తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​ హత్య కేసులో భార్య హస్తం

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పవన్‌కుమార్‌ సజీవ దహనం కేసులో కీలక ఆధారాలు లభించాయి. పథకం ప్రకారమే హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య కృష్ణవేణి ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. పవన్‌కుమార్‌ తండ్రి గంగాధర్‌ ఫిర్యాదుతో కృష్ణవేణితో పాటు అయిదుగురు కుటుంబ సభ్యులు, కొండగట్టుకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

software engineer murder case
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో భార్య హస్తం

By

Published : Nov 25, 2020, 8:05 AM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌ శివారులో సోమవారం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాచర్ల పవన్‌కుమార్‌ను హత్యచేసిన ఘటనలో అతని భార్య కృష్ణవేణి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారమే సజీవ దహనం చేశారని తెలిపారు. ఘటన జరిగిన తర్వాత పవన్‌కుమార్‌ను తన మరదలు సుమలత సజీవదహనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణవేణి కూడా అతడి హత్యలో పాల్గొంది.

అప్పటి నుంచి గొడవలే..

కృష్ణవేణి ఏడాది కిందట ఆదిలాబాద్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లగా.. ఆమెకు చెందిన ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అప్పటి నుంచి భార్యతో పవన్‌కుమార్‌ తరచూ గొడవపడేవాడు. వాటిని తన బావమరిది జగన్‌ తస్కరించాడన్న అనుమానంతో అతన్ని దూషిస్తూ.. చంపుతానని బెదిరించేవాడు. జగన్‌ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. పవన్‌కుమార్‌ చేతబడి చేయించడం వల్లే జగన్‌ చనిపోయాడని బల్వంతాపూర్‌ శివారులో మంజునాథ ఆలయం, ఆశ్రమం నిర్వహిస్తున్న కృష్ణవేణి అన్న విజయ్‌స్వామి తన కుటుంబ సభ్యులకు నూరిపోశాడు. దీంతో అతన్ని అంతమొందించడానికి కృష్ణవేణి, విజయ్‌స్వామిలతో పాటు ఆమె మరదలు సుమలత, అక్క స్వరూప, అమ్మ ప్రమీల పథకం రూపొందించారు.

జగన్‌ ద్వాదశదిన కర్మ సందర్భంగా సోమవారం మంజునాథ ఆలయం పక్కన గల ఓ గదిలో జగన్‌ చిత్రపటానికి పవన్‌కుమార్‌ శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమయంలో తలుపులు మూసి, బయట నుంచి తాళం వేశారు. ఆ తర్వాత కృష్ణవేణితో పాటు సమీప బంధువులు, కొండగట్టుకు చెందిన నిరంజన్‌రెడ్డి అనే యువకుడు కలిసి గది కిటికీ, జాలీలలో నుంచి పెట్రోలు పోసి నిప్పంటించారని సీఐ వెల్లడించారు. పవన్‌కుమార్‌ తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కృష్ణవేణితో పాటు అయిదుగురు కుటుంబ సభ్యులు, కొండగట్టుకు చెందిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో భార్య హస్తం

ఇవీచూడండి:చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ హత్య

ABOUT THE AUTHOR

...view details