వైష్ణవిని చూసిన వాళ్లు ‘సరైన ఆహారం తీసుకోవట్లేదేమో.. అందుకే ఇంత సన్నగా ఉంది..’ అంటుంటారు. కానీ తాను మాత్రం ఎంత తిన్నా, బరువు పెరగాలని శతవిధాలా ప్రయత్నించినా కొంచెం కూడా పెరగలేకపోతోంది.
వైశాలిది కూడా ఇదే సమస్య. అయితే తాను బరువు పెరిగేందుకు న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ప్రత్యేకమైన డైట్ కూడా పాటిస్తోంది.. అయినా ఫలితం మాత్రం శూన్యం.
బరువు పెరగడానికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవే మీరు బరువు పెరగడానికి అడ్డుపడవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా సమస్యలు? బరువు పెరగకుండా అవి మనల్ని ఎలా ఆపుతున్నాయంటే..!
సాధారణంగా కొంతమందిలో జీవక్రియల పనితీరు మరింత చురుగ్గా ఉంటుంది.. తద్వారా వారిలో క్యాలరీలు వెంటవెంటనే కరిగిపోతూ అదే బరువును కొనసాగిస్తుంటారు. అంతేకాదు.. కొంతమంది బరువుపై వారి కుటుంబ చరిత్ర, జన్యువులు.. వంటివి కూడా ప్రభావం చూపుతాయి. అంటే వారి తల్లిదండ్రులు, అంతకుముందు తరం వారు తక్కువ బరువుతో ఉంటే వీళ్లూ అలాగే ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ రెండూ కారణం కాదంటే మన ఒంట్లో ఉండే పలు అనారోగ్యాలు కూడా మనం బరువు పెరగకుండా అడ్డుపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
థైరాయిడ్ మరీ చురుగ్గా ఉంటే..!
థైరాయిడ్ హార్మోన్ మన శరీరంపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిది - ఆ హార్మోన్ తక్కువగా ఉత్పత్తై జీవక్రియలు నెమ్మదించడం వల్ల బరువు పెరుగుతాం. అదే ఆ థైరాయిడ్ గ్రంథి మరీ యాక్టివ్‌గా ఉండి ఎక్కువ మొత్తంలో హార్మోన్లను విడుదల చేస్తే జీవక్రియలు వేగవంతమై క్యాలరీలు త్వరత్వరగా కరిగిపోతాయి. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే ‘హైపర్ థైరాయిడిజం’ అంటారు. ఇదిలాగే కొనసాగితే మరింత సన్నబడే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనికి వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూనే వారు సూచించిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
టైప్-1 డయాబెటిస్
మధుమేహం కూడా ఎక్కువగా బరువు తగ్గేలా చేసి బరువు పెరగకుండా అడ్డుకుంటుందట! అదెలాగంటే టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయట. ఇలా అధిక గ్లూకోజ్ మూత్రవిసర్జన ద్వారా బయటికి వెళ్లిపోవడం వల్ల ఎక్కువగా బరువు తగ్గడానికి దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
ఈ వ్యాధి ఉన్నా..!
పేగుల్లో వచ్చే వాపు, అల్సర్లు.. వంటివి కూడా బరువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ‘ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు.
ఇవి కూడా!
* ఎక్కువ బరువు పెరిగిపోతామేమోనన్న భయంతో తక్కువ ఆహారం తీసుకోవడం (అనొరెక్సియా నెర్వోసా), బులీమియా.. వంటి సమస్యలు బరువు పెరగకుండా చేస్తాయట!