ఆసక్తి, అభిరుచి, ప్రణాళిక ఉంటే... ఎంత కష్టమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చు. దానికి తగ్గట్లుగానే ఇప్పటి వరకూ నా ప్రయాణం సాగింది. చిన్నప్పటి నుంచీ ఆహార ప్రియురాల్ని. ప్రయాణాలన్నా ఎంతో ఆసక్తి. టీఎల్‌సీ, డిస్కవరీ, ఫుడ్ ఛానెల్స్‌ని విపరీతంగా చూసేదాన్ని. అందుకేనేమో ఎదిగే కొద్దీ విదేశాల్లో చదువుకోవాలనే కోరికా బలపడింది. అది పెళ్లితో నెరవేరింది. మాది ఏపీలోని రాజమహేంద్రవరం. సంప్రదాయ మధ్యతరగతి కుటుంబం. కట్టుబాట్లు కాస్త ఎక్కువే. బీటెక్ అయ్యాక పెళ్లి చేశారు. మా వారు చైతన్యది తుని. ఆయన డిస్నీలో పైథాన్ డెవలపర్. పెళ్లయ్యాక లండన్ వచ్చేశాం. ఇక్కడే ఎమ్మెస్ చేసి, ఉద్యోగంలో చేరా. కొన్నాళ్లకి జీవితం రొటీన్‌గా మారిపోతున్నట్టు అనిపించింది. కాస్త విశ్రాంతినీ, ఉపశమనాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాం. మా ఇద్దరి ఇష్టాయిష్టాలూ ప్రయాణాలు, ఆహారమే. ఇంకేముంది ప్రపంచమంతా చుట్టేయాలనుకున్నాం. వారాంతాలు, సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి రావడం మొదలు పెట్టాం. అప్పటికి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినా వీడియోలు తీయాలనుకోలేదు. కానీ ఇండియాలో ఉన్న బంధువులు, స్నేహితులతో పంచుకున్నట్లు ఉంటుంది, మరికొంత మందిని గైడ్ చేసినట్లూ ఉంటుందని ‘సంయాన కథలు’ పేరుతో వీడియోలు చేయడం ప్రారంభించాం. తర్వాత పుట్టిన మా బాబుకీ ఆ పేరే పెట్టుకున్నాం!
తెలియని ప్రాంతాల్ని చూపించాలని...
పర్యటన అంటే... ఏదో లెక్కకు చూశాం అన్నట్లు కాకుండా కొన్నాళ్లు అక్కడే ఉండి చరిత్ర, సంస్కృతి, ఆహారం వంటి విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకోవాలనుకున్నాం. అందరికీ తెలిసినవి కాకుండా... కొత్తవి, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను, విశేషాలనూ చూపించాలనుకున్నాం మన దేశం నుంచి వచ్చే విద్యార్థులు, పర్యటకులకు పనికొచ్చే ఎన్నో విషయాలనూ చెబుతున్నాం. ఇవన్నీ తెలుగులోనే చెబుతాం. ఎందుకంటే ఇప్పటికీ మన చుట్టుపక్కల కనీసం పక్క జిల్లా కూడా చూడని ఎందరో ఉంటారు. అలాంటి వారందరినీ మా వీడియోలు సంతోష పెట్టాలి. పిల్లలకు దూరంగా ఉండే అమ్మానాన్నలకు కాస్త ఆటవిడుపులా అనిపించాలి... ఈ లక్ష్యాలతో సామాన్య భాషలో చెబుతున్నాం. అందుకే చాలా మంది తమ పిల్లల్ని మాలో చూసుకుంటున్నారు. ఇది మేం చెప్పడం కాదు... చాలా మంది అలా మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లండన్‌లో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారని వెళ్లాం. అక్కడ మమ్మల్ని ఎంతో మంది గుర్తు పట్టి పలకరించారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఇవన్నీ చాలా సంతోషంగా అనిపిస్తాయి. 2016లో ఛానెల్‌ని ప్రారంభించాం. కానీ అప్పుడు పెద్దగా అప్‌లోడ్ చేయలేదు. ఇప్పటి వరకూ ఇంగ్లండ్‌లోని ఇంటీరియర్ ప్రాంతాలతో పాటు టర్కీ, నార్వే, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, యూరప్ వంటి దేశాలు తిరిగాం. యూట్యూబ్ ద్వారా వచ్చేది వీడియో ఎక్విప్‌మెంటూ, పర్యటనల కోసమే ఖర్చు పెడతాం.