ప్రెగ్నన్సీ సమయంలో తొమ్మిది నెలలపాటు గర్భాశయంలో బిడ్డ క్రమంగా ఎదుగుతుంది. దాంతో గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. ప్రసవమయ్యాక అది సాధారణ స్థితికి రావడానికి దాదాపు 2-6 వారాలు పడుతుంది.
ప్రసవం తర్వాత రక్తస్రావం ఎన్నిరోజులవుతుంది? - pregnancy
నావయసు ముప్పై. ఈ మధ్యే పాప పుట్టింది. సిజేరియన్ అయ్యింది. అప్పటి నుంచి వెన్నునొప్పితోపాటు ఒంటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? ప్రసవమయ్యాక ఎన్ని రోజులవరకు రక్తస్రావమవుతుంది? - శ్వేత, హైదరాబాద్
యూట్రస్ రెండు వారాల్లో పెల్విక్ బోన్‌లోకి వెళ్లిపోతుంది. అయితే సాధారణ స్థితికి రావడానికి మాత్రం ఆరు వారాలు పడుతుంది. అప్పటివరకు కొద్దికొద్దిగా స్రావం అవుతుంటుంది. మొదట్లో ఒకట్రెండు వారాలు రక్తస్రావమైనా, తరువాత తెల్లగా/గులాబీ రంగులో స్రావాలు వెలువడటాన్ని లోకియా అంటాం. ఇది సాధారణమే. ప్రెగ్నన్సీ సమయంలో రిలాక్సిన్ అనే హార్మోన్ విడుదలవడంవల్ల కండరాలు, ఎముకలన్నీ వదులుగా మారతాయి. అలాగే ప్రొజెస్టిరాన్ హార్మోన్ వల్ల జీర్ణకోశం నుంచి మూత్రాశయ కండరాల వరకు... అన్నీ రిలాక్స్ అవుతాయి. కడుపులోని బిడ్డ.. తల్లి నుంచి ఎక్కువగా కాల్షియంను తీసుకుంటుంది, అలాగే పాలిచ్చే తల్లుల నుంచి కూడా ఎక్కువ కాల్షియం బిడ్డకు అందుతుంది. అంటే గర్భిణులు, బాలింతలకు ఎక్కువగా ఈ ఖనిజం అవసరమవుతుందన్నమాట. ఇది తక్కువైనా, కండరాలు పూర్వపు స్థితికి చేరుకోకపోయినా వెన్నుతోపాటు, ఒంటి నొప్పులు వస్తాయి. మీకు ప్రసవమై కొద్దిరోజులే అయింది కాబట్టి ఏమైనా జ్వరం, ఇన్‌ఫెక్షన్ లాంటివి ఉన్నాయేమో పరీక్షించుకోండి. ఒకవేళ ఉంటే, చికిత్స తీసుకోవాలి. అవేమీ లేకుంటే కాల్షియం, మెగ్నీషియం, సప్లిమెంట్స్ సరిగా వాడాలి.
అలాగే లిగమెంట్స్ పూర్వపు స్థితికి రావడానికి ఫిజియోథెరపిస్ట్ సూచనల మేరకు చేతులకు, కాళ్లకు సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే చాలా తొందరగా లిగమెంట్స్ సాధారణ స్థితికి వచ్చి నొప్పులు తగ్గుతాయి. అలానే మనం నిల్చొని ఉన్నప్పుడు శరీర బరువు అసాధారణస్థితిలో ఉన్న సున్నితమైన లిగమెంట్స్ మీద పడి నొప్పి వస్తుంది. ఈ సమయంలో మీరు లాంబర్ అబ్డామినల్ బెల్ట్ పెట్టుకోవచ్చు. ఈ బెల్ట్ పెట్టుకుంటే దీనిమీదే బరువు పడి నొప్పి తగ్గుతుంది. ఆరువారాల తరువాత లిగమెంట్స్‌కు శక్తినిచ్చే వ్యాయామాలు మొదలుపెట్టాలి.
- ఇదీ చూడండి:వ్యర్థాలకు... కొత్తందాలు తెస్తున్నారు!