వనపర్తి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒంటరి మహిళలు, తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగలను వనపర్తి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు , కిలో వెండి ఆభరణాలు, రూ. 5.50 లక్షల రూపాయలతో పాటు.. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
దోపిడి ముఠా గుట్టు రట్టు.. విలువైన సొత్తు స్వాధీనం - వనపర్తి జిల్లా తాజా వార్తలు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాగుట్టు రట్టు చేశారు వనపర్తి పట్టణ పోలీసులు. నిందితుల నుంచి విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు.. రూ.5.50 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తాళం వేసి ఉన్న ఇళ్లు, ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడినట్టు జిల్లా డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
జిల్లాలోని కొత్తకోట, ఆత్మకూరు, మదనాపురం, ఖిల్లా గణపురం, గోపాల్పేట, బుద్ధారం గ్రామాలలో తాళం వేసి ఉన్న ఇళ్లు, ఒంటరి మహిళలపై దాడులకు పాల్పడుతూ దొంగతనాలు చేస్తున్న శంకర్, గణేష్, మహేందర్, విజయ్, హేరు నాయక్ అనే నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి సొమ్ము రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. వాహనాల తనిఖీ సమయంలో.. ఖిల్లా గణపురం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా.. గుట్టు రట్టయినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించారు.