తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చేయాలి? - పై పెదవిపై అవాంఛిత రోమాలు

హాయ్‌ మేడం. నా వయసు 30. నా నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉంటుంది. ఈ నలుపు తగ్గి ముఖమంతా ఒకే రంగులోకి రావాలంటే ఏం చేయాలి? అలాగే నా అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలున్నాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి? పరిష్కారం చూపగలరు. - ఓ సోదరి

how-to-remove-upper-lip-hair
అప్పర్‌లిప్‌పై అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చేయాలి?

By

Published : Mar 18, 2021, 5:23 PM IST

ముందుగా అప్పర్‌లిప్‌పై ఉండే అవాంఛిత రోమాల్ని వ్యాక్సింగ్‌ ద్వారా తొలగించుకోవాలి. ఆపై రోమాలు త్వరగా పెరగకుండా ఉండేందుకు ఇంట్లో లభించే పదార్థాలతో ప్యాక్‌ తయారుచేసుకొని ఉపయోగించచ్చు. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ పెరుగు, అర టేబుల్‌స్పూన్‌ బియ్యప్పిండి.. ఈ మూడింటినీ ప్యాక్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వ్యాక్స్‌ చేసుకున్న ప్రదేశంలో అప్లై చేసుకొని పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేసినట్లయితే అవాంఛిత రోమాలు త్వరగా రాకుండా ఉంటాయి.

ఇక నుదురు, గడ్డం, పెదాలపై నల్లగా ఉందని రాశారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే బంగాళాదుంప ప్యాక్‌ చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం.. బంగాళాదుంపను బాగా కడిగి తొక్క చెక్కేయాలి. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇందులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మరీ జారుడుగా ఉంటే అర టేబుల్‌స్పూన్‌ శనగపిండి లేదా అర టేబుల్‌స్పూన్‌ బార్లీ పౌడర్‌ వేసుకొని మృదువైన పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయాలి. తద్వారా ముఖంపై ఉండే నల్లదనం తగ్గిపోయి ముఖమంతా ఒకే రంగులోకి మారుతుంది. -శోభారాణి, బ్యూటీ ఎక్స్​పర్ట్​

ఇదీ చూడండి:డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందాలంటే..

ABOUT THE AUTHOR

...view details