తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'మా బాస్‌ అమ్మాయిలకు వ్యతిరేకం.. షాకింగ్‌ ఏమిటంటే తనూ స్త్రీనే'

మా బాస్‌ అమ్మాయిలకు వ్యతిరేకం. షాకింగ్‌ విషయమేమిటంటే తనూ స్త్రీనే. టీమ్‌లో ఎవరైనా కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా సెలవు అడిగినా, సాయమడిగినా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా పనిచేయాలో అర్థం కావడం లేదు. - సృజన, వైజాగ్‌

women-employee-problems-with-boss
మహిళా ఉద్యోగి ఇబ్బందులు

By

Published : Nov 11, 2021, 10:32 AM IST

బతుకు బండి నడవాలంటే దంపతులిద్దరూ కష్టపడాల్సిందే. అటు ఆఫీసు పని, ఇటు ఇంటి పని చేసుకుంటూ ముందుకెళ్లడంలో మహిళలదే కీలకపాత్ర. సమతూకం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఉదయాన్నే ఇంటి పని చక్కబెట్టుకుని భర్తను ఆఫీసుకు పంపి... తనూ ఆఫీసుకు వెళ్లి.. అక్కడి నుంచే పిల్లల ఆన్‌లైన్‌ పాఠాలను పర్యవేక్షిస్తూ సవ్యసాచిలా అన్ని పనులు చక్కబెట్టాలి. ఇలా ఇల్లు, ఆఫీస్‌ బాధ్యతలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అర్థం చేసుకునే, మద్దతిచ్చే బాస్‌ ఉంటే పని కొంచెం తేలికవుతుంది. అలా కాకుండా పిల్లల స్కూలు ఈవెంట్లకు హాజరు కావడం, అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులను చూసుకోవడం లాంటి కారణాలకు సెలవడిగిన ప్రతిసారీ విసుక్కుంటే కొంచెం కష్టమే. కరోనా తర్వాత ఇల్లు, ఆఫీసు రెండింటి పనితో తీరిక లేని వారికి ఇది మరీ సవాలు. వీటిని అర్థం చేసుకోలేని బాస్‌ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

మా బాస్​కు అమ్మాయిలంటే చిరాకు అని ఓ సినిమాలో హీరోను గురించి ఓ డైలాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ బాస్​ ఓ లేడీ అయినా.. అర్థం చేసుకోవట్లేదనే ఆవేదన మీది.

  • ముందు మీ హక్కులను తెలుసుకోండి. సెలవుల వివరాలు, పనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు, కంపెనీ పాలసీల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. నేరుగా హెచ్‌ఆర్‌ అధికారిని అడిగీ తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా మీకున్న అవకాశాలను అంచనా వేసుకోండి.
  • మీ పై అధికారిని కలిసి పరిస్థితిని వివరించండి. సంస్థకు, బృందానికి అందిస్తున్న సేవలతోపాటు మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలనూ తెలియజేయండి. మొత్తంగా నిజాయతీగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోండి. ఆమెకు సహానుభూతి లేనంత మాత్రాన కఠినాత్మురాలని చెప్పలేం. బహుశా ఆ దిశగా ఆలోచించకపోయుండొచ్చు. ఉదాహరణకు- మీ బాస్‌కు పిల్లలు లేకపోయుంటే ప్రస్తుత ఆన్‌లైన్‌ పాఠాల ఇబ్బందులు తెలిసుండకపోవచ్చు. తల్లులే టెక్‌పరంగా, పాఠాలు మొదలైన వాటి పరంగా ఎలా సాయమందిస్తున్నారన్నది అవగాహన ఉండదు.
  • సహానుభూతిని ప్రదర్శించండి. అధికారికి మన సానుభూతి అవసరమేముంది అనుకోకండి. వాళ్లకీ పై నుంచి ఒత్తిడి, ఆతృత ఉంటాయి. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి రాబట్టడానికి కష్టపడుతుంటారు. కాబట్టి ఆమె కోణంలోనూ ఆలోచించండి. ఇదంతా వ్యూహాత్మకంగా సాగాలి. ఆమె ఇబ్బందులు, ఆందోళన కలిగించే అంశాలను అడిగి చూడండి. అలాగే లక్ష్యాల గురించి తెలుసుకోండి. వాటికి మీ వంతు సాయం అందిస్తానని చెప్పి చూడండి. మాట్లాడితే.. చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి. ముందు దాన్ని ప్రయత్నించి చూడండి.

ABOUT THE AUTHOR

...view details