వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లు, జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు.
- టీవీ ముందో కంప్యూటర్ ముందో రోజంతా కూర్చుంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే. దీనివల్ల క్యాన్సర్లు, బీపీ, ఊబకాయం, డిప్రెషన్, ఆందోళన... వంటి దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయి.
- కూర్చుని టీవీ లేదా ఫోన్ చూస్తూ ప్రాసెస్‌డ్ స్నాక్స్‌లాంటివి తినే అలవాటు ఉంటే తక్షణం మానుకోవాలి. వాటిల్లోని సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దాంతో వయసు త్వరగా మీదపడుతుంది.
- హాయిగా నవ్వడం మర్చిపోతే మరీ ప్రమాదం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కాసేపయినా నవ్వుతూ గడపాలి. ఇష్టమైన షో లేదా సినిమా చూడటం, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపడం వల్ల ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నవ్వడం వల్ల మనసునీ శరీరాన్నీ ఉల్లాసంగా ఉంచే సెరటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి.
- ఇంటికే పరిమితమవడం అస్సలు మంచిది కాదు. కొవిడ్ కారణంగా ఈమధ్య అంతా ఇళ్లలో బందీలయిపోయారు. ఇదే అలవాటుగా మారిపోతే మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యమధ్యలో కొత్త ప్రదేశాలకు వెళుతుండాలి. కనీసం వారాంతాల్లో చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది.
- నిద్రలేమి ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ఒక్క రాత్రి నిద్ర లేకున్నా అది కణాల వయసుమీద ప్రభావాన్ని కనబరుస్తుంది. కాబట్టి నిద్రపోవడం మర్చిపోతే, కొన్నాళ్లకు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అన్నది గుర్తుంచుకోండి అంటున్నారు నిపుణులు.