సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో రెండేళ్ళ క్రితం జరిగిన హత్య మిస్టరీని కోదాడ పోలీసులు ఛేదించారు. మట్టంపల్లికి చెందిన అన్నెం మరియపాపులు అనే మహిళను 2018లో సొంత అక్క కూతురైన స్వప్న ఆస్తి పంపకాల విషయంలో జరిగిన ఘర్షణను మనసులో పెట్టుకొని గొంతు నులిమి హత్యచేసింది.
మృతురాలి తండ్రి 2017లో హైదరాబాద్‌లోని ఇల్లు అమ్మగా.. 73లక్షలు వచ్చాయి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆ డబ్బులు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. మృతురాలు మరియపాపులు పెద్ద భార్య కూతురు. మరియపాపులుకు అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల మరియపాపులు ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు.
అక్క ప్రమీల కూతురైన స్వప్న ఆస్తిలో వాటా కోసం మరియపాపులును పలుసార్లు అడిగింది. ఘర్షణలు కూడా జరిగాయి. వాటా ఇచ్చేందుకు మరియపాపులు, ఆమె తమ్ముడు ఒప్పుకోలేదు. ఆగ్రహించిన స్వప్న రాంభూపాల్ రెడ్డితోపాటు, మరో వ్యక్తితో కలిసి అక్టోబర్ 31న మరియపాపులును గొంతు నులిమి హత్య చేసింది. నవంబర్ 1న వేపల మాదారం గ్రామ శివారులో పెట్రోలు పోసి తగలబెట్టారు. మృతదేహాం సగం కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఖననం చేశారు.
అదే రోజు మరియపాపులు భర్త తన భార్య కనిపించడం లేదంటూ మట్టంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. రెండేళ్ల క్రితం జరిగిన హత్య కేసును చేధించాలని ఎస్పీ భాస్కరన్ ఆదేశాల మేరకు కోదాడ సర్కిల్ పోలీసులు మృతురాలి కొడుకు డీఎన్ఏను పరీక్షించించి.. ఘటనా స్థలంలో దొరికిన డీఎన్ఏ శాంపిల్స్‌తో సరిపోల్చారు.
ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగగా.. ప్రమీల, స్వప్నల మీద అనుమానం ఉన్నట్టు మృతురాలి కుటుంబీకులు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న, రాంభూపాల్ రెడ్డి, మరో వ్యక్తిని నిందితులుగా తేల్చారు. స్వప్న, రాంభూపాల్ రెడ్డి పోలీసుల అదుపులో ఉండగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు డీఎస్పీ రఘు తెలిపారు.