జ.పని చేసే చోట ఉద్యోగినులకు ఎదురయ్యే ఇలాంటి పరిస్థితి లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. మీకొక్కరికే కాదు. ఉద్యోగ వాతావరణంలో చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మిగిలిన వాళ్లకు చెబితే వాళ్లేం అనుకుంటారో అని, నలుగురిలో అవమాన పడతామని, ఉద్యోగం పోతుందని చాలామంది భయపడి వూరుకుంటారు. మౌనంగానే బాధపడుతూ ఉంటారు. ఇది సరికాదు. అయినా ఈ సమస్యను సాధ్యమైనంత వరకు మూడో వ్యక్తికి తెలియకుండానే పరిష్కరించుకోవచ్చు. ఆ దృష్టిగా మీ ప్రయత్నాలు చేయండి. ఏం చేస్తారంటే, మీ పై అధికారితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అనుమతి తీసుకోండి. 'లైంగిక వేధింపులు' అనే మాట రాకుండా అతని ప్రవర్తన మీకు ఎంత ఇబ్బందికరంగా ఉంటోందో, దాని వల్ల మీరెంత అసౌకర్యానికి గురవుతున్నారో అతనికి తెలియజేయండి. భయపడుతున్నట్లో, లేక కోపంగానో కాకుండా అలాంటి పనులను మానేయమని మామూలుగానే వివరించండి. మీరు చెప్పే విషయాన్ని స్పష్టంగా వివరించండి. దాని వల్ల ఇన్నాళ్లూ మీరు మౌనం వహించింది ఇష్టం వల్ల కాదనే విషయం ఆయనకు అర్థమవుతుంది.
Harassment: బాస్ ప్రవర్తన శృతి మించుతోంది.. ఏం చేయాలి?
నేను ఓ సంస్థలో ఏడాదిగా పనిచేస్తున్నా.. నా పనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేనూ ఉత్సాహంగానే కష్టపడుతున్నాను. అయితే ఈ మధ్యే నా పై అధికారుల్లో ఒకరి వల్ల సమస్య మొదలైంది. కారణం అతని ప్రవర్తనే. మొదట్లో ఆయన నాతో బాగా మాట్లాడుతుంటే సలహాలిస్తున్నారనీ, బృందంలో ఒకరిగా భావించి మాట్లాడుతున్నారని అనుకునేదాన్ని.. క్రమంగా సాయం, సూచనల పేరుతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నేను ధరించిన దుస్తులు, నా శరీరాకృతి గురించి వ్యాఖ్యానించారు. తర్వాత మరీ శృతి మించుతూ, మంచి పని చేసినప్పుడల్లా 'శభాష్' అంటూ భుజం తడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పండి. - ఓ సోదరి
ఇలా చెప్పిన తర్వాత కూడా అతను తన ప్రవర్తనను మార్చుకోకపోతే 'అతని పనులు లైంగిక వేధింపుల కిందకు వస్తాయని, ఇప్పటికైనా మారకపోతే సంస్థ యాజమాన్యానికి తెలియజేస్తాననీ' గట్టిగా హెచ్చరించండి. యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామంటే ఉద్యోగంపై ప్రభావం చూపుతుందని చాలామంది భయపడతారు. దాంతో ఈ సమస్య సాధ్యమైనంత వరకు పరిష్కారమవుతుంది. ఇంత చేసినా వినకపోతే, మీరేమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఏ సంస్థలూ ఇలాంటి ప్రవర్తనను, ఈ రకమైన తీరును ప్రోత్సహించవు. కచ్చితంగా మీ ఫిర్యాదును పరిశీలించి, విషయాన్ని గోప్యంగా ఉంచుతూ తగిన చర్యలు తీసుకుంటాయి.
ఇదీ చూడండి:పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు- ఆపేదెలా?