలు పంచుకుంటున్నారు. కాబోయే భార్య లేదా భర్తలో తాము గుర్తించిన అంశాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చిస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎదుటివారిని అర్థం చేసుకోవటం, ప్రమాదకరమైన లోపాలు, కోపావేశాలు, నూరేళ్ల ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను తెలుసుకుంటున్నారు. అవతలి వారితో పొసగదని తెలిసినపుడు మర్యాదపూర్వకంగానే ఇద్దరం కలసి నడవటం కష్టమంటూ బయటపడుతున్నారని ప్రముఖ మనస్తత్వ నిపుణురాలు డాక్టర్ పూర్ణిమా నాగరాజ్ తెలిపారు. ఇప్పటి తరం యువతలో అమ్మాయిలు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. అబ్బాయిలు ఊహల్లో విహరిస్తూ వాస్తవానికి దూరంగా ఉంటున్నారంటూ ఆమె విశ్లేషించారు.
అంతా అయ్యాక వద్దంటే...
ఎంచక్కా పెళ్లిచూపులు జరిగాయి. జంట బాగుందంటూ ఇరువైపుల పెద్దలు సరేనన్నారు. కాబోయే ఆలుమగలు ఫోన్‌నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నెలరోజుల తర్వాత తనకు అబ్బాయి నచ్చలేదంటూ అమ్మాయి బాంబుపేల్చింది. అతడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఇంత వాగుడుకాయతో జీవితాంతం కలసి బతకటం కష్టమనేది ఆమె అభ్యంతరం. మనస్తత్వ నిపుణురాలి వద్ద రెండు దఫాలు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబాలు, మనసులు కలిశాక చిన్న అంశాన్ని పెద్దగా చూడకూడదనే అంశం యువతి గ్రహించేలా చేశారు.
మార్పు ఇలా...
మంచిజోడీ అవుతుందంటూ బంధువులు ధ్రువీకరించిన జంట. నెలరోజులకే ఈ పెళ్లి వద్దంటూ యువకుడు తల్లిదండ్రులకు చెప్పాడు. అందం, అణకువ అన్నీ ఉన్నా తనను చూస్తే లైంగిక ఆకర్షణ కలగట్లేదన్నది అతడు చెప్పిన కారణం. పెళ్లికి ముందు సహజంగా ఉండే భయాలు, అపోహలు వంటివి దీనికి కారణాలవుతాయంటూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా కుర్రాడిలో మార్పు తెచ్చారు.