వరకట్న వేధింపులకు వివాహిత బలైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన నాగరాజు తన కూతురు లక్ష్మిప్రసన్నను... రాజమండ్రికి చెందిన సాదనాల కార్తిక్కి ఇచ్చి 2019లో పెళ్లి చేశారు. వివాహ సమయంలో వరకట్నంగా ఐదు లక్షల రూపాయలు, 10 కాసుల బంగారం, భూమిని ఇచ్చారు.
అదనంగా డబ్బులిచ్చాం..
పెళ్లి అనంతరం కార్తిక్.. భార్యను తీసుకుని కూకట్పల్లిలోని నవోదయ కాలనీకి మకాం మార్చాడు. అప్పటి నుంచి లక్ష్మి ప్రసన్నను డబ్బుల కోసం వేధింపులకు గురిచేశాడని... అప్పుడు రూ.50వేలు అదనంగా ఇచ్చామని నాగరాజు తెలిపారు. ఉదయం కార్తిక్ ఫోన్ చేసి... లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడని వెల్లడించాడు.
''ఉరి వేసుకుని చనిపోయిందని ఓసారి, ఫినాయిల్ తాగిందని మరోసారి, చేతిని కోసుకుందని రకరకాలుగా కార్తిక్ చెప్పాడు. నా కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాము. వరకట్న వేధింపులతోనే నా కూతురు చనిపోయింది. నా ఒక్కగానొక్క కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఇప్పుడు మాకు అందనంత దూరం వెళ్లిపోయి నన్ను, నా భార్యను అనాథల్ని చేసింది.''