తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Turmeric Uses: కాస్త పసుపు తిందాం... ఆరోగ్యంగా ఉందాం.. - Telangana news

Turmeric Uses: కొవిడ్‌-19... రకరకాలుగా పరిణమిస్తూ ఒమిక్రాన్‌ వరకూ వచ్చింది.ఇంకా ఎన్ని రకాలుగా మార్పు చెందుతుందో తెలియదు. ఈ ఒక్కటే కాదు... భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వైరస్‌లు పుట్టుకురావచ్చు. వాటన్నింటినీ తట్టుకుని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన కొన్ని రకాల ఔషధాల్ని ఆహారంలో భాగంగా చేసుకోకతప్పదు. అలాంటివాటిల్లో ఒకటి పసుపు... ప్రపంచమంతా మంత్రంలా జపిస్తోన్న ఆ ఔషధ వేరులో ఎన్నో రకాలూ రంగులూ కూడా ఉన్నాయి!

Turmeric
Turmeric

By

Published : Jan 30, 2022, 7:14 PM IST

Turmeric Uses: జలుబు చేసినా జ్వరంగా ఉన్నా దగ్గుతున్నా కాస్త పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగమని చెబుతుంటారు బామ్మలు. అప్పుడనే కాదు, రోజూ పడుకునేముందు పసుపుపాలు తాగితే మంచి నిద్ర పడుతుంది అనీ అంటారు. కొందరయితే వర్షాలు మొదలు కాగానే పసుపులో కాస్త బెల్లం కలిపి చిన్న మాత్రల్లా చేసి ఇంటిల్లిపాదికీ పరగడుపునే మింగిస్తారు. ఇక, పులిహోరలూ మజ్జిగపులుసుల్లోనే కాదు, కూరల్లో చారుల్లో సైతం పసుపు పడాల్సిందే. తాజా పసుపు కొమ్ములతో పచ్చడీ పడుతుంటారు కొందరు. మొత్తమ్మీద పసుపు వాడని ఇల్లు దేశం మొత్తం వెతికినా కనిపించదు. అయితే అందరికన్నా కశ్మీరీలు పసుపుని ఎక్కువగా వాడతారట.

పసుపు తప్పనిసరి...

వంటలతోపాటు, సంప్రదాయ పెళ్లి వేడుకల్లోనూ పసుపు వాడకం తప్పనిసరి. మంగళ స్నానాలనే కాదు, ఒకప్పుడు మహిళలు రోజువారీ స్నానం చేసేటప్పుడూ కాస్తంత పసుపుని ముఖానికీ పాదాలకీ రుద్దుకునేవారు. పసుపు కొట్టడంతోనే పెళ్లిపనులు మొదలవుతాయి. పసుపు కలిపితేనే బియ్యం తలంబ్రాలవుతాయి, అక్షతలుగా మారతాయి. పెళ్లిలోని తాళీ పసుపుతాడే. పసిడి సూత్రాలు లేకున్నా పసుపు కొమ్ము ఉంటే చాలు, పెళ్లయిపోతుంది. అందుకే పసుపు అన్నమాటే శుభప్రదం అంటారు పెద్దలు.

అనేక వ్యాధుల్ని అడ్డుకునే శక్తి...

అంతేనా... సాధారణ జలుబు నుంచి క్యాన్సర్‌ వరకూ అనేక వ్యాధుల్ని అడ్డుకోగలిగే శక్తి పసుపుకి ఉందని ఆధునిక పరిశోధకులూ గుర్తించారు. దాంతో అందరూ ఆ మంత్రాన్నే జపిస్తూ కుకీలూ కేకులూ చాక్లెట్లూ పెరుగూ ఐస్‌క్రీమూ... ఇలా అన్నింటిని పసుపులో ముంచి తీస్తున్నారు. సప్లిమెంట్ల రూపంలోనూ చప్పరించేస్తున్నారు. కాస్త ఘాటుగా వగరుగా ఉండే పసుపు కొమ్ముల్నీ అల్లం మాదిరిగానే వంటల్లో వాడేస్తున్నారు. గోల్డెన్‌ మిల్క్‌ అంటూ ఏకంగా పసుపు పాలనీ అమ్మేస్తున్నాయి కొన్ని కంపెనీలు. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రాకతో రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు మరోసారి పసుపుతో టీలు చేసుకునీ తాగేస్తున్నారు.

