తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 11:52 AM IST

ETV Bharat / lifestyle

300 రూపాయలతో బయటకొచ్చి...30 కోట్ల టర్నోవర్‌ చేశా!

టీనేజీ పిల్లలకు పంతాలు, పట్టింపులు సహజమే.. ఓ రోజు చినూకి, వాళ్ల నాన్నకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటి నుంచి బయటికి వచ్చేసింది.  తండ్రి మీద కోపంతోనే కాదు..  తానేంటో నిరూపించుకోవాలనే కసితో.. చేతిలో మూడొందలు, రెండు జతల బట్టలతో.. జీవితాన్ని ఎలాగైనా గెలవగలననే గుండె ధైర్యంతో.. కట్‌చేస్తే.. తనిప్పుడో ఫ్యాషన్‌ జ్యువెలరీ బ్రాండ్‌ అధిపతి. కోట్ల టర్నోవర్‌కు చేరిన వ్యాపార సామ్రాజ్యం. పూట ఎలా గడుస్తుందో అనే స్థాయి నుంచి 35 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. తన ప్రయాణంలో ప్రతి అడుగూ పాఠమే  అంటోంది చినూకాలా. ఆ స్ఫూర్తి ప్రయాణం  మనమూ తెలుసుకుందాం!

chinu kaala, entrepreneur chinu kaala
చినూకాలా, ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ అధిపతి, రూబెన్స్ అధిపతి

ఏ విషయంలో అయినా పంతం మాత్రమే ఉంటే సరిపోదు... అనుకున్నది సాధించాలనే పట్టుదలా ఉండాలి అప్పుడే మనకంటూ ఓ దారిని ఏర్పరుచుకోగలం. అమ్మానాన్నలకు నేను మూడో సంతానం. మధ్యతరగతి కుటుంబం మాది. ఇంట్లో చినూ అంటే అల్లరి పిల్ల. పైగా తలపొగరు అనే ట్యాగ్‌లైన్‌. అయినా సరే నా తీరు నాదే. నాకు పదిహేనేళ్లున్నప్పుడు ఏదో విషయం మీద నాన్నతో వాగ్వివాదం జరిగింది. అది కాస్తా పెద్దదై నాలో పంతాన్ని పెంచింది. నాకాళ్ల మీద నేను నిలబడతా అంటూ ఇంటి నుంచి బయటకి వచ్చేశా. చేతిలో ఉన్నది రూ.300 చూస్తుండగానే అయిపోయాయి. అయినా ఇంటికి వెళ్లాలనిపించలేదు. జీవితంలో కష్టమంటే ఏంటో అప్పుడే అర్థమైంది. బతుకుపాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టా.

కష్టాలెన్నెదురైనా నన్ను నేను నిరూపించుకోవాలనే కసి ముందుకు నడిపించింది. ఒక్క వడాపావ్‌ తిని రోజంతా గడిపేసేదాన్ని. రెండేళ్ల పాటు సేల్స్‌గర్ల్‌గా పనిచేశా. సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, టెలికాలర్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌, వెయి‌ట్రస్, రిసెప్షనిస్ట్‌.. ఇలా పూట గడవడానికి ఎన్నో ఉద్యోగాలు చేశా. ఇవన్నీ నాకు వినియోగదారుల అభిరుచిని గుర్తించే నైపుణ్యాన్ని అలవరిచాయి. మనసు వ్యాపారం మీదకు మళ్లింది. ఫొంటే కార్పొరేషన్‌ సొల్యూషన్స్‌ అనే కార్పొరేట్‌ మర్చండైజింగ్‌ సంస్థ భాగస్వామ్యంతో వ్యాపారంలో తొలి అడుగు వేశా. ఐదేళ్లలోనే ఐటీసీ, సెట్‌మ్యాక్స్‌, ఈఎస్‌పీఎన్‌ వంటి ప్రముఖ సంస్థలకు సేవలందించే స్థాయికి చేరా. ఆ తర్వాత సొంతంగా ఓ సంస్థ స్థాపించాలనుకున్నా.

రూబెన్స్‌ అలా పుట్టుకొచ్చింది..

