తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మామిడి పండు తో సౌందర్య రహస్యాలు మీకు తెలుసా? - Mango Face Packs

వేసవి అంటే.. ఎర్రటి ఎండలకు భయపడ్డా, కమ్మని నోరూరించే మామిడి పండ్ల కోసం ఎండ వేడిని భరించడానికి కూడా సిద్ధమంటారు చాలామంది. కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయట. అయితే కేవలం తినడం వల్లే కాదు. మామిడి పండు గుజ్జును సౌందర్య పరిరక్షణకు ఉపయోగించడం వల్ల కూడా మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చు. మరి, మామిడి పండు గుజ్జుతో మన చర్మాన్ని, జుట్టును కాపాడుకునేందుకు ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలో తెలుసుకుందాం రండి.

mango with beauty tips, beauty secrets with mango fruit
మామిడి పండు తో సౌందర్య రహస్యాలు మీకు తెలుసా?

By

Published : Apr 28, 2021, 12:28 PM IST

మామిడిలో ఉన్న సుగుణాల వల్ల ముఖ చర్మం నిగనిగలాడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. మెరుపు కూడా సొంతమయ్యేలా చేస్తుంది. దీనికోసం ఒక మామిడి పండు గుజ్జు తీసుకోవాలి. మామిడి పండు గుజ్జు తీసేటప్పుడు తొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొక్కను ఫేస్‌ప్యాక్‌లో రాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే దీనివల్ల చర్మానికి దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం గుజ్జును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మామిడి గుజ్జుకు సమాన పాళ్లలో ముల్తానీ మట్టిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకొని దాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని ఆపై గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ చల్లని నీటితో ప్యాక్ తొలగించుకోవాలి.


ఓట్ మీల్‌తోనూ..

ఓట్‌మీల్ మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచి చేస్తుందన్న సంగతి తెలిసిందే. దీనికి మామిడి పండు గుజ్జును చేరిస్తే ఆ ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి. దీనికోసం ఏడెనిమిది బాదం పప్పులను నీటిలో నానబెట్టి పొట్టు తీసి, వాటికి రెండు టీస్పూన్ల పాలు, కొద్దిగా ఓట్స్, నీళ్లు, ముల్తానీ మట్టి, ఒక మామిడి పండు గుజ్జు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావు గంట పాటు ఉంచుకొని కడిగేస్తే సరిపోతుంది. దీన్ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.

ట్యాన్‌కి టాటా..

ఎండాకాలంలో ఎక్కువగా ఎదురయ్యేది ట్యాన్ సమస్య. దీనికి వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మామిడి పండు గుజ్జులో నాలుగు టేబుల్ స్పూన్ల శెనగ పిండి, నాలుగైదు బాదం పప్పుల పొడి, తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ఎండ వల్ల నల్లగా మారిన భాగాల్లో అప్త్లె చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ట్యాన్ తొలగిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్యాక్‌ని వేసుకోవడం వల్ల నల్లగా మారకుండా మన చర్మాన్ని కాపాడుకోవచ్చు.


మామిడి స్క్రబ్..

మామిడితో కేవలం ముఖానికే కాదు.. పూర్తి శరీరానికి మెరుపు తీసుకురావచ్చు. మామిడి పండుతో తయారుచేసిన స్క్రబ్‌తో చర్మాన్ని రుద్దుకోవడం వల్ల మృతచర్మం తొలగడంతోపాటు చర్మకణాలకు చక్కటి పోషణ అంది మేను మెరిసిపోతుంది. దీనికోసం ఒక మామిడిపండు గుజ్జులో రెండు టీస్పూన్ల పాలు, కొద్దిగా తేనె, అర కప్పు బ్రౌన్ షుగర్ వేసి దాంతో ఒళ్లంతా స్క్రబ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇలా కనీసం వారానికోసారి చేయడం వల్ల చక్కటి చర్మం మీ సొంతమవుతుంది.

పట్టులాంటి కురుల కోసం..

మామిడితో అందమైన చర్మమే కాదు.. పట్టులా మెరిసే జుట్టు కూడా మీ సొంతమవుతుంది. దీనికోసం ఒక మామిడి పండు గుజ్జు తీసుకొని అందులో బాగా పండిన బొప్పాయిలో పావు భాగాన్ని, టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి రెండు గంటలు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మామిడి, బొప్పాయిలోని సుగుణాలు జుట్టుకు జీవాన్ని అందించి కురులు మెరిసేలా చేస్తాయి.


జుట్టు రాలకుండా కూడా..

మామిడి ప్యాక్‌ని వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందంటే మీరు నమ్ముతారా? ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత తప్పనిసరిగా నమ్ముతారు. ఎందుకంటే దీన్ని ఉపయోగించిన రెండు, మూడు వారాల్లోనే జుట్టు రాలడం తగ్గుతుందట. ఇందుకోసం ఒక మామిడి పండు గుజ్జులో రెండు గుడ్ల పచ్చసొన, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని జుట్టు కుదుళ్లకు అప్త్లె చేసుకొని ముప్పావు గంట పాటు ఉంచుకుంటే సరి.. ఆపై చన్నీటితో తలస్నానం చేసేయాలి.. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలడం ఇట్టే తగ్గుముఖం పడుతుంది.
చూశారుగా.. వేసవిలో వచ్చే రుచికరమైన మామిడి పండుతో సౌందర్య పరిరక్షణకు ఎన్ని ప్యాక్స్ తయారుచేసుకోవచ్చో.. మీరూ వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి మరి.. అయితే ఒక్క విషయం.. ఎంచుకొనే మామిడి పళ్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. రసాయనాలతో కృత్రిమంగా పండించినవి కాకుండా సహజంగా పండిన మామిడి పళ్లను మాత్రమే వినియోగించండి. అలాగే మీకు చర్మానికి ఆయా ప్యాక్స్ వేసుకొనే ముందు అవి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మరిచిపోవద్దు.

ఇదీ చూడండి :వింత: పనస చెట్టుకి జామకాయ!

ABOUT THE AUTHOR

...view details