కొవిడ్ లక్షణాల్లో వాసన కోల్పోవడం కూడా ఒకటని ఇప్పటికే నిపుణులు గుర్తించారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తిరిగి వాసన గుర్తించడం కష్టమవుతోందని పలువురు బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టెరాయిడ్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ)తో పాటు అంతర్జాతీయ నిపుణులు బృందం ఓ అధ్యయనం చేపట్టింది. తద్వారా కార్టికో స్టెరాయిడ్లు వాడడం వల్ల కేవలం స్వల్ప ప్రయోజనం మాత్రమే ఉంటుందని నిపుణుల బృందం గుర్తించింది. వాసన తిరిగి పొందేందుకు ఇలాంటి మందులను వినియోగించకూడదని యూఈఏకు చెందిన ప్రొఫెసర్ కార్ల్ ఫిల్‌పాట్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ.. వీటి చికిత్సకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.
ఐదుగురిలో ఒకరికి లక్షణం
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ బారినపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వాసన కోల్పోయే లక్షణం ఉంటున్నట్లు అంచనా. అయితే, దాదాపు 90 శాతం మంది పూర్తిగా వాసన సమస్య నుంచి బయటపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. కానీ, కొందరిలో కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఎనిమిది వారాలైనా తిరిగి వాసనను పసిగట్టే లక్షణం పొందలేకపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.