తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Insulin : ఇన్సులిన్‌.. మోతాదు మించితే ముప్పే!

ఇన్సులిన్ మోతాదు(Insulin dosage) మించితే ముప్పేనని అంటున్నారు టాటా అన్​స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్​ఆర్(Tata Institute of Fundamental Research)) పరిశోధకులు. దీనివల్ల కణజాలం దెబ్బతినే అవకాశముందని, క్యాన్సర్ వంటి రుగ్మతలకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Insulin
Insulin

By

Published : Oct 23, 2021, 12:19 PM IST

అశాస్త్రీయంగా తీసుకునే ఇన్సులిన్‌ డోసుల(Insulin dosage)తో మనిషి శరీరంలోని కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌(Tata Institute of Fundamental Research)) పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదని తెలిపారు. ‘హెచ్చుతగ్గులతో ఇన్సులిన్‌ డోసులను ఇచ్చినప్పుడు మనిషి శరీరంలోని కణాలు ఏ విధంగా స్పందిస్తాయనే’ విషయంపై హైదరాబాద్‌లోని టీఐఎఫ్‌ఆర్‌ బయోలజికల్‌ డిపార్టుమెంట్‌ ఆచార్యుడు ఉల్లాస్‌ కొల్తూరు నేతృత్వంలో, పరిశోధక విద్యార్థిని నమ్రతా శుక్లా, ఐఐటీ-బాంబే ఆచార్యుడు రంజిత్‌ పాడిన్‌హతిరీ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు. వీరి పరిశోధన ఫలితాలు అమెరికాలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తాజాగా ప్రచురించింది.

అధిక ఉత్పత్తితో నష్టమే

ఇన్సులిన్‌ హార్మోన్‌ మనిషి శరీరంలో లేదా రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతులు ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువగా.. తీసుకోనప్పుడు తక్కువగా ఇన్సులిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది క్రమబద్ధంగా ఉత్పత్తి కానిపక్షంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి మధుమేహానికి దారి తీస్తుంది. ‘ఈ హార్మోన్‌ కేవలం రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించడమే కాదు, కణాలు పనిచేసేందుకు అవసరమైన సంకేతాల (ఆదేశాలు) జారీలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. అంటే కణ జీవక్రియలకూ కారణమవుతోంది. ఉదాహరణకు కణం దెబ్బతింటే తిరిగి మరమ్మతు చేసుకునేందుకు వీలుగా గ్లూకోజ్‌ను పంపిణీ చేస్తుంది. ఈ సమయంలో అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఉత్పత్తి కావడమో లేదా బయటి నుంచి ఇవ్వడమో జరిగితే కణాలకు ఇచ్చే ఆదేశాలు నిలిచిపోయి కణజాలం దెబ్బతింటోంది’’ అని టీఐఎఫ్‌ఆర్‌ పరిశోధకులు తేల్చారు. ‘‘ప్రస్తుతం మధుమేహులకు రోజుకోసారి లేదా తినే ముందు ఇన్సులిన్‌ ఇస్తున్నారు. తమ పరిశోధన కారణంగా భవిష్యత్తులో ఈ డోసుల విషయంలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’’ అని పరిశోధక విద్యార్థిని నమత్ర వివరించారు.

ABOUT THE AUTHOR

...view details