మీ పిల్లలతో చిట్టిచిట్టి పనులు చేయించండిలా! - parenting
ఇప్పుడప్పుడే బడులు తెరిచేలా లేరు. ఇంకొన్నాళ్లు పిల్లలు ఇంటిపట్టునే ఉండక తప్పని పరిస్థితి. పెద్ద పిల్లలకు నయానో భయానో నచ్చజెప్పొచ్చు. చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కాస్త తీరిక చేసుకోక తప్పదు. వారి ఆసక్తులు, అవసరాలు గమనిస్తూ వ్యవహరించాల్సిందే.
మీ పిల్లలతో చిట్టిచిట్టి పనులు చేయించండిలా!
బడికి వెళ్లడానికి మొదట్లో జంకే పిల్లలు.. తర్వాత స్నేహితులతో ఆడుకోవచ్చని బడిబాట పడతారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. చుట్టుపక్కల పిల్లలతోనూ పూర్తిగా కలిసి ఆడుకునే రోజులూ కావు. ఈ సమయంలో పిల్లలకు స్నేహితులు తల్లిదండ్రులే! ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫర్వాలేదు. కానీ, ఏకైక సంతానం ఉంటే మాత్రం.. వీలైనంత ఎక్కువ సమయం వారికి కేటాయించండి.
- ఉదయం, సాయంత్రం ఇంట్లోనో, డాబాపైనో నడక, చిన్న చిన్న వ్యాయామాలు చేయించండి. మధ్యాహ్నాలు సృజనాత్మకత పెంచే పనులు అప్పగించండి. బొమ్మలు వేయడం, రంగులు నింపడం, చదరంగం, క్యారమ్స్ వంటి ఆటలు ఆడించండి.
- చిన్న చిన్న టాస్కులు ఇవ్వండి. ఇల్లు సర్దడం మొదలు, కూరగాయలు తరగడం వరకు ప్రతి పనిలోనూ పిల్లలను భాగస్వాములను చేయండి. పని అలసటను మర్చిపోయేలా.. సాయంత్రం ఇష్టమైన చిరుతిళ్లు వారికి చెప్పకుండా చేసి ముందుంచి ఆశ్చర్యపర్చండి.
- ఇంటిపట్టునే ఉన్నా.. రోజూ కొంత సమయం చదువుకునేలా చూడాలి. మీరేదో పనిలో ఉండి. చదువుకో అని చెప్పకుండా.. రోజూ ఓ గంటపాటు దగ్గరుండి చదివించండి.
- ఎంత వారించినా.. టీవీ, సెల్‌ఫోన్ చూడాలని పిల్లలకు ఉంటుంది. వాటిని బలవంతంగా దూరం చేయకూడదు. పిల్లలకు ఇష్టమైన కార్యక్రమాలు చూడనిస్తే సంతోషిస్తారు. వాళ్లు అడగకముందే టీవీ ఆన్ చేసి.. కాసేపయ్యాక ‘చూసింది చాలు టీవీ ఆఫ్ చెయ్’ అంటే మాట వినకుండా ఉండరు. సెల్‌ఫోన్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తే సరి.