ఏముంది అందులో..!
యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీఫంగల్‌... ఇలా ఎన్నో గుణాలు పసుపుకొమ్ములో ఉన్నాయి. అందుకే దీన్ని చర్మసంరక్షణతోపాటు సౌందర్యపోషణ కోసమూ వాడుతుంటారు. ఇక, ఇందులోని కర్‌క్యుమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. దీనికి ఆర్ద్రయిటిస్‌, అల్సరేటివ్‌ కోలిస్‌, ఆల్జీమర్స్‌, డిప్రెషన్‌, మధుమేహం... ఇలా ఎన్నో వ్యాధుల్ని నిరోధించే గుణం ఉంది. ముఖ్యంగా గుండె కండరం, రక్తనాళాల లోపలిపొర పనితీరుని మెరుగుపరచడం ద్వారా వయసుతోపాటు వచ్చే హృద్రోగాలను ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. మెనోపాజ్‌ దాటిన మహిళల్ని రెండు వర్గాలుగా విభజించి, ఒక వర్గానికి ఎనిమిది వారాలపాటు కర్‌క్యుమిన్‌ సప్లిమెంట్‌ను ఇచ్చి, మరో విభాగంతో ఏరోబిక్‌ వ్యాయామం చేయించగా- ఇద్దరిలోనూ గుండెకండరం లోపలి పొర పనితీరు మెరుగైందట. అంటే, వ్యాయామంతో సమానమైన ఫలితాన్ని కర్‌క్యుమిన్‌ ఇచ్చిందన్నమాట.

నొప్పులు మాయం...

రుమటాయిడ్‌ ఆర్ద్రయిటిస్‌తో బాధ పడుతోన్నవాళ్లకి రెండునెలలపాటు 500మి.గ్రా. కర్‌క్యుమిన్‌ను ఇవ్వగా మంటా నొప్పీ తగ్గిందట. అలాగే సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల్నీ ఇది నివారిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా వచ్చే కొలొరెక్టల్‌, రొమ్ము, ప్రొస్టేట్‌, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ల నివారణలోనూ కర్‌క్యుమిన్‌ను వాడినప్పుడు మంచి ఫలితం కనిపించిందట. ముఖ్యంగా రోజుకి మూడుసార్లు పసుపు కషాయం తాగితే కీళ్లు- కాళ్ల నొప్పులు తగ్గుతాయనీ తేలింది.


సాధారణంగా మనదగ్గర పండే అన్ని రకాల పసుపుల్లోనూ కర్‌క్యుమిన్‌ మూడు శాతం మాత్రమే ఉంటుంది. అందులోని పావు వంతుని మాత్రమే శరీరం పీల్చుకోగలదు. అందుకే పసుపులోని కర్‌క్యుమిన్‌ను ప్రత్యేకంగా సేకరించి దాన్ని ట్యాబ్లెట్ల రూపంలోనూ పొడిరూపంలోనూ అమ్ము తున్నారు. అంతేకాదు, కర్‌క్యుమిన్‌ ఎక్కువగా ఉండే పసుపు రకాలనూ పసుపుని పోలిన ఇతర జాతుల్నీ పండించేందుకు నేటి రైతులూ ఆసక్తి కనబరుస్తున్నారు.

రంగుల పసుపు!
అల్లం మాదిరిగా పసుపు కూడా నేలలోపల పెరిగే వేరు భాగం అని తెలిసిందే. ఈ పంట అతి పురాతనమైనది. క్రీ.పూ.2600 సంవత్సరాలకు ముందు నుంచే పసుపుని మనదగ్గర పండిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, యునాని... ఇలా అన్ని సంప్రదాయ వైద్య విధానాల్లోనూ దీన్ని వాడిన దాఖలాలు ఉన్నాయి. మనదగ్గర నుంచే బౌద్ధుల ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు అటు నుంచి పాశ్చాత్య దేశాలకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురొమా, కృష్ణా, రొమా, రంగా, సుదర్శన... ఇలా చాలానే రకాలు ఉన్నాయి. నేల తీరూ వాతావరణమూ పండించే విధానాన్నీ బట్టి పసుపులోని కర్‌క్యుమిన్‌ శాతమూ తద్వారా దాని రంగూ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పసుపులో కర్‌క్యుమిన్‌ 3 నుంచి 5 శాతం మాత్రమే ఉంటుంది. కానీ మేఘాలయలోని జెయింతియా హిల్స్‌ ప్రాంతంలో పండించే లకడోంగ్‌ పసుపు రకంలో మాత్రం 7.9 నుంచి 12 శాతం ఉంటుందట. అందుకే ప్రపంచంలోనే ఇది మేలైన పసుపుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దాంతో ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి ఆ రకం పసుపు ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు సహకారాన్ని అందిస్తోంది.


