ఆరు నెలల దాకా తల్లి పాలే పిల్లలకు అన్నం, నీళ్లు.. అన్నీ! వీటి ద్వారానే పసివారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇలాంటి అమృతధారలు చిన్నారులకు అందాలన్న ముఖ్యోద్దేశంతోనే చాలా దేశాల్లో కొత్తగా తల్లైన మహిళలకు కనీసం ఆరు నెలల పాటు ప్రసవానంతర సెలవులు అందిస్తోన్న విషయం తెలిసిందే! అలాగని ఆరు నెలలే తల్లులు పాలివ్వాలన్న రూలేమీ లేదు. కొంతమంది ఏడాది పాటు, మరికొందరు రెండేళ్ల దాకా తమ చిన్నారులకు తల్లి పాలు పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉండే తల్లులకైతే ఏ ఇబ్బందీ ఉండదు. అదే వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారు నిరంతరాయంగా తమ పిల్లలకు పాలివ్వాలంటే కష్టమే! ఈ ఉద్దేశంతోనే తల్లిపాలను భద్రపరిచే పద్ధతి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇలా తల్లి రొమ్ము నుంచి సేకరించిన పాలను భద్రపరచడం, వాటిని తిరిగి పిల్లలకు పట్టించడం.. వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ. అప్పుడే ముందస్తుగా భద్రపరిచినా అందులోని పోషకాలన్నీ చిన్నారులకు చక్కగా అందుతాయని చెబుతోంది. మరి, ఇంతకీ ఏంటా జాగ్రత్తలు? తెలుసుకుందాం రండి...
పాలు ఇలా సేకరించాలి!
- తల్లులు తమ రొమ్ముల నుంచి పాలు సేకరించే ముందు చేతుల్ని సబ్బు-నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ సబ్బు అందుబాటులో లేని పక్షంలో (ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో పాలు పిండాల్సి వస్తే..) 60 శాతం ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
- చేతులతో లేదా మ్యాన్యువల్/ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంపుతో.. ఇలా పాలు తీయడానికి మీకు సౌకర్యవంతంగా అనిపించిన పద్ధతిని పాటించచ్చు.
- అయితే ఈ క్రమంలో ఉపయోగించే బ్రెస్ట్ పంప్ కిట్‌ని ముందుగానే వేడి నీటితో శుభ్రం చేసి పెట్టుకోవడం ముఖ్యం.
- పాలు సేకరించిన వెంటనే పాల డబ్బాకు అనుసంధానమై ఉన్న ట్యూబ్స్ అన్నీ తొలగించి డబ్బాను గాలి చొరబడని మూతతో మూసేయాలి. లేదంటే అందులోకి గాలి చొరబడే అవకాశం ఉంది. పాలు తాగినప్పుడు చిన్నారి శరీరంలోకి ఈ గాలి ప్రవేశించి గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతుంది.
‘భద్రం’గా భద్రపరచాలి!
- పాలు సేకరించడమే కాదు.. వాటిని భద్రపరచడమూ ముఖ్యమే. ఈ క్రమంలో ప్రత్యేకమైన మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటినైనా ఉపయోగించచ్చు. లేదంటే ఇంట్లో ఉండే గ్లాస్ జార్లు, మందపాటి ప్లాస్టిక్ జార్లు.. వంటివి ఉపయోగించచ్చు. అయితే వీటి మూత గాలి చొరబడనంత బిగుతుగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.
- అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. పాలు భద్రపరచడానికి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ కంటెయినర్స్ అస్సలు వాడకూడదు. ఎందుకంటే వాటిలో BPA (Bisphenol A) అనే రసాయనిక సమ్మేళనం ఉంటుంది. అది పసి వారి ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
- తిరిగి ఉపయోగించడం కుదరని (డిస్పోజబుల్) బాటిల్ లైనర్స్, ప్లాస్టిక్ బ్యాగుల్లో ఈ పాలను అస్సలు నిల్వ చేయకూడదు.
- తల్లి రొమ్ము నుంచి తాజాగా సేకరించిన పాలను గది ఉష్ణోగ్రత వద్ద సుమారు నాలుగు గంటల పాటు ఉంచచ్చు. అదే రిఫ్రిజిరేటర్‌లో అయితే నాలుగు రోజుల పాటు.. ఫ్రీజర్‌లో అయితే ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయి.
- అయితే ఈ పాలు ఫ్రీజర్‌లో 12 నెలల పాటు భద్రంగా ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతుంటారు. అయితే అది ఎంతవరకు సురక్షితమన్నది చెప్పలేం. కాబట్టి పిండిన పాలను సాధ్యమైనంత త్వరగా (రోజుల వ్యవధిలోనే) పిల్లలకు పట్టించడం మంచిది.
- కొన్ని రోజులు పాటు నిల్వ ఉంచిన పాలను అసలు ఎప్పుడు పిండామో మనకు గుర్తుండకపోవచ్చు. అలాంటప్పుడు నిల్వ చేసే ముందే ఆ బాటిల్/ప్యాకెట్‌పై ఫలానా తేదీ అని రాసిన ఓ లేబుల్‌ని అంటిస్తే సరిపోతుంది.
- సాధారణ రిఫ్రిజిరేటర్‌లో అయినా, ఫ్రీజర్‌లో అయినా తలుపు వద్దే/తలుపుకి ఉండే ర్యాక్స్‌లో ఈ పాలను నిల్వ చేయకూడదు. ఎందుకంటే మనం తలుపు తీయడం, వేయడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావచ్చు. వాటి ప్రభావం పాలపై పడచ్చు. కాబట్టి ఫ్రీజర్ మధ్యలో కాస్త వెనక వైపుగా వీటిని నిల్వ చేస్తే అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తద్వారా పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
- ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఊరెళ్లాలనుకున్నప్పుడు కూడా పిండిన పాలను జాగ్రత్తగా భద్రపరిచి తీసుకెళ్లచ్చు. అదెలాగంటే.. పాలు పోసిన బాటిల్స్/ప్యాకెట్స్‌ని ఇన్సులేటెడ్ కూలర్ బ్యాగ్‌లో ఐస్‌ప్యాక్స్ మధ్యలో పెట్టి మీతో పాటు క్యారీ చేయచ్చు. ఇలాంటి పాలు సుమారు 24 గంటల పాటు తాజాగా ఉంటాయి.
మోతాదుకు మించి వద్దు!
- మీ చిన్నారి ప్రతిసారీ ఎన్ని పాలు తాగుతుందో మీకు ఒక అవగాహన ఉండి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నిర్ణీత వ్యవధుల్లో పట్టాల్సిన పాలను వేర్వేరు బ్యాగ్స్/బాటిల్స్‌లో నిల్వ చేయడం వల్ల ఒక్కోసారి ఒక్కో బాటిల్‌ని తీసి నేరుగా ఉపయోగించచ్చు. ఇలా చేయడం వల్ల పాలు కూడా వృథా కావు.
- అలాగే పాలు పిండేటప్పుడు బాటిల్ నిండుగా కాకుండా దానిపై సూచించిన ఆఖరి గీత (పై వైపున) వరకు మాత్రమే పిండాలి. ఎందుకంటే ఈ పాలు చల్లబడినప్పుడు కొద్దిగా వ్యాకోచం చెందే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి బాటిల్‌లో కాస్త ఖాళీ వదిలితే పాలు లీక్ కాకుండా జాగ్రత్తపడచ్చు.