తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పరిగెత్తేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? - Precautions to be taken while running

శరీర బరువును తగ్గించుకొని ఫిట్‌గా మారేందుకు మనం ఎంచుకునేది వ్యాయామం. నడక వంటి సులభమైన వ్యాయామం దగ్గర్నుంచి శరీరాన్ని కష్టపెట్టే కఠినమైన కసరత్తుల దాకా.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వర్కవుట్‌ను ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో కొంతమంది పరుగు పెడుతూ ఫిట్‌గా మారాలనుకుంటారు. పరిగెత్తే క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనుకున్న లక్ష్యానికి దూరం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పొరపాట్లేంటో తెలుసుకొని సరిదిద్దుకోమంటున్నారు.

running precautions, running, exercise
రన్నింగ్ చిట్కాలు, రన్నింగ్ జాగ్రత్తలు, వ్యాయామం

By

Published : Apr 20, 2021, 9:21 AM IST

మీకు తెలుసా? రోజుకో అరగంట చొప్పున పరిగెడితే.. సుమారు 396 క్యాలరీల దాకా కరిగించుకోవచ్చట! అంటే సులభంగా, తక్కువ సమయంలో బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి వ్యాయామం అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గుండె ఆరోగ్యానికి, ఆకలిని అదుపు చేస్తూ అధిక బరువును తగ్గించడానికి, కండరాలు-ఎముకల దృఢత్వానికి.. ఇలా పరుగు వల్ల ఆరోగ్యపరంగా చాలానే ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.


అంత ఆతృత వద్దు!

మనం కొత్తగా ఏదైనా పని మొదలుపెడితే మొదట్లో ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో పరుగును మన వర్కవుట్‌ రొటీన్‌లో భాగం చేసుకున్న తొలి రోజుల్లోనూ ఇలాగే ఉంటుంది. అందుకే త్వరగా ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు కొత్తలో చాలా వేగంగా పరుగు పెడుతుంటారు. నిజానికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేగంగా పరిగెత్తడం అనేది అప్పటిదాకా మన శరీరానికి అలవాటు లేదు. అలాంటిది ఒక్కసారిగా వేగంగా రన్నింగ్‌ చేస్తే గాయాలయ్యే ప్రమాదం ఉంది.. దీని ద్వారా శ్వాసక్రియ రేటు బాగా పెరుగుతుంది. అది ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి పరుగు పెట్టాలనుకుంటే ముందు నెమ్మదిగా నడక మొదలుపెట్టాలి. ఆపై క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి. అలాగని ఇప్పటికే ప్రాక్టీస్‌ ఉన్న వారు మరీ వేగంగా పరిగెత్తకుండా.. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అంతేకాదు.. వారంలో కనీసం ఒక రోజు వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉండాలట! తద్వారా ఈ విశ్రాంతి రోజున శరీరం తనను తాను రిపేర్‌ చేసుకుంటుందని, మరుసటి రోజు మరింత ఉత్సాహంగా వర్కవుట్‌ మొదలుపెట్టడానికి తయారవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు.


పరగడుపున పరిగెత్తుతున్నారా?

‘ఏదైనా తిన్నా, తాగినా ఆ తర్వాత ఏ పనీ చేయడానికి శరీరం సహకరించదు.. ఇక రన్నింగ్‌ అయితే అసలే చేయలేం..’ అనేది చాలామంది అభిప్రాయం. అందుకే ఏమీ తినకుండానే రన్నింగ్‌ చేస్తుంటారు. కానీ ఇది ముమ్మాటికీ పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పరగడుపున పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వుల్ని కరిగించడానికి తగిన ఇంధనం మనం మన శరీరానికి అందించనట్లే లెక్క. దాంతో కొవ్వులు కరగకపోగా.. మనం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే పండ్లు (అరటి, యాపిల్‌, మామిడి), నట్స్‌, పాలు-పాల పదార్థాలు, పప్పులు, బ్రెడ్‌, కాయధాన్యాలు.. వంటివి గంట ముందే తీసుకొని ఆపై రన్నింగ్‌ చేయమంటున్నారు నిపుణులు. అలాగే పరిగెత్తడం పూర్తయ్యాక కూడా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లుండే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇక పరిగెత్తడానికి గంట ముందు, తర్వాత నీళ్లు తాగడమూ ముఖ్యమేనని గుర్తుపెట్టుకోండి.


చేతులు కాదు.. భుజాలు కదిలించాలి!

కొంతమంది పరిగెత్తేటప్పుడు చేతుల్ని కదిలించకుండా స్థిరంగా ఉంచుతుంటారు.. మరికొంతమందేమో కేవలం మోచేతుల్ని మాత్రమే ముందుకు వెనక్కి అంటూ పరుగు తీస్తుంటారు. నిజానికి ఈ రెండూ సరికాదంటున్నారు నిపుణులు. పరిగెత్తే క్రమంలో భుజాలకు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలట! అంతేకాదు.. వాటిని మరీ పైకి లేపి కాకుండా.. పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు, వెనక్కి అంటూ పరిగెత్తుతుంటే త్వరగా అలసిపోకుండా, గాయాల పాలు కాకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇలా దీనివల్ల పరుగు వేగం కూడా అదుపులో ఉంటుందట! ఇక దీంతో పాటు పరిగెత్తే క్రమంలో పెద్ద పెద్ద అడుగులు వేయకుండా చూసుకోవడం వల్ల కూడా మన శరీరంలోని శక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగచ్చు.. అలాగే శరీరం అదుపు తప్పి ప్రమాదాలు జరగకుండా కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు.


పొట్టివి-వదులైనవి వద్దే వద్దు!

అసలే ఎండాకాలం, ఉక్కపోత భరించలేక వదులైన దుస్తులు లేదంటే పొట్టి దుస్తులు ధరించడం చాలామందికి అలవాటు! రన్నింగ్‌ చేసే క్రమంలోనూ కొంతమంది ఇలాంటి డ్రస్సింగ్‌నే ఫాలో అవుతుంటారు. నిజానికి ఏ కాలంలో రన్నింగ్‌ చేసినా వదులైన దుస్తులు, పొట్టిగా ఉండేవి అస్సలు వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే వదులైన దుస్తుల కారణంగా పరిగెత్తే క్రమంలో గాయాలు కావచ్చు.. కాబట్టి శరీరానికి అతికినట్లుగా ఉండే కాటన్‌ దుస్తులు లేదా మెత్తటి క్లాత్‌తో తయారుచేసిన జిమ్‌ వేర్‌ను ఎంచుకుంటే ఎప్పుడైనా కంఫర్టబుల్గా ఉండచ్చు.. ఇక వీటితో పాటు ఫిట్‌గా, అడుగుభాగంలో మెత్తగా ఉండే సోల్‌/స్ప్రింగ్స్‌ ఉండే రన్నింగ్‌ షూస్‌ని ఎంచుకుంటే పరిగెత్తడం మరింత సులభమవుతుంది. తద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండానే అనుకున్న ఫలితాల్ని సొంతం చేసుకోవచ్చు.

సో.. పరిగెత్తే క్రమంలో మనం సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు, వాటిని సరిదిద్దుకునే మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే అనారోగ్యాలతో బాధపడే వారు, గుండె సంబంధిత సమస్యలున్న వారు, గర్భిణులు, ఇతర సమస్యలున్న వారు మాత్రం పరుగుకు దూరంగా ఉండడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. ఒకవేళ అంతగా కావాలనుకుంటే ఈ విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details