ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రాజూరలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాదవ్ రవీందర్(35) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
అప్పులు చేసి సాగు చేసిన పంట పాడైపోయిందని... - farmer died
జీవనాధారమైన పంట వడలిపోయిందన్న మనస్తాపంతో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక మరణమే శరణ్యమనుకుని... కుటుంబసభ్యులను అనాథలను చేసి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు.
పురుగుల మందు పిచికారీ చేసేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రవీందర్ పొలంలో నీళ్లు నిలిచి పంట వడలిపోయి దెబ్బతినటం చూసి తీవ్రంగా కలత చెందాడు. అప్పులు ఎలా చెల్లించాలో అని మనస్తాపానికి గురై... పురుగుల మందు తాగి పంట క్షేత్రంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు.
గమనించిన తోటి రైతులు ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.