తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అందమైన అతివలకు దసరా కోసం.. దుర్గమ్మ ఫ్యాషన్‌! - durgamma fashion for girls

దసరా వచ్చేసింది.. నవరాత్రి పూజలతో తొమ్మిది రోజులూ దేశవ్యాప్తంగా కోలాహలంగా ఉంటుంది. శక్తి స్వరూపిణికి పూజలూ రకరకాల నైవేద్యాలూ పిండివంటలూ కొత్త దుస్తులతో ఒకటే సందడి. ఈసారి మరో ప్రత్యేకత ఏంటంటే.. అమ్మవారు మందిరంలోనే కాదు, భక్తుల దుస్తులూ యాక్సెసరీల మీద కూడా కొలువై కొత్త ఫ్యాషన్‌గా మన ముందుకొచ్చేసింది.

durgamma fashion
దుర్గమ్మ ఫ్యాషన్‌!

By

Published : Oct 18, 2020, 11:11 AM IST

శక్తి లేనిదే సృష్టి లేదు. ఆ ఆదిపరాశక్తిని పూజించే పండుగే దసరా. మిగిలిన పండుగలకు కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రాధాన్యత ఇస్తే, కొన్ని ప్రాంతాల్లో కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ శరన్నవరాత్రులను మాత్రం దేశం మొత్తం ఘనంగా జరుపుకుంటుంది. పండుగకు ముందే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు చెయ్యడంతో పాటు దసరా రోజు వేసుకునేందుకు కొత్త బట్టలూ కొనుక్కుంటారు. ఒకప్పుడైతే పండుగ అనగానే సంప్రదాయ వేడుక కాబట్టి అమ్మలకు పట్టు చీర లేదంటే సంప్రదాయంగా కనిపించే ఫ్యాన్సీ చీరలూ, అమ్మాయిలకు పరికిణీ ఓణీలూ మగవాళ్లూ పిల్లలకు పంచెలూ పైజమా సల్వార్‌లూ కొనేసేవారు. కానీ ఇవి సెల్ఫీలూ వాట్సాప్‌ స్టేటస్‌లూ ఫేస్‌బుక్‌లూ రాజ్యం ఏలుతున్న రోజులు.

పుట్టిన రోజూ పెళ్లి వేడుకల్లాంటి వాటినే కాదు, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లూ ఇంట్లో జరిగే కుంకుమ పూజని కూడా ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియాలో పంచుకోవడం ఓ తంతైపోయింది. కాబట్టే, దుస్తుల విషయంలోనూ సంప్రదాయమైనా సరికొత్తగా ఉండాలన్న సూత్రాన్ని ఈతరం వ్రతంలా ఆచరిస్తోంది. వారి వ్రతానికి భంగం కలగకుండా డిజైనర్లూ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లను సృష్టించేస్తున్నారు. అలా దసరా వేడుకల కోసం దిగివచ్చిందే దుర్గమ్మ ఫ్యాషన్‌.

అమ్మకు అమ్మే సాటి!

అమ్మవారి పూజకోసం ప్రత్యేకంగా అంటే- అమ్మవారిని మించిన సంప్రదాయమైన, అందమైన డిజైన్‌ ఇంకేముంటుందీ..? అలా చూడచక్కని జగదంబ రూపం బ్లౌజుల మీద ఎంబ్రాయిడరీగానూ, చీరలూ డ్రెస్సులూ కుర్తాల మీద హ్యాండ్‌ పెయింట్‌గానూ టీ షర్టుల మీద ప్రింట్‌ గానూ మారిపోయింది. దుస్తులకు మ్యాచింగ్‌గా వేసుకునేందుకు పెండెంట్లూ పోగుల్ని కూడా అమ్మవారి ప్రతిమలా తయారుచేస్తున్నారు. చేతిలో పట్టుకునే క్లచ్‌లూ ఫోన్‌ కవర్ల మీదా ఆ శక్తి స్వరూపమే చేరి ఆశీస్సులందిస్తోంది. పూజకనే కాదు, పెద్ద పెద్ద కళ్లతో చూపు తిప్పుకోనివ్వని దుర్గమ్మ రూపం ఫ్యాషన్‌ డిజైన్‌గానూ యువతను ఆకట్టుకుంటోంది. అందుకే, అటు భక్తి, ఇటు ఫ్యాషన్‌ రెండింటినీ కలిపి అందంగా తొడిగేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details