ఇంట్లో సహజంగా అందాన్ని చేకూర్చే పదార్థాలు అన్నీ ఉన్నా ఏది పెట్టుకుంటే ఏమవుతుందో అని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ కాస్త ఓపిక, శ్రద్ధ పెడితే చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేయడంతో పాటు చర్మ పోషణకు అవసరమయ్యే పోషకాలను కూడా అందించవచ్చు. మనకు నచ్చినట్లు అందంగా కనిపించడానికి ప్రయత్నించవచ్చు. ఈ క్రమంలో సహజసిద్ధంగా లభించే అరటిపండు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం..!
కావాల్సినవి…
- బాగా ముగ్గిన దేశవాళీ అరటిపండు -1
- తేనె - చెంచా
- బార్లీ పౌడర్ - చెంచా
ఈ ప్యాక్ కోసం తీసుకునే అరటిపండు బాగా ముగ్గినదై ఉండాలి. అంటే చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోయేంతగా పండినదైతే మంచిది. అలాంటి అరటిపండు, తేనె, బార్లీపౌడర్ ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. అరటిపండు చర్మాన్ని పట్టి ఉండదు.. వెంటవెంటనే జారిపోతూ ఉంటుంది. అందుకే ఇది చర్మానికి పట్టి ఉండేలా చేయడానికే ఇందులో బార్లీపౌడర్ కలిపాం. ఒకవేళ అరటిపండు బాగా ముగ్గినదైతే బార్లీపౌడర్‌కు బదులు వరిపిండి చెంచా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కింద నుంచి పైకి పూతలా వేసుకోవాలి. 30 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అయితే ఆరనివ్వమన్నాం కదా అని ఫ్యాన్ కింద ఉంటే పొరపాటే. ఈ ప్యాక్ ఎంత సహజంగా ఆరితే అంత ప్రయోజనం ఉంటుంది. ఇలా వారానికోసారి ఈ ఫేస్‌ప్యాక్‌ను అప్త్లె చేసుకోవచ్చు.
దీని వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరి చేరవు. అలాగే చర్మం కూడా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