అరుదుగా లేతాకుపచ్చ రంగులో ఉండే పసుపునీ అక్కడి రైతులు పండిస్తున్నారట. పసుపులో రకాలు ఉన్నట్లే దాన్ని పోలిన ఇతర జాతులూ ఉన్నాయి. వేర్వేరు రంగుల్లో పండే వీటిని కూడా అనేక వ్యాధుల నివారణలోనూ ఆహారంలో భాగంగానూ వాడుతుంటారు.

నల్లని పసుపు:కర్‌క్యుమా కేసియా దీని శాస్త్రీయనామం. ఇది ఈశాన్య భారతంలోనూ మధ్యప్రదేశ్‌లోనూ పెరుగుతుంది. లేతగా ఉన్నప్పుడు నీలం రంగులోనూ ముదిరాక నలుపురంగులోకీ మారుతుంది. దీన్నీ శుభప్రదంగానే భావిస్తారు. ఔషధగుణాలు ఇందులో అనేకం ఉన్నప్పటికీ అరుదుగా పండించడంతో సాదా పసుపుకన్నా దీని ఖరీదు ఎక్కువ. రోజువారీ ఆహారంలో భాగంగా చిటికెడు నలుపు లేదా నీలం రంగు పసుపుని తీసుకుంటే రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుందట. తియ్యని వాసనతో ఉండే ఈ రకం పసుపు ముద్దని గాయాలకీ పాముకాటుకీ తేలు కాటుకీ విరుగుడుగానూ వాడుతుంటారు. జీర్ణ సమస్యల్నీ టాన్సిల్స్‌ వాపునీ మంటనీ ఇది సమర్థంగా తగ్గిస్తుందనీ, క్యాన్సర్‌ కణాల్ని నిరోధించే గుణం దీనికి ఎక్కువనీ అంటారు.

తెల్లని పసుపు:కర్‌క్యుమా జెడోరియా దీని శాస్త్రీయ నామం. కర్‌క్యుమా అమండా అనే మరోరకం కూడా తెల్లగానూ మామిడికాయ వాసనతోనూ అల్లంరుచితో ఉంటుంది. దీన్నే మనం మామిడి అల్లం అంటాం. కానీ దీనికి పసుపుతోనే చుట్టరికం ఎక్కువ. ఈ రెండిటినీ కూరల్లోనూ పచ్చడి పట్టేందుకూ వాడతారు. కూర పొడుల్లోనూ సీఫుడ్‌ వంటకాల్లోనూ కూడా వీటి వాడకం ఎక్కువే. పసుపు మాదిరిగానే ఇవీ ఆరోగ్యానికి మంచివే. అజీర్తితోపాటు జలుబు, ఆస్తమా... వంటి శ్వాస సంబంధిత లోపాలకు మందులా పనిచేస్తాయివి. ఇవి వ్యాధికారక ఫ్రీ రాడికల్స్‌ పెరగకుండానూ చూస్తాయి.

కస్తూరి పసుపు:లేత పసుపు రంగులో ఉండే ఈ రకం మంచి వాసనతో ఉంటుంది. అందుకే దీనికా పేరు. శాస్త్రీయనామం కర్‌క్యుమ్‌ అరొమేటికా. మిగిలిన రకాలతో పోలిస్తే ఇందులో యాంటీసెప్టిక్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉండటంతో చర్మవ్యాధుల నివారణకీ సౌందర్యపోషణకీ దీని వాడుక ఎక్కువ. మొటిమల్నీ మచ్చల్నీ జిడ్డునీ ట్యాన్‌నీ సైతం చక్కగా తొలగిస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతల్నీ పోగొడుతుంది. దాంతో కాస్మెటిక్స్‌ తయారీలోనూ దీన్ని వాడుతుంటారు.

చూశారుగా... పసుపుని తగు మోతాదులో వాడుకుంటే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొవిడ్‌ కాలంలో అల్లం మాదిరిగానే కాస్త పచ్చిపసుపు ముక్కని తిన్నా కషాయంగా సేవించినా మంచిదే మరి!

ABOUT THE AUTHOR

...view details