మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. జన్యువులు, పెరిగిన వాతావరణం కూడా మన ప్రవర్తన, స్వభావంపై ప్రభావం చూపుతాయి. నిరంతరం అందరి మెప్పు పొందాలని తపన పడేవాళ్లు అంతర్గతంగా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఎదుటివారి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తుంటారు.
వాళ్లందరూ నా గురించే మాట్లాడుకుంటారా? - Feeling of inferiority
చుట్టుపక్కల ఎవరేం మాట్లాడుకుంటున్నా అది తమ గురించేనని కొందరు భావిస్తుంటారు. వాళ్లు తమతో సరిగ్గా మాట్లాడటం లేదని బాధపడుతుంటారు. అందరి మెప్పు పొందాలని తపిస్తుంటారు. ఇది మానసిక వ్యాధి కాదని.. పెరిగిన వాతావరణం ప్రభావం మన ప్రవర్తన, స్వభావంపై ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణురాలు గౌరీదేవి అంటున్నారు. ఎదుటి వారిని సంతోషపరచడానికి.. అందరి మెప్పు పొందడానికి ప్రయత్నించకుండా.. మీరు మీలానే ఉండాలని సూచిస్తున్నారు.
మీ బలహీనతను పసిగట్టి మిమ్మల్ని లోకువ చేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో వాళ్లతో బాగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మొదటి నుంచి ఎదుటివారి మెప్పు పొందాలని చేసే ప్రయత్నాల్లో ఇది మీ వ్యక్తిత్వంలో భాగమైపోతుంది.
మీ స్వభావం ఎలా ఉందో అలా మసులుకుంటూ అందరితో మామూలుగానే ఉండండి. వాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటారో లేదో అని ఆలోచించకండి. ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. అలాచేస్తే దాన్ని ఎదుటివారు అలుసుగా తీసుకుంటారు. కాబట్టి మీరు మీలా ఉండండి. ఉన్నదాంతో తృప్తిగా, ఆనందంగా ఉండండి. ఇలా చేస్తే మీరు సులువుగా ఇతరులతో కలవగలుగుతారు. ఈ వయసులో వ్యక్తిత్వాన్ని మార్చుకోలేం. ఒకవేళ ఎవరితోనైనా మీకు మాట్లాడటం మరీ ఇబ్బందిగా అనిపిస్తే ఓసారి సైకాలజిస్ట్‌ను సంప్రదించండి.