తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చింతలు తీర్చే స్వామి... చెన్నకేశవుడు

సాధారణంగా ఏ ఆలయంలోని గర్భగుడిని చూసినా... ఒకే దేవతా విగ్రహం దర్శనమిస్తుంది. కానీ ఆ గుడిలో విష్ణుమూర్తి చెన్నకేశవుడిగా, వేంకటేశ్వరుడిగా రెండు రూపాలలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఆ ఆలయమే ఏలూరులోని చెన్నకేశవస్వామి దివ్యక్షేత్రం.

lord chennakesava swamy temple in eluru
చింతలు తీర్చే స్వామి... చెన్నకేశవుడు

By

Published : Feb 21, 2021, 10:59 AM IST

కేశవా... క్లేశ నాశనహః అనేది పురాణోక్తి. కేశవ నామస్మరణం, దర్శనం వల్ల సకల బాధలూ, కష్టాలూ తొలగిపోతాయని అంటారు. అలాంటి కేశవ రూపాల్లో చెన్నకేశవ స్వరూపం విశిష్టమైంది. సాక్షాత్తూ విష్ణురూపధారిగా చెన్నకేశవ స్వామి దర్శనమిచ్చే అత్యంత పురాతన ఆలయం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపుపేటలో ఉంది. ఇక్కడ చెన్నకేశవస్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు. కేశవః అంటే కేశములనే పేరుగల కిరణాలను ఆభరణాలుగా ధరించిన రూపం అని అర్థం. అదేవిధంగా కేశి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల కూడా విష్ణుమూర్తికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి అవతారమూర్తి అయిన చెన్నకేశవ స్వామి ఇక్కడ శ్రీదేవీ, భూదేవీ సహితంగా దర్శనమిస్తున్నాడు. ఆ స్వామితోపాటూ కలియుగ వరదుడైన వేంకటేశ్వరుడు కూడా పద్మావతీ, అలిమేలు మంగతో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

స్థలపురాణం

చింతలు తీర్చే స్వామి... చెన్నకేశవుడు

నూజివీడు జమీందార్లు ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పటి నూజివీడు జమీందారు మేకా ధర్మ అప్పారావుకు ఓ సారి స్వామి కలలో కనిపించి పెరటిబావిలో ఉన్న తన ఉనికిని తెలియజేశారట. దాంతో ఆ జమీందారు బావిలో వెతికితే స్వామి విగ్రహం కనిపించిందట. అలా ఆ విగ్రహాన్ని స్థాపించి ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించినట్లు స్థలపురాణం చెబుతోంది. తొమ్మిదో శతాబ్దంలో వేంగి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారనడానికి శాసనాలు కూడా ఉన్నాయని అంటారు. అపురూపమైన శిల్పకళ ఉట్టిపడే ఇక్కడి రాజగోపురాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. దానిపైన రామాయణ, భారత, భాగవత పురాణాలతోపాటూ క్షీరసాగరమథనం, రామ పట్టాభిషేకం, కృష్ణలీలలూ, దశావతారాలను అందంగా రూపుదిద్దారు. రాష్ట్రంలోనే ఎత్తయిన గోపురాల్లో ఇది కూడా ఒకటని పురావస్తుశాఖ నిర్థారించింది. అయిదు అంతస్థులతో దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోపురం పైకి వెళ్లేందుకు ఒకప్పుడు చెక్క నిచ్చెనలూ, మెట్లూ ఉండేవట. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంటును వినియోగించలేదనీ... సున్నం, బెల్లం, కరక్కాయ, జనపనార మిశ్రమాలతోనే గోపురంపైన ఉన్న శిల్పాలను తీర్చిదిద్దారనీ చెబుతారు. పేరుకు ఇది చెన్నకేశవస్వామి సన్నిధానమైనా... ఈ ప్రాంగణంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే విజయగణపతి, పనిద్దరాళ్వార్లతో కూడిన ఆండాల్‌దేవి ఆలయాలను ఈ ప్రాంగణంలో చూడొచ్చు.

విశేష పూజలు..

చింతలు తీర్చే స్వామి... చెన్నకేశవుడు

ద్వారకా తిరుమల దత్తత తీసుకున్న ఈ ఆలయంలో రోజువారీ జరిగే పూజలు కాకుండా... పండుగలతోపాటూ ఇతర పర్వదినాల్లో నిర్వహించే పూజాదికార్యక్రమాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ప్రధానంగా ఫాల్గుణ బహుళ ఏకాదశి శ్రవణా నక్షత్రం రోజున స్వామికి చేసే కల్యాణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆ సమయంలో పాంచాహ్నిక దీక్ష పేరుతో అయిదురోజులపాటు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో భోగిపండుగ రోజున గోదాకల్యాణం, కార్తిక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం, సహస్ర దీపాలంకరణ వంటివీ పెద్దఎత్తున చేయడం విశేషం.

ఎలా చేరుకోవచ్చు

విజయవాడ నుంచి ఏలూరు రోడ్డుమార్గంలో 65 కి.మీ దూరంలో ఉంటుందీ ఆలయం. ఏలూరుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రయాణ సౌకర్యాలున్నాయి. విజయవాడ- కోల్‌కతాకు వెళ్లే రైళ్లలో చాలావరకూ ఏలూరు మీదుగానే వెళ్తాయి. ఏలూరు నుంచి శనివారపుపేటలోని ఆలయానికి వెళ్లడానికి ఆటో సౌకర్యం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details