కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ప్రత్యేకించి ఆ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని పెద్ద పడకానా ప్రాంతంలో నివాసముండే 105 ఏళ్ల మోహనమ్మ గత నెలలో స్వల్ప జ్వరంతో బాధపడింది. అనుమానమొచ్చి ఆమె కుటుంబ సభ్యులు తనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. జులై 19న ఆ వృద్ధురాలికి కరోనా సోకిందని తేలడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కొవిడ్ ఆస్పత్రికి తరలించారు.
14 రోజుల్లో కరోనాను జయించి!
మోహనమ్మ భర్త మాధవ స్వామి 1991లోనే కన్నుమూశారు. ఆమెకు మొత్తం ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే స్వల్ప కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మోహనమ్మ శ్వాస తీసుకోవడంలోనూ కొంత ఇబ్బంది పడింది. దీంతో వైద్యులు ఆమెకు ఆక్సిజన్ అందించారు. ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో కేవలం 14 రోజుల్లోనే కొవిడ్ మహమ్మారిని జయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందీ ఓల్డ్ వుమన్. ఈ సందర్భంగా తన ఆహారపు అలవాట్లు, యోగా, ధ్యానం వల్లే తాను కరోనా నుంచి సురక్షితంగా కోలుకున్నానంటోంది మోహనమ్మ.
ఆ అలవాట్లే నాకు వరమయ్యాయి!
‘నేను 1915లో జన్మించాను. ప్లేగు వ్యాధి ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూసినదాన్ని. చిన్నప్పటి నుంచి కొర్రలు, జొన్న సంగటి, రాగి ముద్ద తింటూ పెరిగాను. అయితే రాన్రానూ కాలం మారడంతో ప్రస్తుతం ఒకపూట వరి అన్నం తింటున్నాను. అదేవిధంగా నాకు మొదటి నుంచి ధ్యానం, ప్రాణాయామం చేయడం అలవాటు. కొవిడ్ ఆస్పత్రిలో చేరాక కూడా బెడ్‌పై నుంచే యోగా, ధ్యానం, ప్రాణాయామం చేశాను. దీంతో అక్కడి వైద్యులు, నర్సులు నన్ను చూసి ‘భలే ధైర్యంగా ఉన్నావే’ అని ప్రశంసించారు. అయితే ఇప్పటివరకు నా జీవిత కాలంలో కరోనా లాంటి వైరస్‌ను నేను చూడలేదు. బహుశా! నా ఆహారపు అలవాట్లు, యోగా, ప్రాణాయామమే కరోనా నుంచి నన్ను కాపాడాయనుకుంటున్నా!’ అని తన రికవరీ వెనక ఉన్న రహస్యాన్ని చెప్పుకొచ్చిందీ గ్రాండ్ ఓల్డ్ వుమన్.
ఆమె క్రమశిక్షణే మాకు ఆదర్శం!
కరోనా నుంచి సురక్షితంగా కోలుకొని తాజాగా తిరిగి ఇంటికి చేరుకుంది మోహనమ్మ. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తెగ సంతోషపడుతున్నారు. ‘రోజూ ఇంట్లో తనకు ఓపిక ఉన్నంత వరకు అమ్మ కనీసం అరగంటసేపైనా నడుస్తుంది. ఇక మొదటి నుంచి ఆహారం విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తోంది. ఆమె క్రమశిక్షణ మా అందరికీ ఆదర్శం. వైరస్ బాధితులు భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని ఆమె నిరూపించింది..’ అంటూ ఈ సందర్భంగా ఆమె కుమారుడు జయదాస్ చెప్పుకొచ్చారు.
మోహనమ్మే కాదు.. గతంలోనూ పలువురు శతాధిక వృద్ధులు కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, కొద్దిపాటి జాగ్రత్తలు, మనోధైర్యం.. వంటివి ఆయుధాలుగా మలచుకొని ప్రమాదకర వైరస్‌పై విజయం సాధించారు. తమ లాంటి కరోనా బాధితులకు బతుకుపై భరోసా కల్పించి ఆదర్శంగా నిలిచారు.