హైదరాబాద్‌లో షేక్‌పేట తహసీల్దార్ పరిధి అంటేనే కాసులపంట. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లతో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. బంజారాహిల్స్ రోడ్ 14లో ఉన్న సుమారు ఎకరంపైగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు ఏకంగా తహసీల్దార్ సుజాతే రంగంలోకి దిగిందని అధికారులు తెలిపారు. న్యాయస్థానం విచారణలో ఉన్న ఈ భూమిని ఖాలిద్ అనే వ్యక్తికి అనుకూలంగా రికార్డు తయారు చేసేందుకు ఆర్ఐ నాగార్జునరెడ్డి సాయంతో రూ.30లక్షలకు కట్టబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా అది కాస్త వాయిదా పడింది.
డబ్బుల కోసం వేధింపులు..
అధికారులంతా కలిసి ఖాలిద్‌ను డబ్బుల కోసం వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండేందుకు బంజారాహిల్స్ ఎస్‌ఐ రవీంద్రనాయక్‌కు రూ.లక్షా 50వేలు ఆశ చూపారు. అధికారుల కుట్రను బయటపెట్టేందుకు ఖాలిద్ అనిశాను ఆశ్రయించాడు. అవినీతిపరులను పట్టుకునేందుకు అనిశా అధికారులు ప్రణాళిక రచించి ఖాలిద్‌ను రంగంలోకి దింపారు. అతని ద్వారా రూ.15 లక్షలు నాగార్జునరెడ్డి తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్నారు. మరోవైపు ఎస్‌ఐ రవీంద్రనాయక్ లంచం తీసుకున్నట్లుగా సాంకేతిక ఆధారాలతో నిర్ధరించి అరెస్టు చేశారు. వీరిద్దరిని రెండు రోజుల పాటు విచారించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.