PROTEIN FOOD : ఏం తింటున్నారో కాస్త చూసుకోండి!
సమయానికి తినడం ఎంత ముఖ్యమో.. దాంట్లో పోషకాలు ఉండటం అంతే ముఖ్యం. అప్పుడే.. తిన్న తిండికి ఉపయోగం ఉంటుంది. లేదంటే ఎక్కడలేని ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తాయి. ఆకలేస్తే ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటాం. కానీ ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామో పట్టించుకోం. నిజానికి అవే చాలా ముఖ్యం.. ఎందుకంటే..?
వేళకు తినడం ఎంత ముఖ్యమో అది పోషకాహారం అయ్యుండటమూ అంతే ముఖ్యం. అప్పుడే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. లేదంటే బోల్డన్ని సమస్యలు. కండరాలను దృఢంగా ఉంచడం దగ్గర్నుంచీ మెటబాలిజంను సక్రమంగా పని చేసేలా చూడ్డం వరకూ ప్రొటీన్లదే కీలకపాత్ర. శరీరానికి పోషకాలు గనుక అందకుంటే శక్తిహీనంగా తయారవడమే కాదు రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు ఆటంకమూ కలుగుతుంది. యాంటీ బాడీస్ వృద్ధికావు. ఇన్‌ఫెక్షన్లు, అనారోగ్యాలూ దాడిచేస్తాయి. శరీర తత్వాన్ని, జీవనశైలిని బట్టి పోషకాలు అవసరమవుతాయి. వ్యాయామం చేసే వారికి ఎక్కువమొత్తంలో ప్రొటీన్లు కావాలి.
తగ్గితే ఏమవుతుంది?
- ప్రొటీన్లు తక్కువైతే కండరాల్లో దృఢత్వం తగ్గుతుంది. చిన్న బరువును కూడా మోయలేం.
- హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. మూడ్స్ మారిపోతుంటాయి. పిల్లలు అల్లరి చేయడం లాంటి అతి చిన్న విషయాలక్కూడా విసుక్కుంటాం. చిరాకుపడతాం.
- శరీరమంతా ఎముకల పోగని తెలుసుగా. క్యాల్షియం, డి విటమిన్లు కనుక తక్కువైతే ఎముకలు గుల్లగా అవుతాయి. అప్పుడిక కూర్చోలేం, పడుకోలేం, ఏదీ చేయలేం. అదెంత కష్టమో ఆలోచిస్తే పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేయం.
- చర్మం పల్చబడటం, ఎర్రబారడం లాంటి ఇబ్బందులొస్తాయి. జుట్టు రాలిపోతుంది. గోళ్ల పటుత్వం తగ్గుతుంది. ఇవెంత సమస్యాత్మకమో కదా! తగినంత వ్యాయామం చేస్తూ ప్రొటీన్ ఫుడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సమంగా ఉంటుంది. కురుల నుంచి గోళ్ల వరకూ అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.
- వ్యాయామం చేస్తూ, మంచి ఆహారం తింటున్నప్పటికీ కొలెస్ట్రాల్ లేదా ఊబకాయం తగ్గడం లేదంటే.. అది సంపూర్ణ పోషకాహారం కాదు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నాయని అర్థం. పాలు, గుడ్లు, చేపలు, చాక్లెట్లు, సోయా మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఫలితం ఉంటుంది.