ఎప్పుడూ విజయాలే ఉండవు కదా! అప్పుడప్పుడూ అపజయాలూ పలకరిస్తాయి. అలాంటి అనుభవమే నాకూ ఎదురయ్యింది. అయితే అది నన్నో కొత్తదారిలో నడిపించింది. అమిత్‌తో నాది ప్రేమ వివాహం. మాకో పాప. ఆయన ప్రోత్సాహంతో మిసెస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. టైటిల్‌ అందుకోవాలని చాలా శ్రమించా. ఫలితం దక్కలేదు. కానీ ఫ్యాషన్‌పై అవగాహన పెరిగింది. ముఖ్యంగా ఆభరణాల రంగం ఆకట్టుకుంది. ఆ సమయంలో వివిధ బ్రాండ్ల వ్యవస్థాపకులతో కలిసి పనిచేశా. వారి స్ఫూర్తితో నేనూ ఈ విభాగంలో ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేయాలనుకున్నా. 2016లో రూ.3 లక్షలు పెట్టుబడితోరూబెన్స్‌ యాక్సెసరీస్‌ పేరుతో ఫ్యాషన్‌ జ్యూయలరీ సంస్థ ప్రారంభించా. క్రమంగా మా వ్యాపారాన్ని హైదరాబాద్‌, కొచ్చి, బెంగళూరుకూ విస్తరించా. హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా అంటే తెలుగు మహిళలు ఎలాంటి నగలను ఇష్టపడతారో తెలుసుకునేందుకు ఓల్డ్‌ మార్కెట్‌, చార్మినార్‌, బేగంబజార్‌ గల్లీల్లో తిరిగి ట్రెండ్‌ తెలుసుకున్నా.

75 శాతం మంది మహిళలే..

అందం, అలంకరణ, ఆభరణాల్లో వైవిధ్యం గురించి మహిళలకే ఎక్కువగా తెలుసని నమ్ముతా. అందుకే నా సంస్థలో 75 శాతం మంది మహిళలే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌, దిల్లీ, భోపాల్‌ నిఫ్ట్‌ విద్యార్థినులెందరో మాతో కలిసి పనిచేస్తున్నారు. అలాగే చదువులేని, ఒంటరి మహిళలకు ఊతం అందించేందుకు వారిని ప్యాకింగ్‌, డిపార్చర్‌ వంటి విభాగాల్లో చేర్చుకున్నా. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న మహిళలకు క్యాటలాగింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ప్రాసెస్‌, ఆన్‌లైన్‌ పనులు అప్పచెబుతా. ఈ కళపై ఆసక్తి ఉన్న 30మంది యువతులకు శిక్షణనందించి ఉపాధి కల్పించా.

బెస్ట్‌ మాది!

2019లో మింత్రా బెస్ట్‌ జ్యూయలరీ బ్రాండ్‌ అవార్డు దక్కింది. సీఈఓ ఇన్‌సైట్స్‌ మ్యాగజైన్‌లో టాప్‌టెన్‌ ఫ్యాషన్‌ స్టార్టప్‌లలో రూబెన్‌ ఒకటిగా నిలిచింది. దీనికి కారణం నాణ్యతలో, బ్రాండ్‌ ఇమేజ్‌ విషయంలోనూ రాజీపడకపోవడమే.

ఆటంకాలకు బెదరొద్దు

జ్యూయలరీ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. వాటిలో నిధులే పెద్ద సమస్య. వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు అడుగడుగునా... అవరోధాలే ఎదురవుతాయి. అలాంటి వాటన్నింటినీ తట్టుకుని నిలబడగలగాలి.

ప్రతి దానికీ ఓ సమయం

వ్యాపారవేత్త, గృహిణి, భార్య, తల్లిగా నా పనులకు ఒక్కోదానికీ ఒక్కో సమయం కేటాయించుకుంటాను. ఆ ప్రణాళిక ప్రకారమే నా దినచర్య ఉంటుంది. ఇంటి సభ్యులతో ఉన్నప్పుడు ఆఫీసు పనులన్నీ పక్కన పెట్టేస్తాను.

కుటుంబమే ముఖ్యం

అన్నింటికన్నా కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతనందిస్తా. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి మా పాపతో గడుపుతాను. తనకు కథలు చెబుతాను. ఒత్తిడి తగ్గించుకునేందుకు కుటుంబాన్ని మించిన మందు లేదు.

ABOUT THE AUTHOR

...view details