లాటరీ వచ్చిందని చెబితే నమ్మి ఆరు లక్షలు పొగొట్టుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వారాసిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం.శ్వేత... తన తల్లికి నాప్టల్ షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట కోల్‌కతా నుంచి స్పీడ్ పోస్టు వచ్చింది. అందులో "మీరు రూ.12లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారు. మీరు కోరితే కారు... లేదా 12 లక్షల నగదు పొందవచ్చు" అని ఉంది.
12 లక్షల కారు గెలుచుకున్నారని 6 లక్షలు నొక్కేశాడు!
కొత్తకొత్త మార్గాలతో అమాయకులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడి అందినకాడికి నొక్కేస్తున్నారు. "మీరు రూ.12లక్షల విలువ చేసే కారు గెలుచుకున్నారు. మీరు కోరితే కారు... లేదా 12 లక్షల నగదు పొందవచ్చు" అని ఉన్న స్పీడ్ పోస్టును నమ్మి... ఏకంగా ఆరు లక్షలు మోసపోయింది హైదరాబాద్ వారాసిగూడకు చెందిన ఓ మహిళ.
అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించిన బాధితురాలు డబ్బులే కావాలని కోరింది. బ్యాంక్ ఖాతా నంబరు ఇస్తే డబ్బులు డిపాజిట్ చేస్తామని మోసగాడు నమ్మించాడు. బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చిన శ్వేత నుంచి వివిధ ఖర్చుల పేరిట ఆరు లక్షలు తన ఖాతాలో వేయించుకొన్నాడు. ఆ తర్వాత స్పందించడం మానేశాడు. మోసపోయినట్లు తెలుసుకుని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన చికిత్స కోసం దాచుకున్న డబ్బు దోచుకున్నాడంటూ బాధితురాలు లబోదిబోమన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.