తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోరీ... దోచుకున్నదేమిటో మిస్టరీనే! - ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దొంగతనం వార్తలు

ఏపీలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. పక్కా ప్రణాళికతో వచ్చిన దొంగలు ఆరుగురు ఆచార్యుల గదుల తాళాలను బద్దలు కొట్టారు. కానీ ఏమి దోచుకెళ్లారన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోరీ... దోచుకున్నదేమిటో మిస్టరీనే!
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోరీ... దోచుకున్నదేమిటో మిస్టరీనే!

By

Published : Oct 29, 2020, 5:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో మంగళవారం రాత్రి దొంగలు ఆరుగురు ఆచార్యుల గదుల తాళాలను బద్దలు కొట్టారు. ఆయా గదులున్న కారిడార్‌కు రెండువైపులా ఇనుప గ్రిల్స్‌, ఇనుప తలుపులు ఉన్నాయి. ఒకవైపునున్న తలుపుల తాళాలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. కొన్ని గదుల గడియలను కట్టర్‌తో కోయగా మరికొన్నింటి సెట్టు మొత్తాన్ని పెకిలించేశారు.

ఆ విభాగంలో విభాగ పాలన కార్యాలయం, తరగతి గదులు ఉన్నప్పటికీ వాటి జోలికి మాత్రం పోలేదు. ఆయా గదుల్లోని ఏ వస్తువులను దొంగిలించారన్నది మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి. కొందరు ఆచార్యులు టేబుళ్లలో డబ్బులు కూడా ఉంచారు. వాటిలోంచి ఒక్క రూపాయి కూడా దొంగిలించలేదు.

ఒక్కరే లక్ష్యమా?

ఆచార్యుల్లో ఒకరి గదిలోని వస్తువులు, పత్రాలే లక్ష్యంగా దొంగతనానికి పాల్పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ అనుమానం రాకుండా ఉండేందుకు వీలుగా అందరి ఆచార్యుల గదుల గడియల్ని పగలగొట్టారేమోనన్న ప్రచారం జరుగుతోంది. మహిళా ఆచార్యుల గదుల గడియలను కూడా బద్దలు కొట్టడం గమనార్హం.

ఆకతాయి విద్యార్థుల పనేనా?

విభాగంపై స్పష్టమైన అవగాహన ఉన్నవారే దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ గదులున్న కారిడార్‌లో నిఘా కెమెరాలు కూడా ఉన్నాయి. కానీ దొంగలు ఆ కారిడార్‌లోకి ప్రవేశించిన వెంటనే నిఘా కెమెరాలకు ఉన్న వైర్లను లాగేశారు. కొందరు ఆకతాయి విద్యార్థులే కావాలని దీనికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీ ఆదేశాలు

కంప్యూటర్‌సైన్స్‌ విభాగంలో దొంగతనం ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడటంతో వారు కూడా అక్కడ పరిస్థితులను పరిశీలించారు. నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పలువురు భద్రత సిబ్బంది ఉన్నా పక్కా ప్రణాళికతో దొంగలు గడియలను బద్దలు కొట్టారు. విశ్వవిద్యాలయంలోని పలు విభాగాల్లో రూ.లక్షల విలువైన కంప్యూటర్లు ఉన్నాయి. కొన్ని కంప్యూటర్లలో అత్యంత విలువైన సమాచారం కూడా ఉంటుంది. అవి చోరీకి గురికాకపోవటంతో ఆచార్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:రాజకీయ అరంగేట్రంపై సూపర్​ స్టార్​ కీలక వ్యాఖ్యలు!

ABOUT THE AUTHOR

...view details