తొమ్మిది మాసాలు మోసిన తల్లే ఆ కుమారుడికి బరువైంది. కనిపెంచిన మమకారం మరచి.. చేరదీయాల్సిన వయసులో ఆ మాతృమూర్తికి నిలువ నీడలేకుండా చేశాడు. ఉన్న ఇంటి నుంచి బయటకు నెట్టి.. తాళాలు వేశాడు. దిక్కుతోచని స్థితిలో సత్రంలో తలదాచుకుంటూ బిక్కు బిక్కు మంటూ గడుపుతోంది. తన ఇంటిని ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మెడికల్ కాలనీకి చెందిన అనసూర్య 65 ఏళ్ల వృద్ధురాలు. ఈమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు మరో చోటు నివాసం ఉంటుండగా.. మిగిలిన ఇద్దరు కుమారులతో ఆమె నివాసం ఉంటుంది. మూడు నెలల క్రితం అనసూర్య భర్త మరణించిన తర్వాత నుంచి చిన్న కొడుకు నగేశ్.. తల్లితో గొడవలు పడుతున్నాడు. విసిగిపోయిన ఆ తల్లి.. భద్రాచలం పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఇల్లు తనదేనంటూ తల్లి, అన్నయ్య దంపతులను ఉన్నపళంగా బయటకు పంపేశాడు. అనంతరం ఇంటికి తాళం వేశాడు.. ఆ సుపుత్రుడు. దీంతో రెండో కుమారుడు, అతని భార్యతో కలిసి ఓ సత్రంలో తలదాచుకుంటోంది. తన ఇంటిని తిరిగి ఇప్పించాలని ప్రాదేయపడుతోంది.