తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నుదుటి మీద ముడతలా..? ఈ చిట్కాలు పాటించండి! - natural ways to minimize forehead wrinkles

చర్మం ముడతలు పడటమనేది వృద్ధాప్య ఛాయల్లో ఒకటి. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి లక్షణాలు కనిపించినా పెద్దగా పట్టించుకోం. కానీ కొంతమందికి చిన్న వయసులో ఉండగానే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది వయసు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలన్నా, రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలన్నా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

Wrinkles on the forehead   Follow these tips
నుదుటి మీద ముడతలా..? ఈ చిట్కాలు పాటించండి!

By

Published : Mar 12, 2021, 12:17 PM IST

Updated : Mar 12, 2021, 12:40 PM IST

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి మృదుత్వాన్ని కోల్పోతుంది. ఈ ప్రభావంతో నుదుటిపై సన్నని గీతలు మొదలవడంతో పాటు కళ్ల చుట్టూ ఉండే చర్మం ముడుచుకుపోతుంటుంది. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, ముడతలు కనిపిస్తుంటాయి. వాటిని ప్రి-మెచ్యూర్‌ రింకిల్స్ అంటారు.
* బాగా తెల్లగా ఉన్న వారిలో, చర్మం పల్చగా ఉన్న వారిలో ఇవి చిన్న వయసులోనే మొదలవుతాయంటున్నారు సౌందర్య నిపుణులు.
* ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్యలు ఎదురవుతాయట!
* ఇక చాలామంది చీటికీ మాటికీ నుదురు చిట్లిస్తుండడం, అదే పనిగా కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం వంటివి చేస్తుంటారు.. అలాంటివారిలోనూ ఇవి పిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.
* అలాగే పొడి చర్మం గల వారు, సౌందర్య పద్ధతుల్లో భాగంగా బ్లీచింగ్‌ ఎక్కువగా వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుందట!


కాస్మెటిక్‌ ట్రీట్‌మెంట్లు ఉన్నా!
సాధారణంగా చర్మంపై ఏర్పడిన ముడతలు తొలగిపోవు. అయితే వచ్చిన ముడతలను మరింత పెరగకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం రెటినాయిక్ యాసిడ్‌ ఉన్న క్రీంలతో పాటు కెమికల్‌ పీల్‌, మైక్రో డెర్మాబ్రేషన్‌ లాంటి సౌందర్య చికిత్సలున్నాయి. చాలామంది లేజర్‌ చికిత్సతో పాటు బొటాక్స్‌ ఇంజెక్షన్‌లను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కాస్మెటిక్‌ ట్రీట్‌మెంట్లతో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురవ్వచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తకుండా నుదుటిపై ఏర్పడిన ముడతలను పెరగకుండా చేయచ్చంటున్నారు. అవేంటంటే..!
నీళ్లు బాగా తాగాలి!
శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే చర్మం పొడిబారే ప్రమాదముంది. ఫలితంగా నుదుటి మీద పెద్ద పెద్ద గీతలు, ముడతలు ఏర్పడతాయి. దీంతో పిన్న వయసులోనే వయసు మళ్లిన వారిలా కనిపిస్తారు. ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగాలి. ఈ క్రమంలో రోజూ 6-8 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలి. అలాగే వర్కవుట్లు చేసేవారు త్వరగా డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు మరింత ఎక్కువగా నీళ్లు తాగాలి. నీటితో పాటు నిమ్మరసం, కొన్ని రకాల పండ్ల రసాలను తీసుకోవచ్చు.


ఎండ తగలకుండా!
చర్మంపై ఎండ ఎక్కువగా పడితే కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా నుదుటి మీది చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. దీంతో ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగని ఎండగా ఉందని ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండలేం కదా! అందుకే ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్ అప్లై చేసుకోవాలి. ఇక కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయి. అంతేకాదు నుదుటి మీది ముడతలు కనిపించకుండా చేస్తాయి.
ఒత్తిడికి దూరంగా!
విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి. అయితే ఇప్పుడున్న యాంత్రిక, పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేని జీవితం ఊహించడం కొంచెం కష్టమే. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవచ్చు. అందుకోసం యోగా, మెడిటేషన్‌, వర్కవుట్లను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.


బ్యాలన్స్‌డ్‌ డైట్‌తో...!
మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా చర్మానికి అవసరమయ్యే పోషకాలు అందకపోయినా కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ప్రత్యేకించి విటమిన్‌-సి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పొడి చర్మం సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్‌ టీ, పాలకూర, వాల్‌నట్స్‌, చిలగడ దుంప, బ్లూ బెర్రీ... మొదలైనవన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా నుదుటి మీద ముడతలు ఏర్పడకుండా, ఒకవేళ వచ్చినా సమస్య పెరగకుండా జాగ్రత్తపడచ్చు.


ఇవి గుర్తుంచుకోండి!
* పొగాకులోని రసాయనాల కారణంగా కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం స్థితిస్థాపకతను కోల్పోయి ముడతలు ఏర్పడతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారి తీస్తుంది. అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.
* కొన్ని ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు, వర్కవుట్లతో ముడతలు పెరగకుండా జాగ్రత్త పడచ్చు. పలువురు సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవుతున్నారు. రోజులో కనీసం 20 నిమిషాల పాటు.. వారంలో 6 గంటలు ఈ ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందుకోసం కావాలంటే సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
మరి, మీరు కూడా ఈ సహజ చిట్కాలను పాటించండి. నుదుటిపై ముడతలు రాకుండా జాగ్రత్త పడండి. నిత్యం యవ్వనంగా కనిపించండి..!

ఇదీ చదవండి:'ఈడెన్​ కంటే మెల్​బోర్న్​, గబ్బా విజయాలే ప్రత్యేకం'

Last Updated : Mar 12, 2021, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details