మీరంత ఎట్లున్నరు. మీ అందరి అభిమానంతో గిప్పుడైతే చాలా సంతోషంగా ఉన్న. ఎక్కడ ఉండే గంగవ్వను ఎక్కడిదాక పోయిన. తలుసుకుంటె గుండె చెరువైతది. మనుసు బరువైతది. కష్టాలల్లనే పుట్టిన.. కష్టాలల్లనే పెరిగిన. చిన్నప్పుడే పెళ్లైంది మొదలు బతుకు పోరాటంలో పడరాని పాట్లు పడ్డ. కట్టుకున్నోడు దుబాయికి పోయిండు. ఏళ్లతరబడి తిరిగి రాలె. ముగ్గురు పిల్లల ఆకలి తీర్చేందుకు నేనే కూలినాలీ చేసిన. పెంచి పెద్దచేసిన. ఇగ పదేళ్ల తరువాత ఇంటి కొచ్చిన ఆయన ఏ పని చేయకుండా తాగుడు బానిసై చనిపోయిండు. రెక్కలు ముక్కలు చేసుకుని గింతదాక బతుకును తీసుకొచ్చిన. రోజుకు ఎన్నిగంటలు కష్టపడ్డనో నాకు.. ఆ భగవంతునికే తెలుసు.!
పిలగాళ్లే మార్చిన్రు..!
తెలంగాణ యాసలో మాట్లాడటం.. నాలెక్క నేనుండటం.. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం... నా నైజం. అందుకే నన్ను గమనించిన మా ఊరి పిల్లలు తీసే ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ వీడియోల్లో నాకు అవకాశమిచ్చిండ్రు. మొదట్లో మాటలు లేకుండా కొన్ని పాత్రలిచ్చిండ్రు. మరుగు దొడ్డి మల్లన్న అనే వీడియోలో శ్రీకాంత్ అవకాశమిచ్చిండు. తరువాత ఇగ చిన్న చిన్నగా మాటలు మొదలు పెట్టి సినిమాల్లో నటించేదాక వెళ్లిన. 76 వీడియోలతో మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం సినిమాలతోపాటు ఐదు సినిమాలు చేసిన. నాగచైతన్య సినిమాలో నటిస్తున్న. సమంత, విజయదేవరకొండ.. వంటి పెద్ద నటుల ఇంటర్వ్యూలు చేసిన. ఐదు వారాలు బిగ్‌బాస్‌లో ఉన్న. మట్టి వాసన చూస్తూ ఊళ్లల్లో తిరిగిన నాకు గంత పెద్ద ఇంట్లో( బిగ్‌బాస్) ఉండటం కష్టమైంది. ఊళ్లో గీ చిన్న ఇంట్లనే ఉంటున్న. ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉన్న నాకు నాగార్జున సార్ ఇల్లు కట్టిస్తనని అన్నడు. సూడాలె. నటిగా ఇది నాకు రెండో జన్మలెక్క. ఏడికి పోయినా గంగవ్వ అనే గుర్తింపు వచ్చింది. ఇదంతా మా ఊరి పిలగాళ్లు శ్రీకాంత్, అంజి, చందు, రాజు, అనిల్ వల్లనే! పాత గంగవ్వ జీవితాన్ని మార్చి కొత్త జన్మనిచ్చింది వాళ్లే. వాళ్లు లేకుంటే నేనింకా అందరిలాగానే ఉండేదాన్ని.