కోల్‌కతాలో పుట్టిపెరిగిన రుక్మిణీ బెనర్జీ (Rukmini Banerjee) పుణేలో ఎల్‌ఎల్‌బీ, లండన్‌లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేశారు. చదువు కాగానే ముంబయి వచ్చి స్థిరపడ్డారు. పదేళ్లు అనేక సంస్థల్లో పని చేశారు. 2017లో ప్రసూతి సెలవులో ఉండగా ఖాళీ సమయం దొరికింది. చుట్టూ చాలా మంది పిల్లలు మాటిమాటికీ అనారోగ్యాలతో బాధపడటం చూశారు. చిన్నప్పుడు తనకెప్పుడూ అలా కాలేదంటే కారణం తిండే. పిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది, చక్కగా ఎదుగుతారు- అనుకుంది. బాబు పుట్టాక హెల్దీ స్నాక్స్ (Healthy Snacks) దొరుకుతాయేమోనని చూస్తే.. ప్యాకెట్ల మీద రాతలకూ యదార్థానికీ చాలా తేడా ఉంది. వాటిల్లో ఉపయోగించే పంచదార, పిండి, నూనె లాంటివేవీ మేలు చేసేవి కాదని తేలింది. తానే చిరుతిళ్లు (Snacks) తయారు చేయాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘తల్లులందరికీ పిల్లలు పొడవు అవ్వాలని ఉంటుంది. అందుకే జిరాఫీ గుర్తొచ్చి ‘ది గ్రోయింగ్ జిరాఫీ (The Growing Giraffe)’ (టీజీజీ) పేరును ఎంచుకున్నా’నంటారు.
అడ్డంకులూ సవాళ్లూ
ఆమె ఆలోచన పిల్లలకు పరిశుభ్రమైన పోషకాహారం అందించడం. ఆ పని తన వంటింట్లోనే ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు (Online Orders) తీసుకుని పండ్లరసాలు, సలాడ్‌లు, బీట్‌రూట్ ఇడ్లీ లాంటివి సప్లయ్ చేయాలనుకున్నారు. అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉన్న ఇళ్లల్లో ఇలాంటివి ఆర్డర్ చేయాల్సిన పనేముంది, తామే చేసిస్తారు. రుక్మిణి దృష్టి కుకీస్ మీదికి దృష్టి మళ్లింది. దాంతో వాటి తయారీ కోర్సులో చేరి ‘హెల్దీ కుకీస్, న్యూట్రిషస్ బార్స్’ (Healthy Cookies, Nutrition Bars) బేకింగ్ పద్ధతి నేర్చుకున్నారు. రెండు లక్షల రూపాయలతో టీజీజీ ప్రారంభించారు. అందులో ఎక్కువ శాతం కంపెనీ లోగోకి, వెబ్‌సైట్ రూపొందించడానికే ఖర్చు అయ్యింది.