కీళ్లు, ఎముకలకు మధ్య స్థితిస్థాపకతను కలిగి ఉండే గుజ్జులాంటి మెత్తటి పదార్థాన్నే కార్టిలేజ్ అంటారు. ఇది ఎముకల మధ్య రాపిడి లేకుండా, నడవడానికి ఉపయోగపడుతుంది. వయోభారం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల ఈ గుజ్జు అరిగిపోవచ్చు లేదా ఎండిపోయి గట్టిగా మారి సహజ గుణాన్ని కోల్పోవచ్చు. దాంతో నడిచినప్పుడు నొప్పీ, ఆ ప్రాంతంలో వాపు కలుగుతాయి. కార్టిలేజ్ అరుగుదలను బట్టి వైద్యులు పలురకాల చికిత్సలు సూచిస్తారు. అయితే దీని పెరుగుదలలో సహజంగా కొన్ని పోషకాలు ముఖ్యపాత్ర వహిస్తాయి.
కార్టిలేజ్ పెరగాలంటే.. ఏం తినాలి..? - health news
నా వయసు నలభై అయిదేళ్లు. ఎత్తు అయిదు అడుగులు. బరువు 75 కిలోలు. ఇంతకుముందు ఇంకా ఎక్కువ బరువుండేదాన్ని కొన్నాళ్లపాటు, నడక, కసరత్తులు చేసి బరువు తగ్గా. అయితే మోకాళ్ల సమస్యలు రావడంతో వైద్యులను సంప్రదించా. వాళ్లు పరీక్షించి కార్టిలేజ్ అరిగిపోయిందన్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ మృదులాస్థి పెరుగుతుంది.? బరువు తగ్గడానికి నడక కాకుండా ప్రత్యామ్నాయాలున్నాయా? - ఓ సోదరి
తక్కువ కెలొరీలున్న ఆహారం తీసుకోవాలి. రోజూకు 1500 నుంచి 1800 కిలోకెలొరీలు అందేలా ఆహారం తీసుకోవాలి. లైసిన్ అనే అమైనో యాసిడ్ ఈ కార్టిలేజ్ తయారీకి దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రొటీన్లతోపాటు లైసిన్ ఉండే పాలు, పాల పదార్థాలు, చీజ్, పనీర్ చికెన్, పుట్టగొడుగులు, సోయాబీన్స్ ఉండేలా చూసుకోవాలి. కార్టిలేజ్‌లో ఉండే కొల్లాజెన్ తయారీకి విటమిన్- సి చాలా అవసరం. ఈ పోషకం ఉండే జామ, నిమ్మ, ఉసిరిరసం, పొడి తీసుకోవాలి. కొల్లాజెన్ దెబ్బతిని వాపు రాకుండా ఉండేందుకు దంపుడు బియ్యం, గుడ్డు, పొద్దుతిరుగుడు గింజలు, విటమిన్-ఇ, కొబ్బరి, బాదం తీసుకోవాలి. వీటితోపాటు ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే వాల్‌నట్స్, అవిసెగింజలు, ఆకుకూరలు, సోయాబీన్స్, చేపలను తీసుకోవాలి.