నరక చతుర్దశికి, నరకాసురుడికి సంబంధం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉన్నా, మరొక ధార్మిక విషయం నరక చతుర్దశితో ముడివడి ఉందనేది యథార్థం. మానవులు మరణానంతరం నరకానికి, ఆ తరవాత స్వర్గానికి వెళ్తారని ప్రగాఢ విశ్వాసం. నరకలోకం అంధకారమయంగా ఉండటం వల్ల అక్కడికి వెళ్లినవారు చీకటిలోనే మగ్గుతుంటారని, దారి చూపడంకోసం భూలోకంలోని వారసులు దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. పితృదేవతలకు నరకంలో చీకట్లు తొలగాలంటే, వారి కోసం భూమిపై దీపాలు వెలగాలన్న భావనతో దీపావళినాడు దీపాలను వెలిగిస్తారు. అంతేకాదు- దీపదానాలూ చేస్తారు. యముడి ప్రీతికోసం తర్పణాలు విడుస్తారు. ఇవన్నీ పితృదేవతలకు నరకలోక బాధలు లేకుండా చేయడానికే అనేది ఈ పండుగలోని పరమార్థం. ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు ఎవరు దీపాలు వెలిగిస్తారో వారి పితరులు (మరణించిన తండ్రులు, తాతలు) నరక లోకాన్ని వీడి స్వర్గలోకం వైపు ప్రయాణిస్తారని ధర్మశాస్త్రం చెబుతోంది.
నరక చతుర్దశినాడు అభ్యంగనస్నానం విశేషమైన అంశం. తిలలు అంటే నువ్వులు. వాటి నుంచి తీసిన ద్రవమే తైలం. ఒంటికి తైలాన్ని మర్దన చేసుకొని తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడంవల్ల శరీరం ఆరోగ్యవంతం కావడమేగాక, మానసికంగానూ ప్రశాంతత లభిస్తుందని పెద్దలమాట. రాబోయేది హేమంత రుతువు. అంటే చలికాలం. చలికాలం రాగానే శరీరం అంతా పగులువారుతుంది. తైలమర్దనవల్ల శరీరం నిగనిగలాడుతూ తళుకులీనుతుంది.