ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నిందితురాలు దేవికారాణి, ఫార్మసిస్టు నాగలక్ష్మి భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్టు ఏసీబీ గుర్తించింది. కుంభకోణంతోపాటు వీరిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. వారిద్దరూ అక్రమంగా ఆర్జించిన ఆదాయాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. స్థిరాస్తి వ్యాపారి వద్ద బినామీ పేర్లతో ఫ్లాట్లు, దుకాణాలు కొనుగోలు చేసేందుకు రూ.4.47 కోట్లు నగదుతోపాటు మరో రూ.3 కోట్లకు సంబంధించి బ్యాంకు చెక్‌లు, ఇతర చెల్లింపుల ద్వారా లావాదేవీలు జరిపినట్టు బయటపడింది.
ఈఎస్‌ఐ కుంభకోణం: తీగ లాగితే డొంక కదులుతోంది! - ఈఎస్‌ఐ కుంభకోణం
ఈఎస్‌ఐ కుంభకోణం వ్యవహారంలో... తవ్వుతున్న కొద్దీ నిందితుల అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలు వైద్య సేవల సంస్థ మాజీ సంచాలకురాలు దేవికారాణి సహా... సంస్థకు చెందిన ఇతర సిబ్బందిని ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా... నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు. నిందితులు దేవికారాణి, నాగలక్ష్మికి చెందిన రూ.4.47 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వీరు స్థిరాస్తి రంగంలో పెట్టుబడిగా పెట్టినట్టు తేలింది.
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణం వ్యవహారం
వీరు జరిపిన లావాదేవీలకు సంబంధించిన... రూ.4.47 కోట్ల నగదు, చెక్కులు, ఇతర చెల్లింపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు కేసులోని ఇతర నిందితుల ఆస్తులపై కూడా విచారణ బృందం దృష్టి పెట్టింది. ఆ దిశగా నిందితుల్లో ఎవరెవరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేసిన పక్షంలో బాధితులు టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.